తోం తోం తోం | Sakshi
Sakshi News home page

తోం తోం తోం

Published Wed, Aug 23 2017 11:59 PM

తోం తోం తోం - Sakshi

నిద్ర మత్తుతో లేచి బ్రష్‌ మీద కాస్త పేస్ట్‌ పూసి
తోం తోం తోం అని తోమడం కాదు...
పళ్లు చిగుర్ల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే
రైట్‌ బ్రష్‌... కరెక్ట్‌ పేస్ట్‌...
పర్‌ఫెక్ట్‌ టెక్నిక్‌ ఉండాలంతే!
పళ్ల ప్రాబ్లమ్‌లు మిమ్మల్ని కొరుకుతూ ఉంటే
ఈ చిట్కాలను ఒకసారి నెమరేయండి...
పళ్లు నవ్వాలంటే చిగుర్లు బలంగా ఉండాలి!!


పిల్లలకు డెంటల్‌ కేర్‌ అండ్‌ బ్రషింగ్‌
పసివయసు పిల్లలకు  ప్రతిసారీ పాలుపట్టాక వాళ్ల నోటిని తడి గుడ్డతో గానీ, మామూలు నీళ్లలో ముంచిన దూదితో గానీ శుభ్రం చేయాలి. పాలపళ్లు వచ్చాక టూత్‌బ్రష్‌తో పళ్లు శుభ్రం చేసుకునేలా శిక్షణ ఇవ్వాలి. రెండేళ్ల వయసు కంటే ముందే ఫ్లోరైడ్‌ టూత్‌పేస్ట్‌వాడాలనుకుంటే మొదట డెంటిస్ట్‌ను కలిసి వారి సలహా తీసుకోవాలి. ∙పిల్లలు ఊయగలరు అనీ, టూత్‌పేస్ట్‌ను మింగరు అని నిర్ధారణ అయ్యాక వాళ్ల టూత్‌బ్రష్‌పై కాస్తంత టూత్‌పేస్ట్‌ వేసి వాళ్లు పళ్లు తోముకునేలా చేయాలి. ∙చిన్నారులకు ఆరేళ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రులే బ్రష్‌ చేయడం మంచిది.

పిల్లలు నిద్రపోవడానికి ముందే పాలుపట్టడం పూర్తిచేయండి. వాళ్లు నిద్రపోయాక బాటిల్‌ను అలాగే నోట్లో ఉంచవద్దు. ∙పిల్లల మొదటి పుట్టినరోజు నాటి నుంచే వాళ్లు కప్స్‌ సహాయంతో ఆహారాన్ని చప్పరించి తీసుకునేలా ప్రోత్సహించండి. ∙వారు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అలవాటు చేయండి. ఆహారంలో ఆకుకూరలు, పళ్లు, కాయధాన్యాలు ఎక్కువగా తినేలా, ఆహారం తీసుకునేప్పుడు  చక్కెర పదార్థాలు తక్కువగా తినేలా చూడండి.

పిల్లలు ఉపయోగించే బ్రష్‌ మృదువైన బ్రిజిల్స్‌ ఉన్నదై ఉండాలి. ∙బ్రష్‌ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్‌ చేసుకునేలా చూడాలి. రఫ్‌గా బ్రష్‌ చేసుకోవడం పిల్లల చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు.

పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్‌ చేసుకోవడం వారికి నేర్పాలి. ∙పిల్లలు అదేపనిగా బ్రష్‌ను నములుతూ ఉండకుండా చూసుకోవాలి. ఆ అలవాటును ప్రోత్సహించవద్దు. ∙బ్రష్‌ చేసుకునే ప్రక్రియ కనీసం రెండు నిమిషాల పాటు కొనసాగాలి. మరీ ఎక్కువ సేపు కూడా బ్రషింగ్‌ వద్దు. ∙నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకునేలా టంగ్‌క్లీనింగ్‌ పిల్లలకు నేర్పాలి. ∙చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్‌ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ముందువైపు పళ్లకు పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్‌ చేసుకునేలా నేర్పాలి. వెనకవైపు పళ్లకు, బ్రష్‌ను గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్‌ చేసుకునేలా చూడాలి

