కరెంట్ అఫైర్స్ | Sakshi
Sakshi News home page

కరెంట్ అఫైర్స్

Published Thu, Sep 17 2015 12:22 AM

కరెంట్ అఫైర్స్

 గోల్డ్ బాండ్, గోల్డ్ డిపాజిట్ పథకాలకు కేబినెట్ ఆమోదం
 గోల్డ్ బాండ్, గోల్డ్ డిపాజిట్ పథకాలకు కేంద్ర కేబినెట్ సెప్టెంబరు 9న ఆమోదం తెలిపింది. దేశీయంగా బంగారం డిమాండ్ తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను ప్రారంభిస్తోంది. అదే విధంగా ఇళ్లకు పరిమితమవుతున్న బంగారాన్ని మార్కెట్ వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు కూడా ఈ పథకాలు ఉపయోగపడతాయి. వీటివల్ల బంగారం దిగుమతులు తగ్గుముఖం పడతాయి. బంగారానికి ప్రత్యామ్నాయంగా ఆర్థిక ఆస్తులను అభివృద్ధి చేసేందుకు బంగారం బాండ్ల (ఎస్‌జీబీ) పథకాన్ని ప్రారంభించాలని ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంకు ఈ బాండ్లను జారీచేస్తుంది.
 
 వ్యాపారానికి అనువైన రాష్ట్రాల్లో గుజరాత్‌కు మొదటి స్థానం
 వ్యాపారానికి అనువైన రాష్ట్రాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు రూపొందించిన జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐఐపీ), సీఐఐ, ఫిక్కీ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీతో కలిసి ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదిక సెప్టెంబరు 14న విడుదలైంది. జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం, జార్ఖండ్‌కు మూడో స్థానం లభించింది. తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అరుణాచల్‌ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. స్థల కేటాయింపులు, కార్మిక సంస్కరణలు, పర్యావరణ అనుమతులు, వ్యాపారాల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు, మౌలిక సదుపాయాలు వంటి 8 ప్రాతిపదికల ఆధారంగా నివేదికను రూపొందించారు.
 
 అంతర్జాతీయం
  సింగపూర్ పార్లమెంటు ఎన్నికల్లో  అధికార పార్టీ విజయం సింగపూర్ పార్లమెంటు ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) విజయం సాధించింది. సెప్టెంబరు 11న జరిగిన ఎన్నికల్లో పీఏపీ 89 స్థానాలకు 83 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ ఆరు స్థానాలకు పరిమితమైంది. 1965లో స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి పీఏపీ అధికారంలో కొనసాగుతోంది.
 
 ఈజిప్టు కొత్త ప్రధానిగా షరీఫ్ ఇస్మాయిల్
 అవినీతి ఆరోపణలు రావటంతో ఈజిప్టు ప్రధానమంత్రి ఇబ్రహీం మహ్లాబ్, కేబినెట్ మంత్రులు సెప్టెంబరు 12న రాజీనామా చేశారు. దీంతో చమురు శాఖ మంత్రిగా ఉన్న షరీఫ్ ఇస్మాయిల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్ సీసీ కోరారు.
 
 రాష్ట్రీయం
 విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబరు 10న జాతికి అంకితం చేశారు.తెలంగాణలో ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం టోల్‌ఫ్రీ నెంబర్ 104ను ఏర్పాటు చేసింది.వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మార్కెట్‌కు తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరు పెట్టింది.
 
 వార్తల్లో వ్యక్తులు
 డీఆర్‌డీవో విభాగానికి డెరైక్టర్‌గా మంజుల రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ‘ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్’ విభాగానికి డెరైక్టర్ జనరల్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జె.మంజుల సెప్టెంబరు 9న బాధ్యతలు స్వీకరించారు. డీఆర్‌డీవోలో ఒక విభాగానికి డెరైక్టర్ జనరల్ అయిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు సాధించారు. హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో మంజుల ఇంజనీరింగ్ పూర్తిచేశారు.
 
 శక్తిమంతమైన వ్యాపార మహిళల్లో ఇంద్రానూయి
 ఫార్చ్యూన్ ప్రపంచంలోని శక్తిమంతమైన వ్యాపార మహిళల జాబితాలో భారత్ నుంచి పెప్సికో సీఈవో ఇంద్రానూయి ఒక్కరికే చోటు లభించింది. 50 మందితో సెప్టెంబరు 10న విడుదల చేసిన జాబితాలో జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బారా మొదటి స్థానంలో నిలవగా, ఇంద్రా నూయి రెండో స్థానంలో నిలిచారు. 66.6 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారాన్ని ఇంద్రానూయి నిర్వహిస్తున్నారు.
 
