మాలతీ చందూర్ గారు... | Sakshi
Sakshi News home page

మాలతీ చందూర్ గారు...

Published Sun, Aug 25 2013 11:46 PM

మాలతీ చందూర్ గారు...

నివాళి
 
 దాదాపు నలభైయేళ్ల క్రితం పి.యు.సి చదువు అయీ కాకుండా మెరైన్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాయడానికి మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. మా మేనత్త, ఆమెకు అప్పటికి అరవై యేళ్లు ఉంటాయి, ‘పరీక్ష ఎట్లా వెలగబెట్టినా పర్వాలేదుగాని, మాలతీ చందూర్‌ని చూడకుండా మాత్రం రావద్దు’ అంటూ పది రూపాయలు తనుగా యిచ్చింది. పరీక్ష రాశాను. తర్వాత మెరీనా బీచ్, హార్బర్, జూ, స్టూడియో గేట్లు, మౌంట్ రోడ్డు, మూర్ మార్కెట్ యిత్యాది చెన్నపట్నం విశేషాలను చూశాను. అప్పట్లో పది రూపాయలు యిస్తే ఒక డకోటా విమానంలో మద్రాసు నగరాన్ని ఒక చుట్టు తిప్పి విహంగ వీక్షణం చేయించేవారు. ఇంకా విమానం గాలిలోకి వెళుతుందని నేను కలలు కంటూ ఉండగా అయిపోయింది దిగండన్నారు. ‘యింతేనా’ అంటే ‘అంతే’ అన్నారు.
 
 అయితే అంత చిన్న వయసులో విమానం యెక్కిన కీర్తి మా బంధుమిత్రులలో నాకు మాత్రమే దక్కింది. మా ఊరు వెళ్లాక నా విమానయానం గురించి చాలామంది ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. నేను కూడా ‘సమయానికి తగుమాటలాడి’ ఉత్కంఠభరితంగా బోలెడు గాలి పోగు చేసి చెప్పక తప్పలేదు. మా మేనత్త మాత్రం తనిచ్చిన పది రూపాయలూ యీ విధంగా దుర్వినియోగం చేసినందుకు గట్టిగానే మందలించింది. మద్రాసులో నేను రాసిన ప్రవేశపరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు ‘మరంతే, ఫలితం అనుభవించక తప్పదు’ అని కసి తీరా ఆనందపడింది.
 
 ఆ రోజుల్లో చాలామంది మాలతీ చందూర్ అంటే ఒక చూడతగిన వింత. పైగా ఆవిడ ప్రమదావనాలు, వంటలూ- పిండి వంటలూ, ప్రశ్నలూ- జవాబులూ వారం వారం
 కనిపించేవిగాని ఆమె ఫోటో ఎక్కడా కనిపించేది కాదు. దాంతో చాలామంది అభిమాన పాఠకులకు మరింత ఉత్సుకతగా ఉండేది. కొందరు మాలతీ చందూర్ పేరునిబట్టి
 ఉత్తరాది వాళ్లనుకునేవాళ్లు. పత్రికా రంగంలో అడుగు పెట్టాక పూర్తిగా తెలుగువాళ్లేననీ, ప.గో.జి. అనీ, చందూరు ఇంటి పేరనీ, మాలతి అసలు పేరనీ తెలుసుకోగలిగాను. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉందంటారు. కాని
 మాలతిగారి విజయం వెనుక ఒక పురుషుడు ఉన్నాడని
 తెలిసినప్పుడు గర్వించాను. ఎన్నార్ చందూర్ అనే చందూరు నాగేశ్వరరావుగారిని చూసినప్పుడు, ఎమ్మెస్
 సరసన సదాశివమ్‌లా కన్పించేవారు. అందుకని కనీసం మాలతి వరకైనా పురుషాధిక్య ప్రపంచం గురించి, మా జాతి అవలక్షణాల గురించి ఉన్నవీ లేనివీ మాట్లాడే దూకుడు తగ్గించుకోవలసిన చారిత్రక అగత్యం యేర్పడింది. దాని వల్ల సమతూకమైన చక్కని సాహిత్యం మాలతీ చందూర్ నుంచి వెలువడి, అర్ధశతాబ్ధికి పైగా తెలుగు పత్రికారంగాన్ని
 సుసంపన్నం చేస్తూ ఉంది. ఇంకా చేస్తూనే ఉంటుంది.
 ఆ రోజుల్లో తెలుగు పత్రికలు కూడా చాలా వరకు మద్రాసు నుంచే వెలువడేవి. అప్పటికి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రి లాంటి కథక చక్రవర్తులు గ్రామీణ వాతావరణంలో, గ్రామీణ యితివృత్తాలలో మాత్రమే రాసేవారు. 1950లలో ముళ్లపూడి వెంకటరమణ కథలతో తెలుగు కథ అర్బనైజ్ అయ్యింది. ముళ్లపూడి మధ్యతరగతిని  గమనిస్తే, రావిశాస్త్రి అధఃపతితులను చూపించారు. మాలతీచందూర్ కథలన్నిటికీ నేపథ్యం చెన్నపట్నమే. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం దేశీ పబ్లికేషన్స్‌వారు
 
