వధ్య శిలపై విద్యార్థులు | Sakshi
Sakshi News home page

వధ్య శిలపై విద్యార్థులు

Published Sun, Oct 15 2017 12:42 AM

k ramachandra murthy writes a story on student suicides - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర ఆందోళన కలిగిస్తోంది. కార్పొరేట్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థులే బలవన్మరణం చెందుతున్నారు. చదువులో రాణించలేమోనన్న భయం, తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాసలు అవుతాయన్న ఆందోళన, తోటి విద్యార్థులతో పోల్చి అసమర్థులుగా చిత్రించడంతో న్యూనతాభావానికి లోనైనప్పుడు కలిగే మనస్తాపం విద్యార్థులను, ముఖ్యంగా ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులను ఆత్మహత్యకు పురి గొల్పుతున్నాయి. కడచిన రెండు సంవత్సరాలలో దాదాపు నలభై మంది విద్యార్థులు ఆత్యహత్య చేసుకున్నారు. వీరిలో పాతికమంది దాకా నారాయణ, చైతన్య విద్యా సంస్థల హాస్టళ్ళలో నివసిస్తూ చదువుకుంటున్నవారే.

సెప్టెంబర్‌ 17న కృష్ణాజిల్లా గూడవల్లిలో నారాయణ కాలేజిలో చదువుతున్న ఈశ్వరరెడ్డిపై అధ్యాపకులు చేయిచేసుకుంటే అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మరునాడు నెల్లూరు జిల్లా గూడూరులో నారాయణ కళాశాలలోనే అధ్యాపకులు కొట్టినప్పుడు దిలీప్‌ అనే విద్యార్థి కర్ణభేరి చిట్లిపోయింది. శనివారం నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వీటన్నిటిపైనా పత్రికలలో వార్తలు వచ్చాయి. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడల్లా ఆ సంగతి తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయకుండా వారిని ఆస్పత్రుల్లో చేర్పించి, వైద్యం చేస్తున్న సమయంలో మృతి చెందినట్టు సర్టిఫికెట్‌ తీసుకున్న అనంతరమే వారి మరణవార్త చేరేస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది.

విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు శనివారంనాడు విశాఖపట్టణంలో కార్పొరేట్‌ హాస్టళ్ళను తనిఖీ చేసిన తర్వాత కొన్ని వాస్తవాలు ప్రకటించారు. చాలా కార్పొరేట్‌ హాస్టళ్ళకు అనుమతులు లేవనీ, అటువంటి హాస్టళ్ళకు నోటీసులు ఇచ్చామనీ, అవసరమైతే మూసివేయడానికైనా ప్రభుత్వం వెనకాడదనీ ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం గత మూడున్నర సంవత్సరాలుగా చేసింది శూన్యం. ఇన్ని పసిప్రాణాలు నిష్కారణంగా అనంతవాయువుల్లో కలిసిపోయినప్పటికీ ఒక్క హాస్టల్‌ యాజమాన్యంపైన కానీ, ఒక్క కాలేజి యాజమాన్యం పైన కానీ పోలీసు కేసు నమోదు చేసిన దాఖలా లేదు.

అమలు కాని సంస్కరణలు 
నారాయణ కళాశాల విద్యార్థులు నందిని, మనీషాలు చనిపోయినప్పుడు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక సమర్పించినా చర్యలు తీసుకోలేదు. ఆత్యహత్యలు పెరగడానికి కారణాలు ఏమిటో అధ్యయనం చేయడానికి రెండేళ్ళ కిందట (2015) ఐఏఎస్‌ అధికారి చక్రపాణి, మాజీ వైస్‌చాన్సలర్‌ రత్నకుమారితో ఒక కమిటీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ యేడాది మే నాలుగో తేదీన ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ సిఫార్సులను వెంటనే అమలు చేస్తే ఇన్ని అనర్థాలు జరిగేవి కావు. ప్రతి కార్పొరేట్‌ కళాశాలకీ ఒక కౌన్సిలర్‌ను నియమించాలని కమిటీ చెప్పింది. నియమించలేదు. విద్యార్థులకూ, తల్లిదండ్రులకూ కలిపి ప్రత్యేకంగా ఒక యాప్‌ను తయారు చేసి అందించాలని కమిటీ చెప్పింది. ఆ పని జరగలేదు.

