ఈ వైరుధ్యమే కారణం!

4 Dec, 2014 23:18 IST|Sakshi
ఈ వైరుధ్యమే కారణం!

ఆశీర్వాదాలు అందడంలో ఆలస్యానికి 

గొల్యాతు అనే ఫిలిష్తీయుని దేహదారుఢ్యం, పెడబొబ్బలకు జడిసి ఇశ్రాయేలీయుల్లో ఎవరూ అతన్నెదుర్కోవడానికి సాహసించడం లేదు. అయితే చాలా చిన్నవాడు, బలహీనుడు, యుద్ధ విద్యలేవీ రాని గొర్రెల కాపరియైన దావీదు,  విశ్వాసియైన తన ముందు అన్యుడైన గొల్యాతు ఎంత? అన్న రోషంతో కేవలం తన వడిసెలతో చిన్నరాయితో అతన్ని పడగొట్టి చంపి గొప్ప విజయం సాధించి పెట్టాడు (1 సమూ 17:17-54).

విజయ సాధనలో ఆయుధాలు, సామర్థ్యం కన్నా దృక్పథమే కీలకం. ‘నేను గొప్పవాణ్ణి’ అని కాకుండా ‘నా దేవుడెంతో గొప్పవాడు’ అన్న దృక్పథం గలవాడే విజయుడవుతాడు. బల్బు వెలగడానికి మూలం అదృశ్యంగా ఉండే విద్యుచ్ఛక్తిలో ఉన్నట్టే, విశ్వాసి శక్తికి మూలం, ప్రాప్తి స్థానం దేవుడే!

దేవుడు తన తెలివిని, సామర్థ్యాన్నంతా మనిషిలో నిగూఢపర్చాడు. వాటితో అతడు తన జీవితాన్ని, చుట్టూ ఉన్న లోకాన్ని పరలోకానందమయం చేసుకోవాలని సంకల్పించాడు. కాళ్లు, చేతులు లేని వారిని ఈ లోకం వికలాంగులంటుంది. కాని తాను దేవుని వాడనని, దేవుని రూపమే కాదు శక్తి కూడా తనదేనన్న గ్రహింపులేక జీవితాన్ని నిరర్థకం చేసుకునేవాడే నిజమైన వికలాంగుడు. మనిషి ప్రజ్ఞకు, సామర్థ్యానికి దేవుని కృప అనే నేల, పరిశుద్ధాత్మ సహవాసం అనే తేమతోనే సృజనాత్మక శక్తి రూపం వస్తుంది. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. తనకేది ఉత్తమమైనదో మనిషికి తెలియదు. ఉత్తమమైనది తప్ప మనిషికి మరొకటివ్వడం దేవునికిష్టం ఉండదు. మనకు ఆశీర్వాదాలు రావడంలో ఆలస్యానికి ఈ వైరుధ్యమే కారణం. అందువల్ల  దేవుని సమయానికి, సంకల్పానికి తలవంచే ఆత్మీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలి. దైనందిన జీవన స్థితిగతులు, పరిణామాలను పరలోకపు దృష్టితో చూడగలిగితే విశ్వాసి జీవితమంతా విజయపథమే.

 దేవుని నిర్ణయాల్లో పొరపాట్లుండవు. ఆయన శక్తిని, పద్ధతులను మనం అర్థం చేసుకోవడంలోనే పొరపాట్లుంటాయి.
 - రెవ. టి.ఎ. ప్రభుకిరణ్
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా