బుద్ధుని ప్రసంగ పాఠాలు | Sakshi
Sakshi News home page

బుద్ధుని ప్రసంగ పాఠాలు

Published Thu, Feb 19 2015 11:58 PM

బుద్ధుని  ప్రసంగ పాఠాలు

బౌద్ధవాణి
 

పూర్వం వారణాసిలో ఏరకపత్రుడనే ధనికుడు ఉండేవాడు. అతనికి పెళ్లీడుకొచ్చిన ఒక కూతురుంది. ఆమెను వివాహం చేసుకోవడానికి ఎందరో ధనికయువకులు ముందుకొచ్చారు. తన కుమార్తె అందం, తన ఐశ్వర్యం చూసి వారంతా వస్తున్నారని గ్రహించాడు ఏరకపత్రుడు. సాధారణంగా ధనం కలిగిన యువకులు దురలవాట్లకు లోనవుతారు. అహం, నిర్లక్ష్యం రెండూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు లేని వారికోసం వెదుకుతున్నాడు. అలాంటి వారిని గుర్తించడానికి కొన్ని ప్రశ్నలు తయారు చేసుకున్నాడు. వచ్చిన ప్రతి యువకుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగి, అతనికి ప్రవర్తన, మనోస్థితిని అర్థం చేసుకునేవాడు. అలా పరీక్షించి, వచ్చిన వాళ్లందర్నీ తిప్పి పంపుతున్నాడు.
 ఆ పక్కనే ఉన్న పట్టణంలో ఓ సాధారణ కుటుంబానికి చెందిన ఉత్తరుడు అనే యువకునికి ఈ విషయం తెలిసి పరీక్షకు వెళ్లాడు.
 ఏరకపత్రుడు ప్రశ్నలు అడిగాడు.

 ‘‘ఎవరు స్వతంత్రుడు?’’
 ‘‘ఇంద్రియాల్ని, ఆశల్ని అదుపులో పెట్టుకున్నవాడు’’
 ‘‘కుబేరునికి ఉన్నంత ధనరాశి మొత్తం ఒక పిడికెడు మట్టితో ఎప్పుడు సమానం అవుతుంది?’’
 ‘‘దానం చేయనప్పుడు, అవసరాలకు వినియోగించుకోనప్పుడు ఆ ధనం పనికిరానిది అవుతుంది’’
 ‘‘మామూలు మూర్ఖుడెవరు? పండిత మూర్ఖుడెవరు?’’
 ‘‘పదాల భావాన్ని కాకుండా వాటి అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు తెలియడమే జ్ఞానంగా భావించే వాడు పండిత మూర్ఖుడు. ఈ పండిత మూర్ఖుణ్ణి గొప్ప పండితుడు అనుకునేవాడు మామూలు మూర్ఖుడు’’
 ఇలా మూడు ప్రశ్నలకూ, మూడు సమాధానాలు చెప్పాడు ఉత్తరుడు. ఆ సమాధానాలు ఏరకపత్రునికి నచ్చి,
 ‘‘నాయనా నీవు బుద్ధుని ప్రసంగాలు వింటావా?’’ అని అడిగాడు.
 ‘‘అవునండీ, నేనూ, మా కుటుంబం ఎప్పుడూ బుద్ధుని ప్రసంగాలు వింటాం, ఆచరిస్తాం’’ అని చెప్పాడు.
 బుద్ధుని ప్రసంగాల్లో ఉండే శాంతం, అహింస, దయ, కరుణ, ప్రేమ, దానం, శీలం... ఇలాంటి గుణాలు కలిగిన యువకుడై ఉంటాడని గుర్తించి తన కుమార్తెను సంతృప్తితో కూడిన సంతోషంతో ఉత్తరునికిచ్చి వివాహం చేశాడు ఏరకపత్రుడు.
 - బొర్రా గోవర్ధన్
 

Advertisement
Advertisement