సమగ్ర స్వాప్నికుడు | Sakshi
Sakshi News home page

సమగ్ర స్వాప్నికుడు

Published Mon, Aug 18 2014 11:42 PM

సమగ్ర స్వాప్నికుడు - Sakshi

స్పృహ
 
అమెరికాలో చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని కాదనుకొని స్వదేశానికి వచ్చారు స్వప్నిల్ చతుర్వేది. ఆయన స్వదేశానికి రావడానికి గల కారణం చాలామందికి నవ్వు తెప్పించింది.

‘‘మన దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాను’’ అని చెప్పినప్పుడు ఆయన్ను ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. అమెరికాలో దశాబ్దకాలం పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశారు చతుర్వేది. ఒకరోజు స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు ‘ఇండియాలో పారిశుధ్యం’ టాపిక్ వచ్చింది. మన పారిశుధ్యంపై ఎన్నో జోక్‌లు! కానీ ఆ జోకులకు చతుర్వేదికి నవ్వాలనిపించలేదు. మనసులో బాధగా అనిపించింది.
 
‘‘ఇండియాకు వెళ్లాలి. నావంతుగా ఏదైనా చేయాలి’’ అనుకున్నాడు. ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా వినిపించుకోకుండా ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. మన దేశంలో ఎంతమందికి మరుగుదొడ్డి సౌకర్యం ఉంది? ఎంతమందికి లేదు?కారణాలు ఏమిటి...వంటి విషయాలను గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. పల్లెల నుంచి పట్నాలకు వలస వచ్చిన వాళ్లు మరుగుదొడ్డి సౌకర్యం లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకున్నారు. ‘సమగ్ర’ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. తన పొదుపు మొత్తాలనుంచి 20 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. పుణేలోని పేదవారికి నాణ్యమైన పారిశుధ్యసేవలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది సమగ్ర.
 
మొదట ‘సులభ్ ఇంటర్నేషనల్’ను ఆదర్శంగా తీసుకోవాలనుకున్నారు. సులభ్‌కు దేశవ్యాప్తంగా 8000 టాయ్‌లెట్ బ్లాక్‌లు ఉన్నాయి. టాయ్‌లెట్‌ను ఉపయోగించుకోవడానికి వ్యక్తికి రెండు రూపాయలు తీసుకుంటారు. ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే కనీసం నెలకు మూడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం పేదలకు పెద్ద మొత్తమే! ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భారం కాని రీతిలో రుసుం నిర్ణయించారు చతుర్వేది. నెలకు యాభై చెల్లిస్తే కుటుంబసభ్యులు ఎంతమంది అయినా సమగ్ర టాయ్‌లెట్‌లను ఉపయోగించుకునే సౌకర్యం కలిపించారు.
 
వినియోగదారులకు ‘పరిశుభ్రత’ ప్రాతిపదికగా బహుమతులు కూడా ఇస్తారు. మరుగుదొడ్డి నుంచి రాగానే సబ్బుతో చేతులను శుభ్రం చేసుకున్న వారికి 50 మార్కులు పడతాయి. ఆలస్యం లేకుండా నెల రుసుము కట్టిన వారికి 500 పాయింట్లు... ఇలా రకరకాల విభాగాల పాయింట్స్ ఆధారంగా బహుమతి ఇస్తుంటారు. ‘సమగ్ర’ ప్రారంభం కాగానే ఊహించినంత స్పందన రాలేదు. దీంతో ప్రచారానికి పని కల్పించాల్సి వచ్చింది. కేవలం ‘సమగ్ర’కు సంబంధించిన ప్రచారానికే పరిమితం కాకుండా టాయ్‌లెట్ పరిశుభ్రత, టాయ్‌లెట్‌కు వెళ్లిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మొదలైన వాటిపై మురికి వాడలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు చతుర్వేది. శానిటరీ నాప్‌కిన్‌లు, చేతులు శుభ్ర పరుచుకోవడానికి అవసరమైన సబ్బులు, టాయ్‌లెట్లు శుభ్రపరుచుకునే వస్తువులు...మొదలైన వాటిని సమగ్ర తక్కువ ధరలకు అందిస్తుంది.
     
 ‘‘తప్పనిసరి పరిస్థితిలో పబ్లిక్ టాయ్‌లెట్‌ను ఉపయోగించేవాళ్లం. చీకటి, మురికి, దుర్వాసనతో కూడిన ఆ టాయ్‌లెట్‌కు వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ పరిస్థితుల్లో‘సమగ్ర’వారి టాయ్‌లెట్లు ఊరట నిచ్చాయి’’ అంటున్నాడు రాజస్థాన్ నుంచి పుణేలోని రామ్‌నగర్ మురికివాడకు వలస వచ్చిన హీరాలాల్. ‘‘మనం ఫేస్‌బుక్ లేకుంటే ఇబ్బందుల్లో పడం. స్మార్ట్‌ఫోన్ లేకుంటే ఇబ్బందుల్లో పడం. పరిశుభ్రమైన మరుగుదొడ్లు లేకపోతే మాత్రం చాలా ఇబ్బందుల్లో పడతాం’’ అనేది చతుర్వేది నినాదం. కొందరికి సొంతంగా టాయ్‌లెట్‌లు ఉన్నా అవి అపరిశుభ్రంగా, రోగాలకు నిలయంగా ఉండేవి. ‘సమగ్ర’ ప్రభావం ఇప్పుడిప్పుడే పుణే మురికివాడల్లో కనిపిస్తోంది. ఎవరికి వారు మరుగుదొడ్డి శుభ్రతకు సమగ్ర ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘‘వాళ్లు డబ్బు గురించి కాదు, మా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. ‘సమగ్ర’ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం’’ అంటున్నాడు పుణేలోని ఓ మురికివాడకు చెందిన రసూల్ అనే కార్మికుడు. మొత్తం మీద ‘‘ఇట్స్ ఏ డర్జీ జాబ్’’ అని వెక్కిరించిన వాళ్లే ఇప్పుడు చతుర్వేదిని వేనోళ్ల పొగుడుతున్నారు.
 
 ‘‘మీరేం చేస్తుంటారు?’’ అని ఎవరైనా పరిచయ సందర్భంలో స్వప్నిల్ చతుర్వేదిని అడిగితే ఆయన ఒకింత గర్వంగా-
 ‘‘సీటీసీ’’ అంటారు.
 ‘‘ిసీటీసీ అంటే?’’ అని అడిగితే-
 ‘‘చీఫ్ టాయ్‌లెట్ క్లీనర్’’ అని చెబుతారు.
  చతుర్వేది ఛలోక్తిగా ఆ మాట అన్నారేమో అని చాలామంది అపోహ పడతారు. కానీ ఆయన చెప్పిన సమాధానంలో పిసరంత హాస్యం కూడా లేదు. ఆయన నిజంగానే చిత్తశుద్ధి ఉన్న సీటీసీ!

 

Advertisement
Advertisement