 మాలతిగారి కథాసంపుటి ‘పాప’ అచ్చు వేశారు. అందులో లజ్ కార్నర్, పాప, తనూ-నీరజా, శానమ్మ, జూలీ, విలువయెంత? ఏడుకొండలవాడా, జమున వేసిన భారం కథలు ఉన్నాయి. లజ్ కార్నర్ నాకు చాలా యిష్టమైన కథల్లో వొకటి. అందులో ఫోన్ నంబరు నాలుగు డిజిట్స్‌లో ఉంటుంది. ఇప్పుడు
 
 మద్రాసులో ఎనిమిది డిజిట్లు. అప్పుడు లోకల్ కాల్‌కి ఫోన్‌లో రెండు అణాబిళ్లలు వెయ్యాలి. ఇంకా అప్పటికి నయాపైసలు రాలేదు. ఆ కథలో హీరో తల్లి అంటే నాకు చాలా ఇష్టం. పాపం, చాలా మంచావిడ.
 1978లో మద్రాసు వెళ్లినప్పుడు, ఆమెను కలిసినప్పుడు జయకాంతన్ నవల ‘సిలనేరంగళ్’... నేషనల్ బుక్‌ట్రస్ట్ వారు కోరితే తెలుగు చేస్తున్నానని చెప్పారు మాలతీ చందూర్. ముందుగా ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురిస్తే పదిమందీ చదువుతారు, నే.బు.ట్ర వారు వేస్తే గోడౌన్‌కే
 పరిమితం కదా అంటే- సీరియల్ చేయడానికి అంగీకరించారు. దానికి బాపు బొమ్మలు వేశారు. గోముఖ వ్యాఘ్రాలు, మేకవన్నె పులులు, రుద్రాక్షలు ధరించిన తోడేళ్లు... యిలా ఆయా పాత్రలను కొత్త తరహాలో చిత్రించారు. ఆ రోజులలో యీ ధారావాహిక ఒక సంచలనం.
 మాలతీ చందూర్లు ఉండేది లజ్ కార్నర్‌లోనే. వాళ్ల యింటికి నడక దూరంలో కపాలేశ్వరస్వామి గుడి, అక్కడ ఒక కొలను, దాని పక్కన పెద్ద కూరగాయల మార్కెట్టు ఉంది. అక్కడ కొన్ని మంచి ఆకుకూరలు, మామిడి అల్లం, పచ్చిమిరియాలు, అరటిపూలు, అరటి దూట, పనసపొడిలాంటి అరుదైనవి దొరికేవి. నాకు యివేవో కొంటూ మాలతిగారు తరచూ కనిపించేవారు. మేము కూడా అదే ప్రిఫర్ చేసేవాళ్లం. ఆవిడ ఏవి కొన్నారో గమనించి నేనూ అవే కూరలు కొనేవాణ్ణి. ఆవిడ తెలుగువారికి యింతటి అభిమాన రచయిత్రి అవడానికి కారణాలలో శాకపాకాలు కూడా వొకటై వుండవచ్చని నా అనుమానం. ఈ సందర్భంలో ఒక సంఘటన జ్ఞాపకం వస్తోంది.
 
 బందరులో విశ్వనాథ సత్యనారాయణ పని చేసే రోజులలో, మల్లాది రామకృష్ణశాస్త్రి కూడా అక్కడే ఉండేవారు. మల్లాది ఒక ప్రెస్ దగ్గర కొలువు తీరేవారు. ఒకరోజు విశ్వనాథ సోదరుడు వెంకటేశ్వర్లు కూరల సంచీతో బరువుగా రోడ్డున వెళ్తుంటే మల్లాది ఆపారట. సంచీలో బీరకాయలు, పొట్లకాయలు, ములక్కాడలు కన్పించాయట. వేళ్ల సందున బిగించిన సిగరెట్ పొగలాగుతూ ‘ఏమోయ్ మీ అన్నయ్య యివి తినే రామాయణం రాస్తున్నారా’ అన్నారట గంభీరంగా. ఆయన జవాబు చెప్పక రోషంగా వెళ్లిపోయాట్ట. అంటే సుక్షత్రియుడైన రాముడిపై కావ్యం రాసేవాళ్లు పొట్లకాయలాంటి నీటి కూరలు తినడమేమిటని శాస్త్రిగారి చెణుకు.
 
