ప్లాస్టిక్ కోర్సులకు కేరాఫ్ సిపెట్‌ | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ కోర్సులకు కేరాఫ్ సిపెట్‌

Published Thu, May 5 2016 12:55 AM

ప్లాస్టిక్ కోర్సులకు కేరాఫ్ సిపెట్‌ - Sakshi

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్).. ప్లాస్టిక్ సంబంధిత కోర్సులు అభ్యసించాలనుకునే అభ్యర్థులకు చక్కటి విద్యా సంస్థ. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ సంస్థ పదో తరగతి ఉత్తీర్ణుల నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకు వివిధ కోర్సులందిస్తోంది. చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సిపెట్‌కు హైదరాబాద్ (చర్లపల్లి)లో కూడా క్యాంపస్ ఉంది. ప్రస్తుతం వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సిపెట్ కోర్సులు, అర్హతలు తదితర వివరాలు..

ఇంజనీరింగ్  స్పెషల్
అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ,  మారుతున్న అవసరాలకనుగుణంగా ప్లాస్టిక్  వాడకం నానాటికీ పెరుగుతోంది. పిల్లల పాల డ బ్బా, ఆడుకునే వస్తువులు మొదలుకుని పెద్దలకు ఊతాన్నిచ్చే స్టిక్ వరకు ప్రతీది పాలిమర్ సమ్మేళనమే. రాదేదీ ప్లాస్టిక్‌కు సాటి అనే చందంగా..  గతంలో మాదిరిగా సాదాసీదా వ్యవహారంలా కాకుండా ప్లాస్టిక్ రంగం ఇప్పుడు ప్రొఫెషన్ రూపును సంతరించుకుంటోంది. దీంతో ప్లాస్టిక్‌లో ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులను అభ్యసించినవారికి డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో నిపుణులను తీర్చిదిద్దే ఉద్దేశంతో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) హైదరాబాద్ క్యాంపస్ వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తోంది.

 తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న డిమాండ్
వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌కి ప్రాధాన్యత పెరుగుతోంది. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ .. వంటి కార్యక్రమాల్లో  దాదాపు 85 శాతం ప్లాస్టిక్ సంబంధిత మెటీరియల్స్‌నే వాడుతున్నారు. వీటితోపాటు కూరగాయలు, పండ్లను ప్యాకింగ్ చేసే ట్రేలు, వరి నాట్లు, పాల శుద్ధికి ఉపయోగించే వస్తువులు.. ఇలా ఒకటేంటి దాదాపు వ్యవసాయ రంగంలో అధికంగా ప్లాస్టిక్ వస్తువులే కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో అనేక రకాల ప్లాస్టిక్ తయారీ సంస్థల్లో ఉద్యోగుల అవసరం పెరుగుతోంది.

 అనేక విభాగాల్లో కోర్సులు
మార్కెట్, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుకోర్సులున్నాయి. డిజైన్/టూలింగ్/క్యాడ్/ సీఏఎం/సీఎన్‌సీ ప్రోగ్రామ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్/ ప్రాసెసింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్/మెషీన్ మెయింటనెన్స్, టెస్టింగ్ - క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్, వెల్డింగ్ - ఫ్యాబ్రికేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ -నెట్‌వర్కింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లున్నాయి.

   అవకాశాలు
ఏటా దాదాపు ఐదు వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. వీరిలో 85 శాతం మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కొంతమంది స్వయం ఉపాధి దిశగా సాగుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ  కంపెనీలకు సగానికి పైగా ఎంపికవుతున్నారు. వీటితోపాటు జైన్, సుధాకర్ పైప్స్, గోదావరి పాలిమర్స్, నాగార్జున గ్రూప్.. క్యాంపస్ ప్లేస్‌మెంట్లు కల్పిస్తున్నాయి. గతేడాది అమెరికాకు చెందిన అప్తార్ కంపెనీకి 65 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇలా కోర్సు నేర్చుకున్న ప్రతీ ఒక్కరు ఉద్యోగాలు పొందుతున్నారు.

ప్లాస్టిక్ అనేది కామన్ మ్యాన్ మెటీరియల్, తక్కువ ధరకే లభించే వస్తువు.  దీంతో ఈ రంగంలో మానవ వనరుల ఆవశ్యకత పెరుగుతోంది. రెగ్యులర్ డిగ్రీ కోర్సుల కంటే సిపెట్ అందించే కోర్సుల్లో డిగ్రీ/డిప్లొమా చేసిన వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శిక్షణ పొందేవారిలో అర్హత గల విద్యార్థులకు స్కాలర్‌షిప్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్లాస్టిక్ రంగంలో శిక్షణ ఇచ్చివారిని ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభావంతులైన ఐదుగురు విద్యార్థులకు మా సంస్థలోనే ఉద్యోగం ఇస్తాం. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇద్దరు విద్యార్థులకు ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌ని అందిస్తున్నాం.

వి. కిరణ్‌కుమార్, చీఫ్ మేనేజర్  
సిపెట్, హైదరాబాద్


కోర్సుల వివరాలు
సిపెట్ హైదరాబాద్ క్యాంపస్.. డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో శిక్షణ ఇస్తోంది.  ప్రస్తుతం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 ప్లాస్టిక్ ప్రాసెసింగ్ టెస్టింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (పీజీడీ-పీపీటీ)
అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వ్యవధి: ఏడాదిన్నర
వయసు: 25 ఏళ్లకు మించకూడదు.

 క్యాడ్/ క్యామ్‌తో ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్‌లో పోస్ట్ డిప్లొమా (పీడీ-పీఎండీ విత్ క్యాడ్/ క్యామ్)
అర్హత: డిప్లొమా ఇన్ మెకానికల్/ప్లాస్టిక్ టెక్నాలజీ/ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ /మెకట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ / టూల్ అండ్ డై మేకింగ్/ డీపీఎంటీ/డీపీటీ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత.

వ్యవధి: ఏడాదిన్నర
వయసు: 25 ఏళ్లకు మించకూడదు.
 ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీలో డిప్లొమా (డీపీఎంటీ)
 ప్లాస్టిక్ టెక్నాలజీలో డిప్లొమా (డీపీటీ)
అర్హత: 10వ తరగతి
వ్యవధి: మూడేళ్లు

వయసు: 20 ఏళ్లకు మించకూడదు
అన్ని కోర్సుల్లో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తుల విక్రయానికి చివరి తేది: మే 6
దరఖాస్తుకు చివరి తేది: మే 13
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్: జూన్ 5
వెబ్‌సైట్: www.cipet.gov.in

ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి పాస్/ ఫెయిల్ విద్యార్థులకు షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ఈ కోర్సులు రెండు నుంచి మూడు నెలల వ్యవధి ఉంటాయి.
 

Advertisement
Advertisement