మహా జన సంరంభం | Sakshi
Sakshi News home page

మహా జన సంరంభం

Published Tue, Jul 14 2015 12:24 AM

Godavari puskaras to make holy of Janapada culturals

ప్రవహించినంతమేరా పచ్చటి ప్రకృతిని మాత్రమే కాదు... జనపదాలనూ, సంస్కృతీ సంప్రదాయాలనూ పెంపొందింపజేసే నదులకు మనిషి జీవితంలో విశిష్ట స్థానం ఉంది. అవి మనిషి దాహార్తినీ, క్షుదార్తినీ తీర్చడంతోనే ఆగిపోలేదు. సంస్కారాన్నిచ్చాయి. సహజీవనాన్ని నేర్పాయి. విజ్ఞానతృష్ణను రగిల్చి ఉన్నత స్థానానికి చేర్చాయి. నదులను అమ్మలా సంభావించుకుని ప్రణమిల్లడం, పూజాదికాల్లో నదులరీత్యా ఉనికిని చెప్పుకోవడం అందుకే. ప్రాణికోటి మనుగడకు ఆధారమైన పంచభూతాల్లో నీటికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ‘పరోపకారాయ ఫలంతి వృక్షాః/ పరోపకారాయ వహంతి నద్యాః’ అనే సూక్తి నదులకుండే ప్రవాహ గుణంలోని పరోపకారత ను పట్టిచూపుతుంది. మనిషికీ, నదీమతల్లికీ గల అనుబంధాన్ని గుర్తుచేసుకోవడానికి ఒక సందర్భమయ్యే గోదావరి పుష్కరాలు మంగళవారం ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మొదలవుతున్నాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించే క్షణాలను గణనలోకి తీసుకుని తెలంగాణలో ఉదయం 6.21 గంటలకూ...ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 6.26కూ ఈ పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.
 
 పన్నెండేళ్లకొకసారి వచ్చే ఈ పుష్కరాలు జన, జల రాశుల మహా సంగమం. మహా సంరంభం. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో 5 కోట్లమంది, తెలంగాణలో 3 కోట్లమంది పుష్కరాల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈసారి జరిగేవి 144 ఏళ్లకొకసారి వచ్చే మహా పుష్కరాలని కొందరు పండితులు చెబుతున్నారు. అందుకే వీటి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ పుష్కర సమయంలో గోదావరీ తీరాన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలూ, సప్త రుషులూ, పితృ దేవతలూ నడయాడతారని ప్రతీతి. అందుకే ఈ పన్నెండు రోజులూ గోదావరి నది ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. పితృకర్మలు సాగుతాయి.
 
 దక్షిణాన అతి పెద్ద నదిగా...దేశంలో గంగానది తర్వాత రెండో పెద్ద నదిగా ప్రఖ్యాతి చెందిన గోదావరి... మహారాష్ట్రలోని నాసిక్ సమీపాన సహ్యాద్రి కొండల్లో పుట్టి మొత్తంగా 1,465 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంతకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 927 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఒకచోట పర్వత శిఖరాలనుంచి దుమికినా, మరోచోట కొండల్ని ఒరుసుకుంటూ, సుడులు తిరుగుతూ అన్నిటినీ చుట్టబెడుతూ, మహావృక్షాలను సైతం కూకటివేళ్లతో పెకిలిస్తూ ప్రళయ భీకర రూపం చూపినా...వేరొకచోట ప్రశాంత గంభీర వదనంతో ప్రవహించినా, చివరిగా సముద్రంలో సంగమించేందుకు ఉత్తుంగ తరంగాలతో ఉరకలెత్తుతూ వెళ్లినా గోదావరి తీరే వేరు. అది మానవ జీవితంలోని సకల పార్శ్వాలనూ గుర్తుకు తెస్తుంది.
 