 ఆంధ్రప్రభలో నిరాఘాటంగా సుమారు అర్ధశతాబ్ది పాటు జవాబులు శీర్షిక నడిపిన విదుషీమణి మాలతీ చందూర్. ఎన్నో రకాల సమస్యలకు ఆత్మీయంగా జవాబులు యిస్తూ, వోదారుస్తూ, ధైర్యం చెబుతూ తెలుగువారి ఆప్తవర్గంలో చేరిపోయారు. అంటే ఇప్పుడు పత్రికల్లో నడుస్తున్న కౌన్సిలింగ్స్ వంటి శీర్షికలకు యాభై ఏళ్ల కంటే ముందే మాలతీ చందూర్ శ్రీకారం చుట్టారన్నమాట. ఇంగ్లిష్‌లో వచ్చిన మంచి నవలలను తెలుగువారికి పరిచయం చేసే ‘పాతకెరటాలు’ శీర్షికను అద్వితీయమైనదిగా చెప్పవచ్చు. స్నేహసౌహార్ద్రాలకు చందూరివారిది పుట్టిల్లు. మద్రాసు నగరంలోకి ఏ తెలుగు ప్రముఖులు వచ్చినా వారిని పలకరించకుండా వెళ్లరు. ఎన్నార్ చందూర్ నడిపే జగతి డైరీలోకి ఎక్కకుండా ఉండరు.
 
 మాలతీ చందూర్ శైలి సూటిగా సుఖంగా ఉంటుంది. డొంక తిరుగుళ్లు, ధ్వని అలంకారాలు, గహనమైన ఉపమానాలు ఉండవు. హాస్యోక్తులు, అడ్డుపడే పాత్రలు ఉండవు. కథ వడివడిగా నడుస్తుంది. వ్యక్తిగత జీవితంగాని, సాహిత్యజీవితంగాని సంస్కారవంతంగా గడిపి పాఠకుల మనసులో గౌరవప్రదంగా నిలబడిపోయే అదృష్టం బహుశా మాలతీ చందూర్‌లాంటి అతి కొద్దిమందికే సాధ్యం.
 - శ్రీరమణ
 
 మాలతీ చందూర్ నవలలు
 1. శతాబ్ది సూరీడు 2. హృదయనేత్రి 3. శిశిర వసంతం
 4. సద్యోగం 5.ఆలోచించు
 6. రాగరక్తిమ 7. ఏమిటీ
 జీవితాలు 8. భూమిపుత్రి 9. కాంచనమృగం 10. కృష్ణవేణి
 11. జయ-లక్ష్మి
 12. ఏది గమ్యం? ఏది మార్గం 13. ఎన్ని మెట్లెక్కినా
 14. రెక్కలు - చుక్కలు
 15. కలల వెలుగు
 16. రేణుకాదేవి ఆత్మకథ.
 
 ‘‘మాలతీ చందూర్ నవలా నిర్మాణం సూటిగా, స్పష్టంగా ఉంటుంది. రచయిత్రిగా ఆమె ప్రత్యేకంగా ఒకరి పక్షం వహించి కథ నడపరు. వ్యక్తులనూ పరిస్థితులనూ మన ముందుంచుతారు. మన సంస్కారాలను బట్టి మనం యే పాత్రను యెక్కువ యిష్టపడతామనేది ఉంటుంది’’
 - ఓల్గా
 
 ‘‘మాలతీ చందూర్ రచనలు, సాహిత్య పరిచయాలు స్త్రీలను ఆకట్టుకున్నాయి. ఎందర్నో రచనలు చేయడానికి పురికొల్పాయి. అట్లా రచయితలు రచయిత్రులైన వాళ్లున్నారు ఉత్తమ సాహిత్య పాఠకులైన వాళ్లున్నారు. ఉత్తమ గృహిణులుగా ఉత్తమ సంస్కారం గల మహిళలుగా రూపుదిద్దుకున్న వాళ్లున్నారు.’’
 - ముదిగంటి సుజాతారెడ్డి
 
 ‘‘స్త్రీల విద్యా ఉద్యోగ జీవిత రంగ సంఘర్షణలను సర్దుబాట్లను, స్వతంత్ర వ్యక్తులుగా నిలబడాలన్న జీవన ఆకాంక్షలను, ఆత్మగౌరవ చైతన్యాన్ని ఇతివృత్తంలో భాగం చేసి నవలలు రాసిన వాళ్లు చాలా కొద్దిమంది కనపడతారు. వారిలో డా.పి.శ్రీదేవి తరువాత చెప్పుకొనవలసిన నవలా
 రచయిత్రి మాలతీ చందూర్.’’
 - కాత్యాయనీ విద్మహే
 
 మాలతీ చందూర్ రచనల్లో మనకు
 ప్రధానంగా కన్పించే అంశాలు ఆమె భావగాంభీర్యం, సునిశితమైన పరిశీలన, విస్తృత పఠనం, అధ్యయనం, సరళమైన రచనా విధానం. అంతేకాదు కాలనికంటే ముందుండే నైజం, చెప్పదలచుకున్న విషయాన్ని సందర్భోచితంగా, వాదనా పటిమతో, సమయస్ఫూర్తితో రచించే శైలీ నైపుణ్యం... ఇవన్నీ కలగలిపితే, కలిస్తే ఆమె మాలతీ చందూర్’’
 - డాక్టర్ శిలాలోలిత
 

Advertisement
Advertisement