పిల్లలూ... పిప్పిపళ్లు
పిల్లల్లో పాల పళ్ల దశలో బ్రషింగ్‌ సరిగా జరగకపోతే కీలకమైన పాలపళ్లు కాస్తా పిప్పిపళ్లుగా మారే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో పాలపళ్లు చాలా ప్రధానమైనవి. ఆహారం నమలడానికి, మాట్లాడటానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ దంతాలు చాలా దోహదపడతాయి. పాలపళ్లు సరిగా ఉంటే భవిష్యత్తుల్లో శాశ్వత దంతాలు సక్రమంగా రావడానికి చాలా ఉపయోగకరం. సాధారణంగా ఆర్నెల్ల వయసులో వచ్చే పాలపళ్లు వచ్చినప్పటి నుంచీ అవి పాడయ్యే అవకాశాలు ఉంటాయి. తీపిపదార్థాలు, చక్కెర ఉన్న పానీయాలు ఎక్కువగా తాగడం, పిల్లలు ఏడ్వకుండా ఉండటానికి పాలపీకను నోట్లో ఉంచేయడం వంటి అలవాట్లతో పళ్లు పాడవుతాయి. పళ్లన్నీ పిప్పిపళ్లుగా మారితే– పాడైన వాటినన్నింటినీ తొలగించాల్సి రావచ్చు. అయితే త్వరగా డాక్టర్‌ను సంప్రదిస్తే వాటిని కాపాడుకోడానికీ అవకాశం ఉంది. అందుకే ఒక వయసు వచ్చాక పిల్లల బ్రషింగ్‌పై తల్లిదండ్రులు తప్పక శ్రద్ధ చూపాలి.

అనేక రకాల టూత్‌పేస్ట్‌లు
మనకు ఇవాళ రకరకాల టూత్‌పేస్ట్‌లు లభ్యమవుతున్నాయి. వాటిలో అనేక రకాల సౌలభ్యాలూ ఉన్నాయంటూ తయారీదారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. దాంతో మనకు ఎలాంటి టూత్‌పేస్ట్‌ కావాలనే దానిపై సందిగ్ధం నెలకొంటుంటుంది. అయితే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం ఒకటుంది. ప్రతివారికీ వేర్వేరు జీవనశైలి ఉంటుంది. కాబట్టి ఒకరికి అనువైన టూత్‌పేస్ట్‌ మరొకరికి అనువుగా ఉంటుందనే నియమం ఉండదు. కాబట్టి ప్రతివారూ తమ అవసరాల మేరకు తమ టూత్‌పేస్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా మనకు అందుబాటులో ఉండి, ఎంచుకోదగ్గ టూత్‌పేస్ట్‌లు ఇవి...

పిల్లల టూత్‌పేస్ట్‌లు : పిల్లల టూత్‌పేస్ట్‌లలో ఫ్లోరైడ్‌ పాళ్లు పెద్దవారి టూత్‌పేస్ట్‌ కంటే తక్కువగా ఉంటాయి. నిజానికి ఫ్లోరైడ్‌ పాళ్లు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉంటే అది చాలా హానికరం. అలాగే గారపోగొట్టేలా రుద్దగల శక్తి (అబ్రేసివ్‌గుణం) కూడా పిల్లల టూత్‌పేస్ట్‌లో చాలా తక్కువగా ఉండాలి. అలాగే వారి దంతాలు, చిగుర్లు సున్నితంగా ఉంటాయి కాబట్టి శక్తిమంతమైన రసాయనాలు లేని స్వాభావికమైన టూత్‌పేస్ట్‌లను డాక్టర్‌ను సంప్రదించి తీసుకోవాలి.

