భీకర యుద్ధ వీరుడు | Sakshi
Sakshi News home page

భీకర యుద్ధ వీరుడు

Published Thu, May 15 2014 10:19 PM

భీకర యుద్ధ వీరుడు

సంక్షిప్తంగా... మహారాణా ప్రతాప్‌సింగ్
 
మహారాణా ప్రతాప్ సింగ్! వాయవ్య రాజస్థాన్‌లోని మేవార్ ప్రాంత రాజపుత్ర పాలకులలో ప్రముఖుడు. అరివీర భయంకరుడు. యుద్ధవీరుడు. అతడి పాలనలో ఎవరైనా చెప్పుకునే విశేషం... యుద్ధక్షేత్రంలో అతడి వ్యూహ కాఠిన్యం. హల్దీఘాట్ యుద్ధంలో అక్బర్‌తో ఓడిపోయాక, ఆ చేదు అనుభవంతో ప్రతాప్ సింగ్ యుద్ధ తంత్రాలలో ఆరితేరాడు. బరువు తక్కువ గుర్రాలతో అతడి సైన్యం చెలరేగిపోయేది. గెరిల్లా పోరాట విధానాలతో శత్రువుని తిరిగి తలెత్తకుండా దెబ్బతీసేది.

యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో, ఆ పరిసరాల్లో అన్నిటినీ ధ్వంసం చేసేది. అన్నిటినీ అంటే ఆహారం, నీరు, భవనాలు ఇలా... శత్రువుకు పనికొస్తుందనుకున్న ప్రతిదాన్నీ నాశనం చేసిపారేయడం, ప్రత్యర్థిని లొంగదీసుకోవడం ప్రతాప్‌సింగ్ కనిపెట్టిన యుద్ధ తంత్రం. గెలుపు కోసం అతడు అమానవీయమైన విధానాలు అవలంబించేవాడు. అదేమంటే... అదే యుద్ధనీతి, అదే రాజనీతి అనేవాడు.

శత్రురాజుకు పావులుగా మారే అవకాశం ఉన్న సాధారణ పౌరులను సైతం అతడు ఆ చుట్టుపక్కల ఉండనిచ్చేవాడు కాదు. వేరే ఎక్కడికో తరలించేవాడు. శత్రువు నీళ్లు తాగుతాడు అనుకున్న బావులలో విషం కలిపించేవాడు. శత్రువు వచ్చే దారులను ధ్వంసం చేయించి, వెళ్లే దారులను మూయించేవాడు. ఇలా తను చనిపోయేవరకు కూడా ప్రతాప్‌సింగ్ మొఘల్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ‘ఆ మాట నిజం కాదు, మొఘలులే అతడికి నిద్రలేకుండా చేశారు’ అనే చరిత్రకారులూ ఉన్నారు.
 
ప్రతాప్‌సింగ్ 1540 మే 9న రాజస్థాన్‌లో జన్మించాడు. 1572 నుండి 1597 వరకు మేవార్‌ను పరిపాలించాడు. 1597 జనవరి 19న యాభై ఆరేళ్ల వయసులో మరణించాడు. అతడిది సిశోడియా వంశం. తండ్రి రాణా ఉదయ్‌సింగ్. తల్లి మహారాణి జైవంతబాయి. భార్య ఆజాబ్దే. ఆమెతో పాటు ప్రతాప్ సింగ్‌కి 11 మంది భార్యలు. మొత్తం 17 మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు. పెద్దవాడు అమర్‌సింగ్. తండ్రి తర్వాత రాజ్యాధికారం చేపట్టింది అతడే.
 
రాణా ఉదయ్‌సింగ్ మేవార్‌ను పరిపాలిస్తున్నప్పుడు 1568లో మొఘల్ చక్రవర్తి అక్బర్ అతడిపైకి దండెత్తి వచ్చి చిత్తోర్‌ఘడ్‌ను ఆక్రమించుకున్నాడు. అక్బర్ సైన్యం రాజప్రాసాదాన్ని ముట్టడించేలోపు ఉదయ్‌సింగ్ కుటుంబం అక్కడి నుంచి తప్పించుకుని ఆరావళి పర్వతశ్రేణుల్లో తలదాచుకుంది. ఆ ప్రాంతంలో అప్పటికే ముందు జాగ్రత్తగా ఉదయ్‌పూర్ నగరాన్ని నిర్మించుకుని ఉన్నాడు ఉదయ్‌సింగ్. తర్వాత అతడు యుద్ధంలో మరణించడంతో అతడి అభీష్టానికి విరుద్ధంగా చిన్న కుమారుడు జగ్మల్‌కు బదులు పెద్ద కుమారుడు ప్రతాప్‌సింగ్ మేవార్ వారసుడయ్యాడు.

 ప్రతాప్‌సింగ్ పాలనా కాలమంతా మొఘలుల నుంచి మేవార్‌ను రక్షించుకోడానికే సరిపోయింది. అయితే ఎన్నో దండయాత్ర లను ఎదుర్కొని పోరాడిన ప్రతాప్‌సింగ్ మరణం యుద్ధభూమిలో సంభవించలేదు! వేటకు వెళ్లినప్పుడు అయిన గాయాలతో అతడు చనిపోవలసి వచ్చింది. అతడి అంత్యక్రియలు మేవార్ రాజధాని ఛవంద్‌లో జరిగాయి.

ఇప్పటికీ అక్కడ ఆయన స్మారకచిహ్మం (పైన గొడుగు వంటి నిర్మాణంతో) ఉంటుంది. ఛవంద్ వెళ్లిన టూరిస్టులు తప్పనిసరిగా ప్రతాప్‌సింగ్ ఛత్రీని చూడాలనుకుంటారట. ప్రతాప్ సింగ్ గుర్రం పేరు చేతక్. ఆ గుర్రంపై దౌడు తీస్తున్నట్లున్న ప్రతాప్‌సింగ్ విగ్రహం ఉదయ్‌పూర్‌లో కనిపిస్తుంది.
 

Advertisement
Advertisement