 కె.జయరామన్‌కు
 డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ హోదా  రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి లేబొరేటరీ (డీఆర్‌డీఎల్) డెరైక్టర్ కె.జయరామన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ హోదా లభించింది. శాస్త్రవేత్తలకు కల్పించే ఈ అత్యున్నత గౌరవాన్ని కేంద్రం సెప్టెంబర్ 11న ప్రకటించింది.
 
 అవార్డులు
 అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం కాళోజీ నారాయణరావు పురస్కారానికి ప్రముఖ కవి, రచయిత అమ్మంగి వేణుగోపాల్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబరు 9న నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌కు అవార్డును ప్రదానం చేశారు. పురస్కారం కింద జ్ఞాపికతో పాటు రూ.లక్ష నగదు బహూకరించారు.
 
 ఉత్తమ సాక్షర భారత్
 కేంద్రాలకు పురస్కారాలు జాతీయ స్థాయిలో ఉత్తమ సాక్షర భారత్ కేంద్రాలుగా శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని పూసర్లపాడు, నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డి గూడెం ఎంపికయ్యాయి. సెప్టెంబరు 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి
 ప్రణబ్ ముఖర్జీ పురస్కారాలు ప్రదానం చేశారు.
 
 వయోజనులను అక్షరాస్యులను చేసినందుకు
 ఈ పురస్కారాలు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన 5 సాక్షర  భారత్ కేంద్రాలను పురస్కారానికి ఎంపిక చేశారు.
 
 సైన్స్ అండ్ టెక్నాలజీ
  ఐఎన్‌ఎస్ వజ్రకోష్ ప్రారంభం నౌకా స్థావరం ఐఎన్‌ఎస్ వజ్రకోష్‌ను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సెప్టెంబరు 9న కర్ణాటకలోని కార్వార్ నౌకా స్థావరంలో ప్రారంభించారు. పశ్చిమ తీరం నుంచి యుద్ధ నౌకల నిర్వహణకు ఈ స్థావరం ఉపయోగపడుతుంది. దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నిర్మించింది. దీర్ఘ శ్రేణి బ్రహ్మోస్ క్షిపణులతో పాటు ఇతర ఆయుధాలను స్థావరంలో నిల్వ చేస్తారు. ఇది కార్వార్‌లో ఏర్పాటైన మూడో నౌకా స్థావరం.
 
 దక్షిణాఫ్రికా గుహల్లో కొత్త ‘మానవ జాతి’
 మానవ కుటుంబ వృక్షానికి చెందిన కొత్త జాతి ఆనవాళ్లను దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ సమీపంలో రైజింగ్ స్టార్ గుహల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విషయాన్ని సెప్టెంబరు 10న మగలీస్‌బర్గ్‌లో శాస్త్రవేత్తలు తెలిపారు. శిలాజాలు వెలుగుచూసిన నలెడి గుహ పేరిట ఈ కొత్త జాతికి హోమో నలెడిగా పేరుపెట్టారు. నలెడి గుహలో 15 జీవులకు సంబంధించిన 1500కు పైగా ఎముకలు లభించాయి. ఈ శిలాజాల వయసు 25 లక్షల ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు.
 
 
 క్రీడలు
 యూత్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు  5వ స్థానం అపియా (సమోవా)లో సెప్టెంబరు 11న ముగిసిన యూత్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. 24 స్వర్ణాలు, 19 రజతాలు, 19 కాంస్య పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా(13 స్వర్ణ పతకాలు), ఇంగ్లండ్(12), మలేసియా(11)తో వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. 9 స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్య పతకాలతో భారత్ 5వ స్థానంలో నిలిచింది.
 
 జకోవిచ్, పెనెట్టాలకు
 యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ పురుషుల సింగిల్స్: నొవాక్ జకోవిచ్ (సెర్బియా) యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. సెప్టెంబరు 14న జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు.
 మహిళల సింగిల్స్: ఇటలీకి చెందిన ఫ్లావియా పెనెట్టా మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో రాబెర్టా విన్సీ (ఇటలీ)ని ఓడించింది. అత్యంత పెద్ద వయసులో (33) తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్న మహిళగా పెనెట్టా గుర్తింపు సాధించింది.
 