ఫ్లోరైడ్‌ ఉన్న టూత్‌పేస్ట్‌లు : మనదేశంలో ఫ్లోరైడ్‌ పాళ్లు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉన్నందున ఫ్లోరైడ్‌తో కూడిన నీళ్ల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయిగానీ... నిజానికి తగిన పాళ్లలో ఉంటే ఫ్లోరైడ్‌ వల్ల దంతాల ఎనామెల్‌కు రక్షణ కలుగుతుంది. అలాగే దంతాన్ని దృఢంగానూ చేస్తుంది. కాబట్టి మనకు పుష్కలంగా ఫ్లోరైడ్‌ లభ్యత ఉన్నచోట్ల మినహాయించి తగినంత ఫ్లోరైడ్‌ లభ్యత లేని మిగతా ప్రాంతాల వారు ఫ్లోరైడ్‌ ఉన్న టూత్‌పేస్ట్‌లను వాడవచ్చు.

దంతాలను తెల్లగా చేసేవి (టీత్‌ వైటెనింగ్‌ టూత్‌పేస్ట్స్‌) : దంతాలు కాస్త పసుపుపచ్చగా అనిపిస్తున్నవారు గారపొగొట్టేలా రుద్దగల శక్తి (అబ్రేసివ్‌ గుణం) ఉన్న టూత్‌పేస్ట్‌లను వాడటం మంచిది. అయితే అలాంటివి వాడేవారు కాస్తంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గారపోగొట్టే ‘యాంటీ స్టెయిన్స్‌’ టూత్‌పేస్ట్‌ను ఎక్కువ మోతాదులో ఉపయోగించడం వల్ల క్రమంగా పంటిపై ఉండే ఎనామెల్‌ కూడా దెబ్బతినవచ్చు.

సున్నితమైన దంతాల కోసం వాడాల్సినవి (సెన్సిటివ్‌ టూత్‌పేస్ట్స్‌) : త్వరగా ప్రభావితం కాగల చాలా సున్నితమైన పళ్లు (సెన్సిటివ్‌ టీత్‌) ఉన్నవారు, చిన్న సమస్యకే చిగుర్ల నొప్పి వచ్చేవారు సెన్సిటివ్‌ టూత్‌ పేస్ట్‌లు వాడాలి. ఇలాంటివారు పొటాషియమ్‌ నైట్రేట్‌ ఉన్న టూత్‌పేస్ట్‌ వాడటం మంచిది. ఎందుకంటే ఆ రసాయనం నొప్పిని తెలిపే యంత్రాంగాన్ని కాసేపు నిద్రాణంగా ఉంచుతుంది. దాని వల్ల కాసేపు నొప్పి తెలియకుండా ఉంటుంది.

హెర్బల్‌ టూత్‌పేస్ట్‌లు : నేచురల్‌ ఆరోగ్యప్రదాయిను లంటూ ఇటీవల స్వాభావికమైన మూలికలు, అటవీ ఉత్పాదనతో తయారు చేసే టూత్‌పేస్ట్‌లు ఎక్కువగా వస్తున్నాయి. సాధారణంగా కొందరికి రసాయనాలతో తయారైన టూత్‌పేస్ట్‌లు కొద్ది మొత్తంలో తీసుకున్నా వారికి సరిపడవు. అలాంటి వారు ఈ హెర్బల్‌ టూత్‌పేస్ట్‌లను వాడవచ్చు. అయితే ఈ టూత్‌పేస్ట్‌ లలో ఫ్లోరైడ్‌ ఉండదు కాబట్టి... ఫ్లోరైడ్‌ నీళ్లు దొరికే ప్రాంతాల వారు, ఫ్లోరైడ్‌ అవసరాలు లేనివారు వీటిని వాడవచ్చు. అయితే ఫ్లోరైడ్‌ ప్రాంతాల వారితో పాటు మిగతా ప్రాంతాలవారు కూడా ఒకసారి తమ దంతవైద్యుడిని సంప్రదించాకే ఈ హెర్బల్‌ టూత్‌పేస్ట్‌లు వాడటం మంచిది.