ఇంటర్మీడియట్‌ తర్వాత ఏయే కోర్సులు తీసుకోవచ్చునో, ఎటువంటి ఉద్యోగాల కోసం చదువుకోవచ్చునో వివరించే వ్యవస్థ ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. అదీ ఏర్పాటు కాలేదు. ప్రతి సబ్జెక్టులో నెలకు ఒకే ఒక పరీక్ష ఉండాలనీ, అంతకంటే ఎక్కువ పరీక్షలు ఉండరాదనీ కమిటీ నొక్కి చెప్పింది. కార్పొరేట్‌ సంస్థలు తమకు తోచిన రీతిలోనే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రతి ఆరుమాసాలకూ ఒకసారి తల్లిదండ్రులు, విద్యార్థులతో సమాలోచన ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. నేటికీ తల్లిదండ్రులను అధ్యాపకులు దగ్గరికి రానివ్వరు. పరీక్షలలో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులను మాటిమాటికీ సెక్షన్లు మార్చి అవమానించవద్దని కమిటీ చెప్పింది. ఇదీ అమలుకు నోచుకోలేదు. సెక్షన్లు మార్చి, పనికిరానివారని ముద్రవేయించుకున్న విద్యార్థులు నిరాశానిస్పృహలకు లోనవుతూనే ఉన్నారు.

టెస్ట్‌లలో విద్యార్థులకు వచ్చిన మార్కులను నోటీసు బోర్డులపైన పెట్టి వారిని ఆత్మన్యూనతా భావానికి లోను చేయవద్దని చక్రపాణి కమిటీ సూటిగా చెప్పింది. అది ఆగలేదు. ఉదయం ఎనిమిదిగంటల లోపూ, సాయంత్రం ఆరు తర్వాతా క్లాసులు ఉండరాదంటూ స్పష్టం చేసింది. హాస్టళ్ళలో విద్యార్థులను ఉదయం నాలుగు గంటలకే లేపుతారు. ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకూ క్లాసు ఉంటుంది. ఏడు నుంచి ఎనిమిది గంటల వరకూ అల్పాహారం. ఆ తర్వాత మధ్యాహ్న భోజన విరామం వరకూ రుబ్బుడు. భోజనం తర్వాత అదే కార్యక్రమం రాత్రి పదిన్నర వరకూ సాగుతుంది. పదింటికి హాస్టలు గదికి చేరిన విద్యార్థులు ఏడెనిమిది మంది దాకా ఒకే గదిలో ఉండాలి. వాళ్ళు కబుర్లు చెప్పుకొని నిద్రకు ఉపక్రమించే సరికి అర్ధరాత్రి దాటుతుంది. మళ్ళీ తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్ర లేపుతారు. 

బట్టీ యంత్రాలు
ఈ దైనందిన చర్యలలో వేరే పుస్తకాలు చదవడం లేదు. ఆటపాటలు అసలే లేవు. విశ్రాంతి లేదు. వినోదం లేదు. బట్టీ పట్టడమే కానీ ఒక సమస్యను ఎట్లా పరిష్కరించాలో సొంతంగా ఆలోచించడం, విశ్లేషించడం నేర్పరు. రాజకీయాలు పట్టవు. సమాజం తెలియదు. ఒకే స్థాయి ప్రతిభ కలిగినవారు ఒకే బ్యాచ్‌లో ఉంటారు కనుక తమ కంటే ఎక్కువ లేదా తక్కువ ప్రతిభ కలిగిన విద్యార్థులతో మాట్లాడటం, వారి సంగతులు తెలుసుకోవడం సాధ్యం కాదు. యోగా, వ్యాయామం విధిగా బోధించాలని కూడా చక్రపాణి కమిటీ సిఫార్సు చేసింది. ఇది కూడా అమలు జరగడం లేదు. వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఆ ఊసే లేదు. ఆటస్థలం తప్పని సరిగా ఉండాలనీ, గ్రంథాలయం ప్రతి హాస్టల్‌లో ఉండాలనీ, రీడింగ్‌ రూంలు కూడా ఏర్పాటు చేయాలనీ సిఫార్సు చేసినా ఏ సంస్థ కూడా అటువంటి ప్రయత్నం చేయలేదు.

