హవా | Sakshi
Sakshi News home page

హవా

Published Tue, Mar 25 2014 2:16 AM

హవా - Sakshi

 సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికలు ఏవైనా సరే ప్రజానీకంలో ఒకే తీర్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇదే తీర్పును చూపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 24  ఎంపీటీసీలు ఏకగ్రీవంగా కాగా అందులో 16 స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. ఆరు స్థానాలను మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. ఒక స్థానంతోనే కాంగ్రెస్ సరిపెట్టుకుంది. మరో స్థానాన్ని వైఎఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు దక్కించుకున్నారు. మొత్తం మీద స్థానిక ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.

 జిల్లాలో 2011 నుంచి ప్రత్యక్ష ఎన్నికలు ఏవైనా అంతిమ విజయం వైఎస్సార్‌సీపీదేనని రుజువు అవుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రకటనతోనే ఆపార్టీ మద్దతుదారుడుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసిన దేవగుడి నారాయణరెడ్డి గెలుపొందారు. 2011 మేనెల 8న కడప పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో ఏడు నియోజకవర్గాలలో ఎన్నికలు చోటుచేసుకోగా వైఎస్సార్‌సీపీకి 67 శాతం ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి 14.2శాతం, తెలుగుదేశం పార్టీకి 12.5శాతం ఓట్లు లభించాయి.

  వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి 6,92,251 ఓట్లు లభించాయి. అత్యధికంగా 5,45,672 ఓట్ల మెజార్టీని వైఎస్ జగన్ సాధించారు.  2012 మే12న చోటు చేసుకున్న ఉప ఎన్నికల్లో కూడా జిల్లా ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారు. రాయచోటిలో 57శాతం ఓట్లు ఆపార్టీకి దక్కగా, కాంగ్రెస్ పార్టీకి 15.9శాతం, తెలుగుదేశం పార్టీకి 21.4శాతం ఓట్లు ద క్కాయి. రైల్వేకోడూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 53.8 శాతం ఓట్లు లభించగా, కాంగ్రెస్ పార్టీకి 27.9శాతం, తెలుగుదేశం పార్టీకి 14.2 శాతం ఓట్లు దక్కాయి. రాజంపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి 52.5శాతం ఓట్లు దక్కగా, కాంగ్రెస్ పార్టీకి 26.4శాతం, తెలుగుదేశం పార్టీకి 14.6 శాతం ఓట్లు దక్కాయి. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ తన ఆధిపత్యాన్ని ఆ ఎన్నికల్లో చాటుకుంది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో 52.5 శాతం నుంచి 67 శాతం వరకూ ఓటర్లు ఆపార్టీకి అండగా నిలిచారు.

 సహకార, పంచాయితీ ఎన్నికల్లో సైతం....
 ఎన్నికలు ఏవైనా వైఎస్సార్‌సీపీ బలపర్చిన వ్యక్తులకే అనుకూలంగా ఓటర్లు తీర్పు చెబుతున్నారు. అందుకు సహకార సంఘాలు, పంచాయితీ ఎన్నికలు దర్పం పడుతున్నాయి. జిల్లాలో 77 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 21 చోట్ల తప్పనిసరిగా ఓటమి చెందుతామని భావించిన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2చోట్ల కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించలేదు. 54 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే 34 సహకార సంఘాల పాలక వర్గాలలో  వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుపొందారు.

 ప్రభుత్వం వాయిదా వేసిన 21 సంఘాలకు తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే వాటిని కూడా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే దక్కించుకున్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పంచాయితీ ఎన్నికల్లో కూడా ఆపార్టీ మద్దతుదారులు విజయబావుటా ఎగురవేశారు. 783 పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తే అందులో 453 సర్పంచ్ స్థానాలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు.

 152చోట్ల కాంగ్రెస్ పార్టీ వర్గీయులు, 143 చోట్ల తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. 35చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. ఇలా జిల్లాలో ఎన్నికలు ఏవైనా లక్ష్యం ఒక్కటేనని జిల్లా ప్రజానీకం ఏకపక్షంగా తీర్పు ఇస్తున్నారు. ప్రస్తుతం అదే తీర్పును స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూపెడుతున్నారు. ఇప్పటికే ఏకగ్రీవంగా 24 ఎంపీటీసీలు ఎంపికైతే 16చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఒక చోట ఆపార్టీ సానుభూతి పరుడు స్వతంత్రుడుగాను ఎంపికయ్యారు.

Advertisement
Advertisement