సిద్ధంగా ఉన్నాం.. | Sakshi
Sakshi News home page

సిద్ధంగా ఉన్నాం..

Published Fri, Apr 4 2014 11:43 PM

from tomorrow first phase local body elections  starting

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  తొలి విడత మండల/జిల్లా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు సర్వంసిద్ధం చేశామని కలెక్టర్ బీ.శ్రీధర్ వెల్లడించారు. ఆదివారం 16 మండలాల  జెడ్పీటీసీ, 303 గ్రామాల్లో ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో 9 ల క్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావుతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. రెండు దశల్లో జరిగే ప్రాదేశిక ఎన్నికల్లో 188 మంది జెడ్పీటీసీ, 20,436 మంది మండల ప్రాదేశిక స్థానాలకు పోటీ పడుతున్నట్లు చెప్పారు.

 ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయిందని, బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేశామని తెలిపారు. శనివారం పోలింగ్ సిబ్బందికి వీటిని అందజేయనున్నట్లు వివరించారు. ఓట్ల లెక్కింపును సార్వత్రిక ఎన్నికల అనంతరం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున.. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను డివిజన్/నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్ర పరుచనున్నట్లు పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

 గట్టి పోలీసు బందోస్తు
 ప్రాదేశిక ఎన్నికల్లోఅవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను ఏడో తేదీ వరకు మూసివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఓటింగ్‌లో అక్రమాలను పసిగట్టేందుకు వెబ్ క్యాస్టింగ్, వీడియో చిత్రీకరణ జరుపుతున్నట్లు చెప్పారు.

 ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటండి
 ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. ఓటును సద్వినియోగం చేసుకోవాలని, రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కును మద్యం, ధనం, కానుకలు, ఇతర ప్రలోభాలకు లొంగి దుర్వినియోగం చేసుకోవద్దని కోరారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులను వారి ఇంటివద్దే అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా సెలవు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.

 21 పంచాయతీలకు ఎన్నికలు
 శివార్లలోని 21 పంచాయతీలకు ఈ నెల 13న జరిగే ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ బాక్సుల కొరతను అధిగమించేందుకు కర్ణాటక నుంచి 500 బాక్సులను తెప్పించినట్లు చెప్పారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా పూర్తయిందన్నారు.

 ఉద్యోగుల కొరత ఉంది
 పోలింగ్ విధుల నిర్వహణకు సరిపడా ఉద్యోగులను సమకూర్చుకోవడం కష్టంగా మారిందని అన్నారు. సాధారణ ఎన్నికలకు 33 వేల మంది సిబ్బంది అవసరం కాగా, ఇప్పటివరకు 19వేల మంది ఉద్యోగుల వివరాలను మాత్రమే సేకరించామని తెలిపారు. మిగతా వారిని సమీకరించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ నేతృత్వంలోని కమిటీ పనిచేస్తున్నదన్నారు. హైదరాబాద్‌లోని వివిధ సంస్థల ఉద్యోగులను రంగారెడ్డి జిల్లా ఎన్నికల నిర్వహణకు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. 11 వేల మంది ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు వాడుకోవాలని నిర్ణయించామని, వారి సహకారం అభినందనీయమన్నారు. ప్రాదేశిక పోలింగ్ నిర్వహణకు 11,248 మంది ఉద్యోగులను వినియోగిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement