ఏపీ హిస్టరీ | Sakshi
Sakshi News home page

ఏపీ హిస్టరీ

Published Sat, Dec 14 2013 10:26 PM

ఏపీ హిస్టరీ - Sakshi

విజయనగర సామ్రాజ్యం-యుగ విశేషాలు
 విజయనగర సామ్రాజ్యం దాదాపు రెండు శతాబ్దాల పాటు మహోన్నతమైన దశను అనుభవించింది. మధ్యయుగ చరిత్రలో అత్యంత సుసంపన్నమైన రాజ్యాల్లో ప్రథమ స్థానం పొందింది. విజయనగరాన్ని సందర్శించిన న్యూనిజ్, పేస్, అబ్దుల్ రజాక్, నికోలి-డి-కాంటే, బార్బోసా, వర్తెమా వంటి విదేశీయుల యాత్రా కథనాలు, శాసనాలు, నాణేలు, సమకాలీన సాహిత్యం ఆనాటి యుగ చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.

విజయనగరం 60 మైళ్ల చుట్టుకొలతతో, 7 ప్రాకారాలతో విరాజిల్లుతోందని, సిరిసంపదలతో తులతూగుతోందని నికోలా-డి- కాంటే ప్రశంసించాడు. విజయనగరం వంటి నగరాన్ని చరిత్రలో మరెక్కడా చూడలేదని, వీధుల్లో రత్నాలను రాశులుగా పోసి విక్రయించేవారని చరిత్రకారుడు రజాక్ తన రచనల్లో కొనియాడాడు. రాజ్యంలో అత్యంత సార వంతమైన భూములు ఉన్నాయని, పంటలు విస్తారంగా పండుతాయని విదేశీ యాత్రికులు పేర్కొన్నారు.
 
 ఆర్థిక పరిస్థితులు
 ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమి పన్ను. వివిధ వృత్తుల వారినుంచి వసూలు చేసే పన్నులు, సామంతులు చెల్లించిన కప్పాల ద్వారా కూడా ఆదాయం సమకూరేది. రాజులు శత్రురాజ్యాల నుంచి ధనరాశులను చేజిక్కించుకొనేవారని, రాజ ప్రతినిధులు భరణాలను చెల్లించేవారని, బహుమతులు ఇచ్చేవారని, పుత్రోదయ, వివాహాది శుభకార్యాల్లో సామంతులు ధనరూపంలో, ఆభరణాల రూపంలో కానుకలు అందజేసేవారని పేస్ తన రచనల్లో వెల్లడించాడు.
 విజయనగర రాజులు, సామంతులు, ఉద్యోగులు రాజ్యంలో అనేక చెరువులను తవ్వించారు. కాల్వల ద్వారా నీటిపారుదల సౌకర్యాలను కల్పించారు. పెనుగొండ దగ్గర బుక్కరాయలు శిరువేరు తటాకాన్ని, అనంతపురం దగ్గర సాళువ నరసింహుడు నరసాంబుధి చెరువును తవ్వించారు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు ఇంజనీర్ల సాయంతో నాగలాపురం తటాకాన్ని నిర్మించి, పంటకాల్వలను తవ్వించాడు. కొండమరసు కొండవీటి రాజ్యంలో తిమ్మ సముద్రాన్ని  నిర్మించాడు. రాజులు నూతన వ్యవసాయిక గ్రామాలను నిర్మించి, కొన్ని సంవత్సరాల పాటు పన్నులను వసూలు చేయకుండా వ్యవసాయాభివృద్ధికి అండగా నిలిచారు. దేశంలో జామ, మామిడి, నిమ్మ, వరి, జొన్నలు, రాగులు, అరటి, కొబ్బరి, ఆకుకూరలను పుష్కలంగా పండించేవారు.
 విజయనగర రాజులు పంట పొలాలను సర్వే చేయించారు.