 ఈ పుష్కరాల పనుల కోసం రెండు రాష్ట్రాలూ భారీగానే ఖర్చు చేశాయి. పుష్కరాలకొచ్చే భక్తులకు స్నాన ఘట్టాలు మొదలుకొని వసతి సౌకర్యాలవరకూ వివిధ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రోజుకు దాదాపు 25 లక్షలమంది పుష్కర స్నానం చేస్తారన్న అంచనాలతో ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 264 స్నానఘట్టాలను ఏర్పాటుచేశారు. ఇంత భారీయెత్తున ఏర్పాట్లు చేసి కోట్లాది రూపాయలు వ్యయం చేసిన రెండు ప్రభుత్వాలూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికొచ్చేసరికి ముఖం చాటేశాయి. మరికొన్ని గంటల్లో పుష్కరాలు ప్రారంభం కాబోతున్నా పట్టనట్టు కూర్చున్నాయి.  ఫలితంగా పారిశుద్ధ్యం పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అన్నిచోట్లా చెత్తాచెదారం పేరుకుపోయి, డ్రైనేజిలన్నీ పొంగిపొర్లి దుర్గంధం నిండింది.  చినుకు పడిందే తడవుగా భయంకరమైన అంటు వ్యాధులు ప్రబలే స్థితి నెలకొంది. తెలంగాణలో సమ్మె మొదలై 8 రోజులు గడుస్తుంటే...ఏపీలో మూడు రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. కార్మికులు కోరుతున్నవి గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. చాలీచాలని వేతనాలను సరిదిద్దాలంటున్నారు. తమ బతుకుల్ని కాస్తయినా బాగుచేయమంటున్నారు. మిగిలినవారంతా సమీపానికి రావడానికి కూడా హడలెత్తే చెత్తలో నిత్యం మునిగితేలుతూ వీధులను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో కార్మికులు చేస్తున్న కృషి నిజానికి వెలకట్టలేనిది.
 
 అలాంటివారి జీవితాలను కాంట్రాక్టు ఉద్యోగాల్లో పాతేసి, అభద్రతలోకి నెట్టడం అన్యాయమని, అమానుషమని పాలకులు ఎందుకు అనిపించడంలేదో ఆశ్చర్యం కలుగుతుంది.  ఈఎస్‌ఐ సొమ్మును కాంట్రాక్టర్లు, అధికారుల పాలై వైద్య సేవలు లభించని స్థితి ఏర్పడినా కార్మికుల గోడు పట్టించుకునే నాథుడు లేడు. చట్టసభలకు ఒకసారి ఎన్నికైతేనే పెన్షన్‌తోసహా అనేక సౌకర్యాలు పొందేవారు... పౌరులందరికీ ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడంలో రాత్రింబగళ్లు శ్రమించేవారిని చిన్నచూపు చూడటం వింతగొలుపుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైతే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఇప్పటికే పొరుగునున్న తమిళనాడునుంచి పారిశుద్ధ్య కార్మికులను రప్పించింది.
 
 తెలంగాణ సర్కారు సైతం ఆ తోవనే పోదల్చుకున్నట్టు కనబడుతోంది. అస్మదీయులకు కాంట్రాక్టులు అప్పగించి వారికి చేతినిండా పని కల్పించవచ్చు గనుక... కోట్లాది రూపాయలు వెనకేసుకోవచ్చు గనుక పుష్కర పనులంటూ హడావుడి చేస్తారు. వాస్తవానికి స్నాన ఘట్టాలవంటివి శాశ్వత ప్రాతిపదికన ఉండాల్సినవి. అందుకోసం పటిష్టంగా నిర్మాణం చేయాల్సినవి. కానీ పనులు నాసిరకంగా ఉండటంవల్ల వచ్చే పుష్కరాల వరకూ ఉండటం మాట అటుంచి కొన్ని నెలలకే నామరూపాల్లేకుండా పోతున్నాయి. కనుకనే ప్రతిసారీ వాటి కోసం కోట్లు ఖర్చుచేయాల్సివస్తున్నది. రోడ్ల సంగతి చెప్పనవసరమే లేదు. ఖర్చుచేశామన్న సొమ్ముతో పోల్చిచూస్తే జరిగిన పనులు సరిగా లేవన్నది అర్థమవుతుంది. భక్తినీ, చిత్తశుద్ధినీ, సత్సంకల్పాన్నీ పెంపొందింపజేసే ఈ పుష్కరాలు పాలకులకు సద్బుద్ధిని కలిగిస్తే మున్సిపల్ కార్మికులకూ, పౌరులకూ మేలు కలుగుతుంది.

Advertisement
Advertisement