గారను తొలగించే పేస్ట్‌లు (యాంటీ ప్లాక్‌ టూత్‌ పేస్ట్‌) : పళ్లపై పేరుకునే పాచికి ఒక లక్షణం ఉంటుంది. వెంటవెంటనే బ్రష్‌ చేసుకుంటే ఆ పాచి త్వరగా తొలగిపోతుంటుంది. కానీ బ్రష్‌ చేయడంలో అలసత్వం వహించినప్పుడు అది గార (ప్లాక్‌)గా ఏర్పడుతుంది. అలాంటి గారను దంతవైద్యుల సహాయంతో స్కేలింగ్‌ చేయించాలి. ఇప్పుడు ఈ గారను తొలగించేలా బలమైన, శక్తిమంతమైన యాంటీ ప్లాక్‌ టూత్‌పేస్ట్‌లు దొరుకుతున్నాయి. అయితే వాటిని అవసరమైన వారు కొద్దికాలం పాటు దాన్ని ఉపయోగించాక... గారతొలగిపోయాక మళ్లీ తమ సాధారణ టూత్‌పేస్ట్‌కు మళ్లడం మంచిది. పెద్దగా అవసరం లేకపోయినా అదే పనిగా ఈ యాంటీ ప్లాక్‌ టూత్‌పేస్ట్‌లు వాడటం వల్ల దంతాలు దెబ్బతినవచ్చు. చిగుర్లు గాయపడి మంట (ఇరిటేషన్‌) రావచ్చు.

పైగా ఇవి చిగుర్లను గాయపరచడం వల్ల బ్యాక్టీరియా పేరుకునేందుకు తావిస్తాయి. దాంతో చిగుర్ల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే యాంటీ ప్లాక్‌ టూత్‌పేస్ట్‌లను దీర్ఘకాలం వాడటాన్ని నిపుణులు అంతగా సిఫార్సు చేయరు. సాధారణంగా మనకు లభ్యమయ్యే రకరకాల టూత్‌పేస్ట్‌ల తీరుతెన్నులు ఇవి. ఎవరికి వారు తమ విచక్షణ మేరకు అవసరమైన వారు వాటిని వాడవచ్చు. అయితే తమకు ఎలాంటి టూత్‌పేస్ట్‌ సరిపడుతుందో అనుభవం మీద తెలిశాక... ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి దాన్ని కొనసాగించం అన్ని విధాలా మంచిది.

పెద్దలు బ్రషింగ్‌ ఎలా చేసుకోవాలంటే..!
►మీ దంతసంరక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ప్రతిరోజూ రెండుమార్లు పళ్లు తోముకోండి.
►మీ డెంటిస్ట్‌ను కలిసి క్రమంతప్పకుండా పరీక్షలు చేయించుకోండి.
►మీరు బ్రష్‌ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్‌ ఉన్న బ్రష్‌నే వాడండి.
► దంత సంరక్షణను అందించే మంచి టూత్‌పేస్ట్‌ను ఎంచుకోండి.
► పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్‌ చేసుకోండి.
►బ్రష్‌ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్‌ చేసుకోండి. రఫ్‌గా బ్రష్‌ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. అలాంటప్పుడు అవి త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.
►మీ పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్‌ చేసుకోవాలి. నమిలే ప్రదేశాలల్లో పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ బ్రష్‌ చేసుకోవాలి.
►లోపలివైపున బ్రష్‌ చేసుకోడానికి బ్రష్‌ను నిలువుగా పట్టుకొని పైకీ, కిందికీ మృదువుగా కదిలించండి.
► కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్‌ చేసుకోవాలి.
►నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్‌ చేయండి.
►బ్రష్షింగ్‌ తర్వాత టూత్‌బ్రష్‌ను మృదువుగా రుద్దండి.
►చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్‌ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
►ప్రతి మూడు నెలలకు ఓమారు బ్రష్‌ను మార్చేయండి. లేదా బ్రిజిల్స్‌ వంగినట్లు, దెబ్బతిన్నట్లు కనిపించినా బ్రష్‌ను వెంటనే మార్చండి. 