పంటపొలం, అందులోని సారం, దిగుబడులను పరిగణనలోకి తీసుకొని పన్నులను మదింపు చేసేవారు. ఫలసాయంలో ఆరో వంతును పన్నుగా వసూలు చేసేవారు. తెలుగు తీరాంధ్ర ప్రాంతంలో మంత్రి తిమ్మరసు.. భూమిని సర్వే చేయించినట్లు తెలుస్తోంది. భూమిని కొలవడానికి భిన్న ప్రాంతాల్లో వేర్వేరు కొలమానాలను ఉపయోగించేవారు. పాకనాడులో రెండు గడలు, తీరాంధ్ర ప్రాంతంలో కేసరిపాటి గడలు, రేనాడులో దోరగడలు ఉపయోగంలో ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. సాధారణంగా భూమిని రెండు రకాలుగా విభజించారు. నీరాంబర(మాగాణి భూమి), కాడాంబర(మెట్ట పొలాలు)గా వర్గీకరించారు. నీరాంబర భూముల్లో పండిన పంటకు ధాన్యరూపంలో పన్నును చెల్లించేవారు.

కాడాంబర పొలాల్లో పండే పంటకు(అరటి, కూరగాయలు, ఆకుకూరలు) ధనరూపంలో పన్నులు చెల్లించేవారు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద గ్రంథం ప్రకారం... రాజుకు లభించే ఆదాయాన్ని నాలుగు భాగాలుగా విభజించి, ఖర్చు చేసేవారు. రాజు దానధర్మాలు, రాజు వ్యక్తిగత వ్యయం, గుర్రాల నిర్వహణ, దండయాత్రలు, దేశాభివృద్ధి, దేశ రక్షణకు ఆదాయాన్ని ఖర్చు చేసేవారు. గ్రామాల్లో పంటపొలాలు, శిస్తుల వివరాలను కరణాలు ‘కవిలె’ అనే పద్దుపుస్తకాల్లో నమోదు చేసేవారు.
 
 పన్నుల స్వరూపం
 భూమి, వృత్తి, వివాహం, పారిశ్రామిక  ఉత్పత్తులపై పన్నులను విధించేవారు. ఒకే స్థలంలో అమ్మకానికి వచ్చే  సరకులపై స్థలాదాయం అనే పన్ను, ఒకచోట నుంచి మరోచోటుకు తీసుకెళ్లే వస్తువులపై మార్గాదాయం అనే పన్ను, ఇతర రాజ్యాలకు ఎగుమతి చేసే వస్తువులపై మామూలాదాయం పన్ను, నేత మగ్గాలపై మగ్గం పన్నును విధించేవారు. దూదిని ఏకి దారం తీసేవాళ్లు పింజుణీ సిద్ధాయం అనే పన్నును చెల్లించేవారు. విజయనగర రాజ్యంలోని కొన్ని సీమల్లో వివాహ సుంకాలను రద్దు చేసిన మొదటి రాజు తుళువ వీరనరసింహుడు.
 శ్రీకృష్ణదేవరాయలు తన సామ్రాజ్యమంతటా వివాహ సుంకాలను(కన్యాశుల్కాలు) రద్దు చేశాడు. నేత పరిశ్రమపై మగ్గరి స్థావరం, నూనె పరిశ్రమపై గానుగ స్థావరం, ఇంటిపై ఇల్లరి పన్ను, అంగళ్లపై మడిగె లేదా అడికాసు పన్ను, పశువులు మేసే పచ్చిక బయళ్లపై పుల్లరి పన్ను, గొర్రెలను విక్రయించేవారిపై  అడ్డగడ సుంకం, తృణధాన్యాలు, కూరగాయలపై మలబ్రమ, కుల తగవుల ద్వారా సమయ సుంకం వంటి వివిధ రకాల పన్నులను వసూలు చేసేవారు. ఈ పన్నుల వివరాలన్నీ శ్రీకృష్ణదేవరాయలు వేయించిన కొండవీడు శాసనంలో ఉన్నాయి.

ఉప్పు కొటార్లపై ఉప్పరి సిద్ధాయం పన్నును, నిధి నిక్షేపాలపై సంపత్తి పన్నును విధించేవారు. చలివేంద్రాలు, సంతలు వంటి ప్రదేశాలు సుంకాల వసూలు కేంద్రాలుగా ఉండేవి. సుంకందార్లు వేలం పాట ద్వారా సుంకాలను వసూలు చేసే హక్కులను పొందేవారు. వివాహ శుభకార్యాల్లో ఉభయ పక్షాలపై గుడి కల్యాణం, కల్యాణ కానికె అనే పన్నులను వసూలు చేసేవారు. వివాహ సుంకాలను ప్రజలు తీవ్రంగా నిరసించారు. కల్యాణ కానుకలను వసూలు చేసేవాడు తల్లికి మొగుడు అని ఒక శాసనంలో పేర్కొన్నారు. ఈ మాటను బట్టి వివాహ సుంకాలను ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో తెలుస్తోంది. వేశ్యలపై విధించిన పన్నులను రక్షక భటులకు జీతాలుగా చెల్లించేవారని డొమింగో పయస్ పేర్కొన్నాడు. యాచక వృత్తిపై విధించిన పన్నును గణాచారి అని పిలిచేవారు. పుత్రులు లేని కుటుంబీకుల ఆస్తులు ప్రభుత్వ వశమయ్యేవి.

కోటల నిర్వహణ కోసం కూడా పన్నులు విధించేవారు. సుంకాధికారుల దౌర్జన్యాలతో ప్రజలు తీవ్రంగా కుంగిపోతున్నారని న్యూనిజ్, పేస్‌ల రచనలు వివరిస్తున్నాయి. రైతులు అప్పులు చేసి పన్నులు చెల్లించేవారని, తమ భూములను వదిలి వలస వెళ్లేవారని అప్పటి కైఫియత్తుల ద్వారా తెలుస్తోంది. ప్రతి గ్రా మంలో వ్యవసాయ సంబంధమైన పరిశ్రమలు, నూనెల తయారీ, నీలిమందు, వస్త్ర  పరిశ్రమలు వెలిశాయి. సాలె, పద్మసాలె, కురుబ, మాల కులాలవారు నేత వృత్తిలోకి ప్రవేశించారు. తాడిపత్రి, ఆదోని, గుత్తి, వినుకొండ పట్టణాలు నూలు పరిశ్రమ కేంద్రాలుగా ప్రసిద్ధిగాంచాయి.


 వజ్రకరూర్ ప్రాంతంలో వజ్రాల గనులు ప్రఖ్యాతిగాంచాయి. ఇనుము, రాగి, కంచు మొదలైన లోహాలతో వ్యవసాయ పనిముట్లు, గృహోపకరణాలు, దేవతా విగ్రహాలను తయారు చేయడంలో పంచాణం వారు సిద్ధహస్తులు. విజయనగరం నుంచి రాజ్యం నలుమూలలకు రహదారులుండేవి. తిరుపతి బాట, విజయనగరం, కంచి, మచిలీపట్నం - కోవిలకొండ అనే బాటలు ప్రధానమైనవి. కావళ్లు, ఎద్దులు, గుర్రాలు, గాడిదలు, ఎడ్లబండ్లు, పల్లకీలు అప్పట్లో ప్రధాన ప్రయాణ సాధనాలు.
 విజయనగర రాజ్యంలో ఆనాడు ఆదోని, పెనుగొండ, ఉదయగిరి, కొండవీడు, వినుకొండ, పొదిలి, దేవరకొండ, మాచర్ల, మార్కాపురం, మంగళగిరి, కొండపల్లి వంటి పట్టణాలు ప్రముఖ వ్యాపార కేంద్రాలుగా మారాయి. విదేశీ వాణిజ్యానికి పులికాట్, మచిలీపట్నం, మోటుపల్లి ప్రధాన రేవు కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. ఈ రేవుల ద్వారా గుర్రాలు, పచ్చకర్పూరం, పట్టుబట్టలు, కస్తూరి, ముత్యాలు, మణులు దిగుమతి అయ్యేవి. ఎగుమతుల్లో రత్నకంబళ్లు, సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు ముఖ్యమైనవి.
 వర్తకులు, పాంచాణం వారు, సాలె, మేదర మొదలైన చేతి వృత్తుల వారు, ఉప్పు కొటార్లవారు సంఘాలుగా ఏర్పడి తమ వృత్తులను ని ర్వహించుకొనేవారు. సంఘం సమావేశాలు ఆలయ మండపంలో జరిగేవి.

