వసూళ్ల వర్క్ ఇన్‌స్పెక్టర్ | Sakshi
Sakshi News home page

వసూళ్ల వర్క్ ఇన్‌స్పెక్టర్

Published Wed, Mar 19 2014 3:45 AM

collections work inspector

పెగడపల్లి, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ ఇళ్ల బిల్లు చెల్లించకుండా వేధిస్తూ లంచం డిమాండ్ చేసిన పెగడపల్లి మండల హౌసింగ్ కాంట్రాక్టు వర్క్‌ఇన్‌స్పెక్టర్  లంకదాసరి శంకర్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. మండలంలోని నంచర్లకు చెందిన ముగ్గురు బాధితుల నుంచి రూ.15వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.
 
  ఏసీబీ డీఎస్పీ టి. సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం... పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన ఆదినవేని మల్లయ్య, సలుకం నర్సయ్య, సలుకం రాజమల్లుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీరి ఇళ్ల పనులు నాలుగు నెలల క్రితమే పూర్తయ్యాయి. బిల్లు చెల్లింపునకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతానంబర్ అధికారులకు అందించారు. అయినా ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించలేదు.
 
 దీంతో సంబంధిత వర్క్‌ఇన్‌స్పెక్టర్ శంకర్‌ను సంప్రదించగా.. ఒక్కో ఇంటి బిల్లుకు రూ.8వేలు ఇవ్వాలని డిమాండ్‌చేశాడు. చేసేదేమీలేక బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితులు ముందుగా తలా రూ.5వేలు ఇస్తామని, మిగతా డబ్బులు బిల్లు వచ్చిన తర్వాత ఇస్తామని వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ను పెగడపల్లి మండల కేంద్రానికి రమ్మన్నారు. వారు జమచేసిన రూ.15 వేలు లంచం వర్క్‌ఇన్‌స్పెక్టర్ శంకర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. అతడి నుంచి రూ.15వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రమణమూర్తి, జి.శ్రీనివాసరాజు, సిబ్బంది పాల్గొన్నారు.   
 పేదోళ్లమని చెప్పిన విన్లేదు
 
 : బాధితులు
 ‘మావి పేద కుటుంబాలు.. అంతా డబ్బులు ఇచ్చుకోలేమని ప్రాధేయపడినా వర్క్‌ఇన్‌స్పెక్టర్ శంకర్ సారు విన్లేదు. డబ్బులు ఇస్తేనే బిల్లువస్తది అని చెప్పిండు. నాలుగు నెలల నుంచి బిల్లుకోసం తిరుగుతన్నం. మాతో కట్టుకున్న అందరికీ బిల్లులు వచ్చినయి. చేసేదేమీలేక సార్లను ఆశ్రయించాం’ అని బాధితులు ఆదినవేని మల్లయ్య, సలుకం నర్సయ్య, సలుకం రాజమల్లు తెలిపారు.
 

Advertisement
Advertisement