ఫ్లాప్ షో | Sakshi
Sakshi News home page

ఫ్లాప్ షో

Published Mon, Mar 24 2014 2:44 AM

ఫ్లాప్ షో - Sakshi

సాక్షి, ఏలూరు :
అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలను బలవంతగానైనా తరలించి సభల్లో కుర్చీల్ని నింపేవారు. ఇప్పుడు ఆయన వస్తే రోడ్లపై పలకరించేవారే కరువయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం రాత్రి ఏలూరులో నిర్వహించిన రోడ్ షో వెలవెలబోయింది. ఫ్లెక్సీల ఖర్చుకు కూడా ఫలితం దక్కలేదు.

సాయంత్రం 6 గంటలకు  పెద ఎడ్లగాడి వద్ద జిల్లాలో ప్రవేశించిన కిరణ్ రోడ్‌షో శ్రీపర్రు, మాదేపల్లి, గజ్జెలవారి చెరువు, బిర్లా భవన్ మీదుగా 6.45గంటలకు  పాత బస్టాండ్‌కు చేరుకుంది. మూడుచోట్లకిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించారు. మాదేపల్లి, గజ్జెలవారి చెరువు వద్ద 50 మంది కూడా జనం లేరు. పాత బస్టాండ్ వద్దకు మధ్యాహ్నం నుంచే జనాలను తరలించడం వల్ల వచ్చిన కొంతమంది  సాయంత్రం నాలుగు గంటల నుంచి కూర్చున్నారు.
 
ఎంతసేపు ఎదురుచూడాలంటూ స్థానిక నాయకులపై వారు అసహనం వ్యక్తం చేశారు. ఎంత దూరం వచ్చారయ్యా అంటూ కనిపించిన మీడియా ప్రతినిధినల్లా అడిగారు. ఎట్టకేలకు కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చేసరికి ఆ ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి. సెంట్రల్ లైటింగ్ వెలగకపోవడంతో బస్సుపై ఉన్న నాయకులు జనాలకు సరిగా కనిపించలేదు.
 
కొందరైతే అక్కడున్న నాయకుల్లో కిరణ్ ఎవరంటూ పక్కవారిని అడిగి తెలుసుకున్నారు. కిరణ్‌తోపాటు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పితాని సత్యనారాయణ, గంటా మోహన్‌రావు(జీఎంఆర్), ఎమ్మార్డీ బలరామ్ ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో నిమిషం మాట్లాడారు. అందరూ కిరణ్ కుమార్‌రెడ్డి ప్రజల కోసం పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. సమైక్యాంధ్ర పార్టీని ఆదరించాలంటూ పితాని ముక్తసరిగా మాట్లాడి సరిపెట్టారు.
 
కిరణ్ ప్రసంగానికి ప్రజల నుంచి స్పందన లేకపోయింది. కేసీఆర్‌ను విమర్శిస్తున్నప్పుడు ‘ఆయన బాత్‌రూమ్‌లో బక్కెట్లోకి వచ్చే నీళ్లా.. నింపుకోగానే  కట్టేయడానికి’ అన్నప్పుడు ఇదేం పోలికంటూ జనం గుసగుసలాడుకున్నారు. చంద్రబాబుని, కాంగ్రెస్ పార్టీని కిరణ్ విమర్శించారు. అక్కడి నుంచి పవర్‌పేట గేటు మీదుగా ఆర్‌ఆర్ పేట నుంచి ఫైర్‌స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్ వరకూ కిరణ్ రోడ్‌షో నిర్వహించారు. రోడ్ షోను ఎక్కడా జనం పట్టించుకోలేదు. తనవైపు చూసిన వారికి అభివాదం చేస్తూ రాత్రి 8 గంటలకు యాత్ర ముగించారు.
 
రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారకుడు
తెలుగు జాతి కలిసుండాలని నోటితో చెప్పలేని పిరికివాడు చంద్రబాబు అని ఎన్..కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు వెళ్లినప్పుడు తన లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పుకున్న చంద్రబాబు.. సీమాంధ్రకు వచ్చినప్పుడు మాత్రం రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారంటూ రెండు నాల్కల ధోరణి అవలంబించారన్నారు. విభజనపై అసెంబ్లీలో 40 రోజులు చర్చ జరి గితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఏనాడూ చెప్పలేదన్నారు.
 
రాష్ట్రాన్ని విభజించుకోమని కేంద్రానికి రెండు లేఖలు రాసిన వ్యక్తి చంద్రబాబు అని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. 1,800 రోజలు పదవిలో ఉండి ఉద్యోగులకు జీతాలివ్వడం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.40 వేల కోట్లు అప్పు తీసుకువచ్చిన ఆయన పరిపాలనాదక్షుడా అంటూ దుయ్యబట్టారు. నీళ్లు ఆపేస్తానని అంటున్న కేసీఆర్‌కు ఆ శక్తి లేదన్నారు.  
 
 తాను ముఖ్యమంత్రిగా ఉండి విభజనను అడ్డుకోలేదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు అంటున్నారని, అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును తలుపులు మూసి వారి సహకారంతో పార్లమెంట్‌లో పాస్ చేస్తారని తమకెలా తెలుస్తుందని ప్రశ్నించారు.  కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి, జ్ఞానం ఉంటే విభజన నిర్ణయం తీసుకుని ఉండేవి కాదన్నారు. కిరణ్ వెంట జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పలువురు జిల్లా నేతలు ఉన్నారు. ఏలూరులో పర్యటన ముగించుకుని రాత్రి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో కిరణ్ హైదరాబాద్ బయలుదేరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement