‘పండుటీగ’ పని పడదాం! | Sakshi
Sakshi News home page

‘పండుటీగ’ పని పడదాం!

Published Sun, May 11 2014 11:34 PM

‘పండుటీగ’ పని పడదాం! - Sakshi

ఫ్రూట్ ఫైల.. అంటే పండుటీగ (ఫ్రూట్‌ఫ్ల). ఇది పండ్లు, కూరగాయల తోటలకే కాదు ఏకంగా ఎగుమతులకూ ఎసరు పెట్టగలదు. దీని భయంతోనే మన దేశం నుంచి అల్ఫాన్సో మామిడి పండ్లు, వంగ, బీర, కాకర తదితర కూరగాయల దిగుమతిని ఐరోపా దేశాల కూటమి ఇటీవల నిషేధించింది. ఈ నేపథ్యంలో పండుటీగను సేంద్రియ పద్ధతిలో సమర్థవంతంగా అరికట్టడం ఎలాగో వివరంగా తెలుసుకుందాం..
 పండ్లు, కూరగాయ తోటల్లో పండుటీగ పెద్ద సమస్యే. మామిడి, జామ, బొప్పాయి, పనస, చీనీ (బత్తాయి), దానిమ్మ వంటి పండ్ల తోటలతో పాటు అన్ని రకాల కూరగాయ పంటలను ఆశిస్తున్న పండుటీగ పంటలకు తీవ్ర నష్టం చేస్తోంది.

 

ఆడ పండుటీగ కాయల మీద వాలి, రంధ్రాలు చేసి గుడ్లు పెడుతుంది. అవి లార్వాలుగా మారి.. పండును తినేయడం ప్రారంభిస్తాయి. దీంతో కాయలపై ఆ భాగం కుళ్లిపోయి కాయ నాణ్యత దెబ్బతింటుంది. కాయ శుష్కించి రాలిపోవచ్చు కూడా. విదేశాలకు ఎగుమతే లక్ష్యంగా పండించే పండ్ల తోటల్లో రైతులు పండ్లకు కాగితం లేదా నైలాన్ సంచులను తొడుగుతారు. ఇది రైతుకు ఆర్థికంగా భారమే. ఈ సమస్యను పరిష్కరించేందుకు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో అత్యంత ప్రభావవంతమైన, చవకైన పద్ధతి అందుబాటులో ఉంది.

అడవి అల్లంతో పండుటీగకు చెక్!
అల్పినియా గలంగాల్ శాస్త్రీయ నామం గల అల్లం జాతి మొక్క దుంపల రసాన్ని పులియబెట్టి దానికి నీటిని చేర్చి పిచికారి చేయడం ద్వారా అన్ని రకాల ఉద్యాన పంటల్లో పండుటీగ సమస్యను సమర్థవంతంగా నిరోధించవచ్చు. దీన్ని సంస్కృతంలో సుగంధ మూలం/ రస్నా అంటారు. తెలుగులో అడవి అల్లం/ పెద్ద దుంప రాష్ట్రం/ కచ్చూరం అని పిలుస్తారు. అనేక విశేష గుణాలున్న ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో బ్యాక్టీరియా, వైరస్ సంబంధిత వ్యాధులతో పాటు అనేక ఇతర వ్యాధులను నయం చేయడానికి వాడుతున్నారు.

క్రీ. పూ. 4 వేల ఏళ్ల క్రితం నుంచి ఈ మొక్కను వినియోగిస్తున్నట్లు ఆధారాలున్నాయి. అడవి అల్లంతో తయారు చేసిన ద్రావణం వినియోగించినప్పుడు పండుటీగను 99.21 శాతం నిరోధించగలిగినట్లు పలు దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మొక్క దుంపలో గాలాగిన్ లేదా గలంగోల్ అనే రసాయనంతో పాటు సుగంధ తైలం ఉంది. ఇవి సమర్థవంతమైన శిలీంద్ర నాశినిగా పనిచేస్తాయని పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి.

ద్రావణం తయారీ విధానం
అడవి అల్లం ముదురు దుంపలను సేకరించి మెత్తగా నూరుకోవాలి. ఈ ముద్దకు దాని పరిమాణంలో పదొంతులు ఎక్కువ నీరు చేర్చి ఒక మట్టి కుండ లేదా ప్లాస్టిక్ జాడీలో పులియబెట్టాలి. 24 గంటలు పులిసిన తర్వాత దీన్ని వడకట్టి ఒక లీటరు ద్రావణానికి పది లీటర్ల నీరు చేర్చి పిచికారీ చేయాలి.