ప్రతి సంఘానికి ఒక లాంఛనం ఉండేది.
 రాజ్యంలో ఆర్థిక అభివృద్ధి జరిగినప్పటికీ ప్రజానీకం విపరీతమైన పన్నుల భారంతో కుంగిపోయేది. రైతులు పండించిన పంట పన్నుల రూపంలో హరించుకుపోయేది. తరచుగా యుద్ధాలు జరగడం వల్ల గ్రామాలు దోపిడీలకు గురయ్యేవి. దీనికితోడు అజ్ఞానం, మూఢవిశ్వాసాలు రాజ్యమేలేవి.  యాత్రలు, సంతర్పణలు, వివాహాది శుభకార్యాలు, ఆడంబరాలతో ప్రజల బతుకులు చిన్నాభిన్నం అయ్యేవి. పట్టణాల్లో ప్రభువులు ఐశ్వర్యం, విలాసాల్లో మునిగితేలుతుండగా, సామాన్య ప్రజలు దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్నారని అప్పట్లో బహమనీ రాజ్యంలో పర్యటించిన రష్యా యాత్రికుడు నికితిన్ తన రచనల్లో పేర్కొన్నారు. విజయనగర రాజ్య పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండేవికావు.
 
 న్యాయవ్యవస్థ- శిక్షలు
 విజయనగర న్యాయవ్యవస్థలో ఉన్నతాధికారి చక్రవర్తే. అత్యున్నత న్యాయస్థానం రాజాస్థానం. న్యాయాధీశులను ప్రాడ్వివాకులు అని పిలిచేవారు. స్వయంగా రాజే నేరాలను విచారించి, నిందితులను శిక్షించేవాడు. అయోగ్యులకు న్యాయ నిర్వహణాధికారం ఇవ్వొద్దని శ్రీకృష్ణదేవరాయలు సూచించాడు. కొన్ని సమయాల్లో రాజుకు బదులుగా ప్రధానమంత్రి న్యాయ నిర్వహణ జరిపేవాడని రజాక్ తెలిపాడు. ప్రాడ్వివాకులు (న్యాయాధీశులు) రాజుకు న్యాయ నిర్వహణలో సహాయపడేవారు. రాష్ట్రాల్లో రాష్ర్టపాలకులు, అమరు నాయకులు న్యాయ నిర్వహణ జరిపేవారు. వారిచ్చే తీర్పులు సంతృప్తికరంగా లేకపోతే రాజుకు నివేదించుకొనే అవకాశం ఉండేది.  ఆస్తి తగాదాలను పరిష్కరించేందుకు తాత్కాలిక న్యాయస్థానాలుండేవి. వీటిని ధర్మాసనాలు అనేవారు. ఇవి ఆలయ మండపంలో సమావేశమవుతుండేవి. నేరస్థులను హింసించి, నేరం ఒప్పుకునేలా చేసే ఆచారం ఉండేది.


 సివిల్ నేరాలను ధనోర్భవ, క్రిమినల్ నేరాలను హింసోద్భవ అని పిలిచేవారు. నేర నిరూపణకు దివ్య పరీక్షలు ఉండేవని నికోలా-డి- కాంటే పేర్కొన్నాడు. కొన్ని నేరాలకు శిక్షలు అత్యంత కఠినంగా, క్రూరంగా ఉండేవని న్యూనిజ్ వెల్లడించాడు. చిన్న చిన్న దొంగతనాలకు పాల్బడేవారి కాలు, చెయ్యి నరికేసేవారు. పెద్ద దొంగతనాలకు పాల్పడేవారి గొంతు కింద కర్రగుచ్చి వేలాడదీసేవారు. రాజద్రోహానికి పాల్పడినవారిని కత్తులతో, శూలాలతో పొత్తి కడుపులో పొడవడం లాంటి శిక్షలు అమల్లో ఉండేవి. సమాజంలో బ్రాహ్మణులకు మరణశిక్ష అమల్లో లేదు. కానీ కనుగుడ్లను పెరికివేయడం, గాడిదలపై ఊరేగించడం లాంటి శిక్షలుండేవి. అట్టడుగు కులాలవారు నేరాలు చేస్తే శిరోముండనం(తల గొరిగించడం) చేసేవారు. నేరస్థులను ఏనుగులతో తొక్కించేవారు. అల్ప నేరాలకు పాల్పడిన వారి వీపులపై బండరాళ్లు ఎత్తించేవారు. కింది తీర్పులపై రాజువద్ద పునర్విమర్శ ఉండేది. సత్య ప్రమాణం చేయించి, శాస్త్రాలు చూసి న్యాయాన్ని నిర్ణయించేవారు. గ్రామ చావడి, దేవాలయ ప్రాంగణం, ఊరి రచ్చబండల వద్ద తీర్పులు చెప్పేవారు.

Advertisement
Advertisement