 పురుషుల డబుల్స్: హెర్బెర్ట్-నికోలస్ (ఫ్రాన్స్) జోడీ గెలుచుకుంది. వీరు ఫైనల్లో జేమీ ముర్రే (బ్రిటన్)- జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించారు.మహిళల డబుల్స్: సానియా మీర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ గెలుచుకుంది. వీరు ఫైనల్లో కేసే డెలాక్వా (ఆస్ట్రేలియా), యారోస్లావా ష్వెదోవా (కజకిస్థాన్) జంటను ఓడించారు.మిక్స్‌డ్ డబుల్స్: భారత్‌కు చెందిన లియాండర్ పేస్.. స్విస్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి టైటిల్ సాధించాడు. వీరు ఫైనల్లో అమెరికాకు చెందిన బెథానీ మాటెక్, సామ్ క్వెరీ జోడీని ఓడించారు. ఈ విజయంతో పేస్ ఖాతాలో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ చేరాయి.
 
 రెజ్లింగ్‌లో నర్సింగ్ యాదవ్‌కు కాంస్యం
 రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ పురుషుల ఫ్రీస్టయిల్ 74 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. లాస్‌వెగాస్‌లో సెప్టెంబరు 13న కాంస్యం కోసం జరిగిన పోటీలో జెలిమ్‌ఖాన్ ఖాదియెవ్ (ఫ్రాన్స్)పై యాదవ్ విజయం సాధించాడు. ఈ గెలుపుతో నర్సింగ్ యాదవ్ 2016-రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
 
 యూకీ బాంబ్రీకి షాంఘై చాలెంజర్ టైటిల్
 భారత్ టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ షాంఘై చాలెంజర్ టైటిల్ గెలుచుకున్నాడు. టోక్యోలో సెప్టెంబరు 13న జరిగిన ఫైనల్లో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను లిన్ డాన్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను నొజోమి గె ఒకుహారా (జపాన్) గెలుచుకుంది. ఆమె ఫైనల్లో అకానె యమగుచి (జపాన్)ను ఓడించింది.
 
 
 క్లుప్తంగా
 ఆసియా, పసిఫిక్ దేశాల శక్తిమంతమైన మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డెరైక్టర్ చందా కొచ్చర్‌కు అగ్రస్థానం లభించింది. ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య రెండో స్థానంలో నిలిచారు. అంతర్జాతీయ పత్రిక ఫార్చ్యూన్ 25 మందితో జాబితా రూపొందించింది.
 
 నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా వ్యవసాయ రంగ నిపుణులు ప్రొఫెసర్ రమేశ్‌చంద్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 9న ఆమోదం తెలిపారు.విద్య, వృత్తి శిక్షణ, ఆరోగ్య సంరక్షణ రంగాలకు వ్యక్తిగతంగా భూరి విరాళాలిచ్చిన ఆసియా-పసిఫిక్ దేశాల దాతల జాబితాను ఫోర్బ్స్ ఆసియా పత్రిక విడుదల చేసింది. 13 దేశాలకు చెందిన దాతల జాబితాలో ఏడుగురు భారతీయులకు చోటులభించింది.
 
 భారత సంతతికి చెందిన అశోక్ శ్రీధరన్.. జర్మనీలోని ప్రముఖ నగరం బాన్ పురపాలక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబరు 13న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ఆయన విజయం సాధించారు.కొత్త రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదాన్ని తొలగించి, హిందూ దేశంగా తిరిగి చేర్చాలనే ప్రతిపాదనను నేపాల్ రాజ్యాంగ సభ తిరస్కరించింది. దీనికి సంబంధించిన ఓటింగ్ సెప్టెంబరు 14న జరిగింది.సరిహద్దుల్లో కాల్పులు, మోర్టార్ షెల్స్ ప్రయోగంపై పూర్తి నిషేధాన్ని పాటించేందుకు భారత్, పాక్ అంగీకరించాయి. ఈ మేరకు సెప్టెంబరు 12న ఢిల్లీలో జరిగిన సరిహద్దు దళాల డెరైక్టర్ జనరల్స్ స్థాయి చర్చల్లో అంగీకారం కుదిరింది.
 

Advertisement
Advertisement