ఈ కమిటీ నివేదికను అన్ని కార్పొరేట్‌ సంస్థలకు పంపామంటూ విద్యామంత్రి చెప్పారు కానీ ఇంతకాలం ఎందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదో వివరించలేదు. చక్రపాణి కమిటీ తన బాధ్యతను అద్భుతంగా నిర్వహించింది. యుద్ధ ప్రాతిపదికన చక్రపాణి కమిటీ సిఫార్సులను అమలు చేసి ఆత్యహత్యలు నిరోధించవలసిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. సూచనలు అమలు తీరును సమీక్షించేందుకు రెండు కమిటీలను నియమించాలని కూడా చక్రపాణి కమిటీ కోరింది. ఒకటి, మానిటరింగ్‌ కమిటీ. ప్రతి కార్పొరేట్‌ సంస్థకు చెందిన ప్రతి హాస్టల్‌కూ పర్యవేక్షక కమిటీని నియమించాలి. రెండు, ఎథికల్‌ కమిటీ. నైతిక విలువలను పరిరక్షించే కమిటీలో జాయింట్‌ కలెక్టర్, మహిళా సంక్షేమ అధికారి, ఇంటర్‌ విద్య ఆర్‌జేడీ (రీజియనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌), ఇద్దరు పౌరసమాజం ప్రతినిధులు ఉండాలన్నారు. ఈ కమిటీలను జిల్లా కలెక్టర్లు నియమించాలి. ఇందులో కార్పొరేట్‌ హాస్టళ్ళు ఐచ్ఛికంగా చేసే పనులు ఏవీ లేవు. అన్నీ ప్రభుత్వం చొరవతో అమలు కావలసిన సంస్కరణలే.

తల్లిదండ్రుల ఆకాంక్షలు
కార్పొరేట్‌ విద్యా సంస్థలూ, ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల జీవితాలను నరకప్రాయం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పిల్లలకు ఎందులో ఆసక్తి ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తమ ఆశలకూ, ఆకాంక్షలకూ అనుగుణంగా వారు ఎదగాలనీ, చదవాలనీ పట్టుపడుతున్నారు. వారిపైన అసాధారణమైన ఒత్తిడి తెస్తున్నారు. వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించడానికి బదులు ఏదో ఒక విధంగా సర్దుకుపోవాలనీ, రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే మంచి ర్యాంకు వస్తుందనీ, డాక్టరో, ఇంజనీరో కావచ్చునని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. హాస్టళ్ళలోని దుర్భర పరిస్థితులు తెలిసినప్పటికీ, నిర్విరామంగా చదవడం అనేది ఎంత కష్టమో ఊహించుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా పిల్లలు మంచి ర్యాంకు సంపాదిస్తే తమ ఆకాంక్ష నెరవేరుతుందని తలపోస్తున్నారు.

ఖర్చుకు వెరపు లేదు. తల తాకట్టు పెట్టి అయినా సంవత్సరానికి 1.20 లక్షల ఫీజు కట్టడానికి వెనకాడటం లేదు. పరీక్షల సమయంలో విద్యార్థులే కాదు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురి అవుతున్నారు. పిల్లల పరీక్షలప్పుడు రక్తపోటు పెరిగిన కొంతమంది తల్లిదండ్రులను తానే ఆస్పత్రిలో చేర్చిన సందర్భాలు ఉన్నాయని ముంబయ్‌కి చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త అంజలి ఛబ్రియా అంటున్నారు. పరీక్షా విధానంలో సంస్కరణలు అమలు చేయాలంటూ యశ్‌పాల్, సైరస్‌ వకీల్‌ వంటి విద్యావేత్తలు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. పద్నాలుగు సంవత్సరాల చదువు ద్వారా సాధించిన జ్ఞానాన్ని ఒకే ఒక్క పరీక్షలో తేల్చి విద్యార్థి భవి ష్యత్తును శాసించడం న్యాయం కాదని ఎంతమంది చెప్పినా ర్యాంకింగ్‌ విధానం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిరుడు మేలో నివేదిక సమర్పించిన టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌ కమిటీ కూడా మార్కులకూ, ర్యాంకులకూ స్వస్తి చెప్పాలనీ, అన్ని స్థాయిలలోనూ గ్రేడింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. పదవ తరగతి స్థాయిలో గ్రేడింగ్‌ విధానం అమలులోకి వచ్చింది కానీ ఇంటర్‌లో అమలు కావడం లేదు. పదవ తరగతిలో సాధారణంగా ఉండే సిలబస్‌ ఇంటర్‌కి వచ్చేసరికి అసాధారణంగా పెరిగిపోతోంది. దీన్ని కూడా ఎవరూ పట్టించుకోవడంలేదు.

1966లో విద్యాసంస్కరణలను ప్రతిపాదించిన కొఠారి కమిషన్‌ సైతం సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను పిల్లలో పెంచిపోషించాలని ఉద్ఘోషిం చింది. సాంఘిక శాస్త్రం అనవసరమని భావించే రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చారు. విద్యార్థికి ఎటువంటి ఉద్యోగం (కెరీర్‌) సరిపోతుందో నిర్ణయించే క్రమంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాలుపంచుకోవాలి. విద్యార్థి అసక్తి ఎటువైపు ఉన్నదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్లాసు రూం లోనే కాకుండా బయట విద్యార్థి పెరిగిన వాతావరణం, స్నేహితులు, ఇతర అంశాలు అనేకం అతని ఎదుగుదలను నిర్దేశిస్తాయి. విద్యార్థికి తెలియకుండానే ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులూ అతడిని జాగ్రత్తగా గమనించి అతని భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇది ఇంటర్‌ స్థాయిలో కాదు, చాలా ముందుగానే నిర్ణయం అవుతుంది. విద్యార్థి అసక్తిని పట్టించుకోకుండా తల్లిదండ్రులు తాము పెట్టుకున్న లక్ష్యాలను నెరవేర్చాలంటూ ఒత్తిడి తెచ్చినప్పుడు విద్యార్థి అలజడికి గురి అవుతాడు. ఇంటర్‌ పరీక్ష లేదా ఎంసెట్‌ పరీక్ష జీవితంలో అత్యంత ప్రధానమైనదనీ, అదే చివరి అవకాశమనీ, ఈ పరీక్షలో ర్యాంకు సాధిం చకపోతే భవిష్యత్తు లేదనీ భావించిన విద్యార్థులు విపరీతమైన ఒత్తిడి తట్టుకోలేక ఆత్యహత్యలకు ఒడిగడుతున్నారు. 

విద్యారంగంలో సంస్కరణల గురించి పట్టించుకోకుండా, కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాల అడుగులకు మడుగులొత్తుతూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఆత్యహత్య చేసుకున్న ఒక్క విద్యార్థి కుటుంబాన్ని కూడా విద్యామంత్రి, ముఖ్యమంత్రి పరామర్శించి నట్టు వార్తలు రాలేదు. ఇంతమంది బలవన్మరణం చెందినప్పటికీ ముఖ్యమంత్రి స్పందించలేదు. మంత్రివర్గ సహచరుడే కార్పొరేట్‌ విద్యాసంస్థల అధిపతి అయినప్పుడు, ఆయన చాలా ముఖ్యమైన మంత్రి అయినప్పుడు, విద్యామంత్రికి సమీప బంధువైనప్పుడు విద్యాశాఖ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ తప్పు చేస్తున్న హాస్టళ్ళపైన కానీ కాలేజి యాజమాన్యాలపైన కానీ చట్టపరమైన శిక్షాత్మక చర్యలు తీసుకోవడానికి జంకుతారు. ఈ పరిస్థితిని సరిదిద్ది, కార్పొరేట్‌ కళాశాలల, హాస్టళ్ళను దారిలో పెట్టి, విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపి ఆత్మహత్యల పరంపరకు అడ్డుకట్టవేయవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పౌరసమాజానికి కూడా ఉన్నది.

కె. రామచంద్రమూర్తి

Advertisement
Advertisement