ఓట్ల విప్లవం రాబోతోంది: వైఎస్ విజయమ్మ | Sakshi
Sakshi News home page

ఓట్ల విప్లవం రాబోతోంది: వైఎస్ విజయమ్మ

Published Tue, Mar 25 2014 1:20 AM

Beginning of revolution for votes against Chandrababu Naidu, says Vijayamma

అసమర్థ ప్రభుత్వానికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ విప్లవం మొదలవుతోంది: విజయమ్మ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘పేదల సంక్షేమం కోసం వైఎస్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. వైఎస్ రెక్కల కష్టంతో ఏర్పాటయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మరణం తర్వాత ఆ పథకాలను తుంగలో తొక్కితే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆ ప్రభుత్వానికి వత్తాసు పలికారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి, ప్రతిపక్షంలో విఫలమైన చంద్రబాబుకువ్యతిరేకంగా ప్రతి ఇంటి నుంచీ ఓటు హక్కుతో విప్లవం రాబోతోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ‘‘మనం ఎన్నికల కురుక్షేత్రంలో ఉన్నాం.. మనసున్న నేతను, మంచి పాలకుడిని ఎన్నుకోవాలి.. అది రాజన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన బిడ్డ జగన్‌తోనే సాధ్యం’’ అని ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లా మధిర నగర పంచాయతీ, ఇల్లెందు మున్సిపాలిటీలలో ఆమె రోడ్‌షో నిర్వహించారు.
 
  వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. మధిర, ఇల్లెందులలో జన వాహినిని ఉద్దేశించి పలుచోట్ల ప్రసంగించారు. ఈ మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాల రాజకీయాలు నడిపేవారికి గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన, వైఎస్ ఐదున్నరేళ్ల పాలన, వైఎస్ తర్వాత నాలుగున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై విజయమ్మ పేరు పేరునా ప్రశ్నించినప్పుడు.. ప్రజలు అనూహ్యంగా స్పందించారు. వైఎస్ మరణించిన తర్వాత తమకు సంక్షేమ పథకాలేవీ అందలేదని గొంతెత్తి నినదించారు. చంద్రబాబు పాలన రాక్షస పాలన అంటూ ధ్వజమెత్తారు. విజయమ్మ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..
 
 తొమ్మిదేళ్లూ ఏం చేశారు చంద్రబాబూ?
 -    చంద్రబాబు ఎన్నికలయ్యాక మర్చిపోయే హామీలను చాలా ఇస్తున్నారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే.. తన తొమ్మిదేళ్ల పాలనను తిరిగి తీసుకువస్తానని ధైర్యంగా ప్రజలకు చెప్పుకోగలరా..? 34 ఏళ్ల బాబు రాజకీయ జీవితంలో ఏనాడూ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రజలను వంచించడమే ఆయన ధ్యేయం. తొమ్మిదేళ్ల పాలనలో ఏంచేశారని చంద్రబాబు ఓటడిగేందుకు ప్రజల ముందుకు వస్తున్నారు?
 -    తన హయాంలోనే హైదరాబాదు అభివృద్ధి చెందిందని, ఐటీని తానే హైదరాబాదుకు తెచ్చానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నిక్కర్ వేసుకున్నపుడే అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ ఉంది. చంద్రబాబు పాలనలో దాని అభివృద్ధి పడిపోయింది.
 -    చంద్రబాబు తన పాలన లో అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేశానని చెప్పుకునే వారు. ఆయన మీడియాను మేనేజ్ చేశారే తప్ప ఇంకే ప్రభుత్వ వ్యవస్థనూ మేనేజ్ చేయలే దు. కేంద్రంలో చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకున్న బాబు కేంద్రం నుంచి ఏ ఒక్క పరిశ్రమనయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా? ప్రధాని పదవిని త్యాగం చేశానని చెప్పుకునే బాబుకు ఆ పదవిని ఎవరు ఆఫర్ చేశారో చెప్పాలి.
 -    రాష్ట్రంలో 54 పరిశ్రమలను నాడు తెలుగు తమ్ముళ్లకు రాసిచ్చి వేలాదిమంది ఉద్యోగుల పొట్టకొట్టి కనీసం వారికి పెన్షన్ కూడా అందకుండా చేసిన ఘనుడు చంద్రబాబు. వైఎస్ పథకాలనే తన పథకాలంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటు.


పేదల హృదయాల్లో చిరస్థాయిగా వైఎస్సార్
 -    రాష్ట్రంలో రైతు సుభిక్షంగా ఉండాలని, బీడు భూములను సస్యశ్యామలం చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి అపర భగీరథునిలా జలయజ్ఞం ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ముఖ్యమంత్రిగా వైఎస్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఉచిత విద్యుత్‌పైనే చేశారు. దీంతో తెలంగాణలోనే 31లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కల్పించి మెట్ట రైతులకు వైఎస్ అండగా నిలిచారు.
 -    దేశంలోనే ఏ ముఖ్యమంత్రీ చేయలేనంత అభివృద్ధి చేసిన వైఎస్ పాలన ప్రపంచంలోనే రికార్డు పాలనగా నిలిచిపోయింది. 108, 104, ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ఇందిర ప్రభ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్ కల్పించి పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
 -    ఈ పర్యటనలో విజయమ్మ వెంట వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధిర నియోజకవర్గ సమన్వయకర్త సామాన్య కిరణ్, ఇల్లెందు నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ రవి బాబు నాయక్ తదితరులు ఉన్నారు.

గీతలు గీసినా ప్రేమలు చెరిపేయలేరు
గీతలు గీసి భూములు విడదీసినా.. మనుషుల మధ్య ప్రేమను చెరిపేయలేరు. ఈ ప్రాంతం వారికి కష్టం వస్తే ఆ ప్రాంతం వారు, ఆ ప్రాంతం వారికి కష్టం వస్తే ఈ ప్రాంతం వారు ఎప్పటికీ అండగా ఉంటారు. తెలుగుజాతి ఒక్కటేనని చాటుతారు. వైఎస్ 23 జిల్లాలను ప్రాంతాలకు అతీతంగా సమానంగా ప్రేమించారు. ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చేశారు. ఏ జిల్లాకు ఏ ప్రాజెక్టు కావాలన్న దూరదృష్టితో ఆలోచన చేశారు. తెలంగాణలోని దేవాదుల, ఎల్లంపల్లి, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులన్నీ ఆ మహానేత పాలనలోనే చేపట్టారు. ఆ మహానేత బతికి ఉంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేది.

Advertisement
Advertisement