అత్తారింటికి దారి..! | Sakshi
Sakshi News home page

అత్తారింటికి దారి..!

Published Mon, Jan 13 2014 11:15 PM

అత్తారింటికి దారి..!

పల్లెలన్నీ అల్లుళ్లతో కళకళలాడే పెద్ద పండుగ సంక్రాంతి. ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండలంలోని భూదేవిపేటకు మాత్రం ఆ కళ ఏడాదంతా ఉంటుంది! ఈ గ్రామంలో ఉన్నవారంతా ఇల్లరికపుటల్లుళ్లు కావడమే అందుకు కారణం. ఎక్కడెక్కడో ఉన్న అల్లుళ్లంతా సంక్రాంతినాడు అత్తారిళ్లకు చేరితే ఇక్కడి అల్లుళ్లు మాత్రం ఊరు దాటకుండానే పండుగ సంబరాల్లో మునిగి తేలతారు. 120 కుటుంబాలున్న ఈ గ్రామంలో 115 మంది ఇల్లరికం అల్లుళ్లే కావడం గ్రామానికి ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది. ఆడపడుచులకు ఇక్కడ లభించే  ఆదరణ అంతా ఇంతా కాదు. దీనివల్ల అల్లుళ్లను ఈ ఊరు అక్కున చేర్చుకుంటోంది. అత్తమామలే వారికి కన్నవారితో సమానులు.

అత్తిల్లే వారికి సొంతిల్లు. అత్తమామల ఆదరణ కారణంగా ఇల్లరికం అల్లుళ్లతో రికార్డు సృష్టించింది భూదేవిపేట. ఊళ్లో ఐదుగురు అమ్మాయిలను మాత్రమే  వేరే ప్రాంతాల  వారికి ఇచ్చి పెళ్లి చేయగా, కేవలం వారు మాత్రమే ఆయా ఊళ్లలో నివాసాలుంటున్నారు. మిగతా నూట పదిహేనుమంది అమ్మాయిలకు సొంతూరే అత్తింటి చిరునామాగా స్థిరపడింది. ఈ ఊరికి అల్లుళ్లుగా వచ్చిన వారిలో పశ్చిమ, తూర్పుగోదావరిజిల్లాలతోపాటు, శ్రీకాకుళం, ఖమ్మం జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఇలా వచ్చిన అల్లుళ్లు ఇదే గ్రామానికి చెందిన వారిని మళ్లీ అల్లుళ్లను  చేసుకోవడంతో ఇది అల్లుళ్ల గ్రామంగా పేరొందింది. పూర్వం ఈ గ్రామానికి బుడ్డిపేటగా పేరుండేది.

వసంతవాడ పెదవాగు ఇవతలి ఒడ్డున ఈ గ్రామం  ఉండేది. 60 ఏళ్లకు పూర్వం శ్రీకాకుళం జిల్లా బుడ్డిపేట గ్రామానికి చెందిన సన్నిపల్లి నర్సయ్య, అప్పారావు, వీరయ్య, రామయ్య, అనే నాలుగు వెలమ దొరలకుటుంబాలు ఈ ప్రాంతానికి వలస వచ్చాయి. క్రమేపీ ఈ కుటుంబాలు 20 అయ్యాయి. వీరి పూర్వీకులు అప్పట్లో భూదేవిపేటగా నామకరణం చేశారు. 1986వ సంవత్సరంలో వచ్చిన గోదావరి వరద సమయంలో ఊరంతా కొట్టుకుపోవడంతో వరద మునగని మెరకప్రాంతాన్ని ఎంచుకొని వలస వచ్చారు. పాతభూదేవిపేట నివాస ప్రాంతమంతా పొలాలుగా మారింది. ఈ గ్రామం అంతరించి పోయింది. ఆ స్థానంలో నేడు కొత్తభూదేవిపేట గ్రామం  ఆవిర్భవించింది. అల్లుళ్ల గ్రామంగా పేరు పొందింది.
 
- ఎం.ఏ సమీర్
 సాక్షి, వేలేరుపాడు, ఖమ్మం జిల్లా

 
 మొదటి అల్లుణ్ణి: మాది అశ్వారావుపేట మండలం నారాయణపురం.1969లో కర్నాటి చినరామయ్య అల్లుడిగా ఇల్లరికం వచ్చా. అత్తమామలు పెళ్లికానుకగా రెండు ఎకరాలు పొలం ఇవ్వగా, మరో రెండు ఎకరాలు కొనుక్కున్నాను. అందులో వ్యవసాయం చేస్తున్నాను. మా గ్రామంలో ఉన్నంత ప్రశాంత వాతావరణం ఎక్కడా ఉండదని తెలుసుకున్నాను.
 - చందా ముత్తయ్య
 
 32 ఏళ్ల క్రితం ఇల్లరికానికి... మాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. 32 ఏళ్ల క్రితం భూదేవిపేటకు చెందిన నాగమణితో వివాహమైంది. ఇల్లరికం అల్లుడిగా వచ్చా. మా మామగారు రెండెకరాల భూమి మాకిచ్చారు. అందులో వ్యవసాయం చేసుకుంటున్నాం.
 - ఎం. నర్శింహారావు
 
 ఒరిస్సానుంచి  వచ్చా...

 ఒరిస్సా లోని మోట్ నుండి 22 ఏళ్ల క్రితం అల్లుడిగా వచ్చి, భూదేవిపేటలో సెటిల్ అయిపోయాను. ఈ గ్రామానికి చెందిన రమాదేవిని పెళ్లాడాను. అప్పటి నుంచి టైలరింగ్ వృత్తిని సాగిస్తూ బతుకుబండి లాగిస్తున్నాను. నాకు ఇద్దరుఅమ్మాయిలు. వీరిలో ఒకరికి ఇదే గ్రామంలో వివాహం  చేశాను.
 - ఇందారపు రాము

Advertisement
Advertisement