నిల్వ చేయడం ఇలా..
ఈ ద్రావణం నిల్వ ఉంచితే రెండు రోజుల్లో దుర్వాసన ప్రారంభమౌతుంది. 95 శాతం ఈథైల్ అల్కాహాల్‌లో దీన్ని పులియ బెడితే ద్రావణం సంవత్సరాలపాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఈథైల్ అల్కాహాల్ అందుబాటులో లేకపోతే ఏం చేయాలి? దుంపలను శుభ్రంగా తుడిచి ముక్కలుగా తరిగి, దంచి ముద్ద చేసుకోవాలి. ఆ ముద్ద బరువుకు సమాన పరిమాణంలో బెల్లం కలిపి ఒక పాత్రలో వేసి, దాని మూతకు కాగితం చుట్టి, కట్టుకట్టి ఎండ సోకని ప్రాంతంలో ఉంచాలి. సాధారణ ఉష్ణోగ్రత వద్ద వారం నుంచి పది రోజుల్లోగా అల్లం, బెల్లం కలిసి చిక్కటి ద్రావణం తయారవుతుంది. ఆ ముద్దను ఓ గుడ్డలో కట్టి మెలి తిప్పి లేదా మిక్సీలో వేసి రసం తీయాలి. ఈ రసానికి రెట్టింపు పరిమాణంలో బీరు చేర్చి, సీసాల్లో నిల్వ చేసుకోవాలి.

ఎంత మోతాదులో చల్లాలి?
20 లీటర్ల నీటికి 50 నుంచి 70 మిల్లీ లీటర్ల మందు ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి. కాయలు బఠానీ గింజలంత ఉన్న దశ నుంచి పిచికారీ చేయాలి. పండుటీగల ఉధృతిని బట్టి పది రోజుల వ్యవధిలో చల్లుతూ ఉంటే.. పండుటీగలతో పాటు ఇతర కీటకాలను కూడా పారదోలవచ్చు. అంతేకాకుండా శిలీంద్ర, బ్యాక్టీరియా సంబంధిత తెగుళ్లు కూడా సోకవు.
 - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్
 
కారు చౌకలో ఫ్రూట్ ఫ్ల ట్రాప్

ఉద్యాన పంటల్లో పండుటీగలను ఫ్రూట్ ఫై ్ల ట్రాప్స్ వాడి సమర్థవంతంగా నివారించవచ్చు. ట్రాప్స్‌ను కొనే కన్నా అందుబాటులో ఉన్న సామగ్రితో, అతి తక్కువ ఖర్చుతో రైతులు స్వయంగా తయారు చేసుకోవచ్చు. వాడిపారేసిన మినరల్ వాటర్ సీసాలు లేదా శీతలపానీయాల సీసాలు, ఓ మోస్తరు మందం కలిగిన జీఐ వైరు, ఒక స్పాంజీ ముక్క, కొద్దిపాటి ఫెవికాల్, కూల్ డ్రింక్ సీసా స్ట్రాలు లేదా ఎలక్ట్రిక్ వైర్ ఇన్సులేషన్ స్లీవ్స్.. ట్రాప్స్ తయారీకి అవసరమౌతాయి. ముందుగా ప్లాస్టిక్ సీసా మూడోవంతు భాగంలో ఓ ఇనుప చువ్వను కాల్చి.. సీసాకు నాలుగు వైపులా రంధ్రాలు పెట్టాలి. రంధ్రాలు ఒకదానికి ఒకటి ఎదురుబొదురుగా వచ్చే విధంగా చూసుకుంటే బాగుంటుంది. ఈ రంధ్రాల్లో స్ట్రా ముక్కలను కత్తిరించి అతికించాలి.

సీసా మూత తీసి దానికి మధ్య భాగంలో రంధ్రం చేసి జీఐ వైర్ దూర్చాలి. వైర్ సీసాలో కనీసం 2 అంగుళాల ఎత్తున జీఐ వైర్‌ను మెలి తిప్పి ముడి వేసుకోవాలి. వైర్ కింది కొసకు ఫెవికాల్‌తో స్పాంజ్ లేదా దూదిని అతికించాలి. పై కొసను సీసా మూత రంధ్రం నుంచి దూర్చి చివరి అంచును కొక్కెంలా వంచుకోవాలి. అంతే.. ఫ్రూట్ ఫై ్ల ట్రాప్ సిద్ధమైనట్లే. పండుటీగలను ఆకర్షించడానికి సీసాలో కొద్దిపాటి ఈథైల్‌ఎజునాల్ పోసి మూత పెట్టాలి. ఈథైల్ ఎజునాల్‌కు బదులుగా.. అడవి అల్లం ద్రావణాన్ని పది మిల్లీ లీటర్లకు లీటర్ నీటిలో కలిపి పోసుకోవచ్చు. సీసాలోని ద్రావణం వాసనకు ఆకర్షితమయ్యే పండుటీగ అందులోకి దూరి బయటకు రాలేక అక్కడే మరణిస్తుంది.

Advertisement
Advertisement