‘తమ్ముళ్ల’ బాహాబాహీ | Sakshi
Sakshi News home page

‘తమ్ముళ్ల’ బాహాబాహీ

Published Tue, Apr 15 2014 12:29 AM

fighting between tdp leaders

చేవెళ్ల, న్యూస్‌లైన్:  తెలుగు తమ్ముళ్లు కుర్చీలు విసురుకున్నారు. ఒకరికొకరు చొక్కాలు పట్టుకున్నారు. నువ్వెంతంటే.. నువ్వెంతంటూ తోసుకున్నారు.. అసలే నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న చేవెళ్ల తెలుగుదేశం పార్టీలో లుకలుకలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సోమవారం చేవెళ్ల పార్టీ కార్యాలయం వద్ద సమావేశమైన టీడీపీ నాయకుల మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారితీసింది. ఇదంతా సాక్షాత్తూ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకల వెంకటేశ్, నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ ఇన్‌చార్జి సామ భూపాల్‌రెడ్డిల సమక్షంలో చోటుచేసుకోవడం గమనార్హం.

  వివరాల్లోకి వెళితే.. చేవెళ్లలోని టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం మండల ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అభ్యర్థి గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహం, పర్యటన తేదీల గురించి చర్చించాల్సి ఉంది. సమావేశం ఉద్దేశాన్ని వివరిస్తుండగా.. తనకు పార్టీకి సంబంధించిన ఏ సమాచారం పార్టీ అధ్యక్షుడు పెంటారెడ్డి తెలియజేయడం లేదంటూ మండల తెలుగు యువత అధ్యక్షుడు దేవర కృష్ణారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయన స్పందిస్తూ  ‘నువ్వు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు ఎక్కడున్నావ్.. టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయలేదా?..’ అని పెంటారెడ్డి అనడంతో వివాదం రేగింది. ‘తాను ఏనాడూ ఇతర పార్టీల తరఫున ప్రచారం చేయలేదు, 15 ఏళ్లుగా టీడీపీకోసం పనిచేస్తున్నా. ఎంతోమంది వచ్చిపోతున్నారు.

కానీ నేను పార్టీలోనే ఉన్నా. అనవసరంగా తనను ఇబ్బందులకు గురిచేయవద్దని’ పెంటారెడ్డి ఆగ్రహించారు. పార్టీ నాయకులు పి.అనంతరెడ్డి, మల్లారెడ్డి తదితరులు కూడా పెంటారెడ్డికి మద్దతుగా నిలిచారు. దీంతో కోపోద్రిక్తుడైన మండల తెలుగు యువత అధ్యక్షుడు దేవర కృష్ణారెడ్డి ఆగ్రహంతో కుర్చీలు విసిరారు. మల్లారెడ్డి మీదకు దూసుకెళ్లడంతో చొక్కాలు పట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ ఘటనలో కుర్చీలు విరిగిపోయాయి.. కాసేపు తోపులాట జరిగింది.. పార్టీ నాయకులు గోవింద్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, సుభాన్‌గౌడ్ తదితరులు సముదాయించే ప్రయత్నం చేశారు.

ఇది చూస్తూ ఉండిపోయిన అభ్యర్థి మేకల వెంకటేశ్, సమన్వయకర్త భూపాల్‌రెడ్డిలు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. వివాదం ముదరడంతో సమావేశానికి వచ్చిన వారు ఇద్దరినీ వారించారు. దీంతో నియోజకవర్గ సమన్వయకర్త, ఇన్‌చార్జి సామ భూపాల్‌రెడ్డి కలుగజేసుకొని ఇరువురి వాదనలు విని మళ్లీ ఇటువంటివి జరక్కుండా చూసుకోవాలని హితవు పలికారు. చివరకు కొట్లాడుకున్న వారితో చేతులు కలిపించి అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయాలని సూచించారు.

Advertisement
Advertisement