దంత సమస్యల నివారణ ఎలా?
పిల్లలకు గాని, పెద్దలకు గాని చిగుళ్ల జబ్బులు రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లలకు రెండు పూటలా బ్రష్‌ చేయించడం, పెద్దలూ రెండు పూటలా బ్రష్‌ చేసుకోవడం, పంటికి అతుక్కుపోయే పదార్థాలు తీసుకోకపోవడం, తినేవాటిలో జంక్‌ఫుడ్‌ లేకుండా జాగ్రత్త పడటం అవసరం. దాంతోపాటు స్వీట్స్‌ తగ్గించాలి. తీపి పదార్థాలు తిన్న ప్రతిసారీ నోటిని నీళ్లతో పుక్కిలించాలి.

పంటి చిగుర్లకు ఇన్ఫెక్షన్లు వస్తే..!
పంటి చిగురుకు ఇన్ఫెక్షన్‌ వస్తే మొదట తీవ్రమైన నొప్పి వస్తుంది. అంతలోనే అకస్మాత్తుగా అది లేకుండా మాయమైనట్లు అనిపిస్తుంది. పంటి చుట్టూ చీము చేరుతుంది. ఈ ఇన్ఫెక్షన్‌ చిగురుకు పూర్తిగా పాకుతుంది. అది పంటిని వదులు చేస్తుంది. అక్కడో గడ్డ కూడా కావచ్చు. ఒక్కోసారి అది చిదిమినట్లవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. నొప్పి లేదంటే అదేదో తగ్గిపోయిందనీ, డెంటిస్ట్‌ దగ్గరికి వెళ్లనక్కర్లేదని అర్థం కాదు. ఒకవేళ చీము అంతా ఎండిపోకపోతే అది క్రమంగా దవడకూ, తలకే కాదు... నొప్పి మెడవరకూ పాకొచ్చు. అది భయంకరంగా మారొచ్చు. నిజానికి మన నోట్లోనే బోల్డన్ని బ్యాక్టీరియా (సూక్ష్మజీవులు) ఉంటాయి. మనలో దంతక్షయంగానీ ఉంటే ఆ దెబ్బతిన్న పన్నులోని మృతకణాలున్న భాగం బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడి ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. దంతంలో ఏదైనా భాగం దెబ్బతిని ఉంటే... అదే బ్యాక్టీరియా విస్తరించేందుకు సింహద్వారమవుతుంది. అలా ఇన్ఫెక్షన్‌ వస్తే మాటిమాటికీ నొప్పి వస్తూ ఉంటుంది. వేడి లేదా చల్లటి పదార్థాలు తిన్నప్పుడల్లా జిల్లుమంటుంది. అదేకాదు... నమలగానే  నొప్పి ఠక్కున పొడుచుకొని వస్తుంది.

అప్పటికీ డెంటిస్ట్‌కు చూపించకపోతే ఆ ఇన్ఫెక్షన్‌ శరీరంలోని మరే అవయవానికైనా విస్తరిస్తుంది. ఉదాహరణకు గొంతులోని గ్రంధులు వాచినట్లుగా కావచ్చు. నోరు దుర్వాసన వస్తున్నట్లు, మనమేదైనా నోట్లోకి తీసుకుంటే దాని రుచి మారినట్లు అనిపిస్తుంది. ఇలా అనిపిస్తే నోట్లో చిగురు వద్ద వచ్చిన గడ్డ పలిగినందుకు అది సూచన. ఇలాంటప్పుడు నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది గానీ వాస్తవానికి ఇన్ఫెక్షన్‌ మాత్రం మన శరీరంలోనే ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం కావచ్చు. అందుకే మన పంటికి ఎలాంటి నొప్పి వచ్చినా వెంటనే డెంటిస్ట్‌కు చూపించుకొని తగిన చికిత్స తీసుకోవాలి.
డాక్టర్‌ ప్రత్యూష హెచ్‌ఓడీ, ఓరల్‌ మెడిసిన్‌
మాక్సీలో ఫేషియల్‌ రేడియాలజీ, కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

 

Advertisement
Advertisement