ఈ ‘కేవ్’ ఓనర్ పూరీ జగన్నాథ్‌! | Sakshi
Sakshi News home page

ఈ ‘కేవ్’ ఓనర్ పూరీ జగన్నాథ్‌!

Published Sun, Aug 3 2014 1:27 AM

Director Puri Jagannath starts new office

సీన్ నం.1
 ఎనిమిది నెలల క్రితం...
 హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని
 రోడ్ నం. 31లో
 ఓ పాత బిల్డింగ్‌ను కూలగొడుతున్నారు.
 మొత్తం కూల్చేసి పునాదులు తీయడానికే
 చాలా రోజులు పట్టింది.
 కట్ చేస్తే...

 
 సీన్ నం.2
 2014 జూలై 31...
 ఇప్పుడా ప్లేస్‌లో "cave'వెలిసింది.
 ‘కేవ్’ అంటే గుహ.
 మామూలుగా గుహలుండేది కొండల్లో.
 మరి నగరం మధ్యలో ఈ ‘కేవ్’ ఏంటి?
 ఆ ‘కేవ్’కి "restricted'అంటూ గేట్ ఏంటి?
 ‘సాక్షి’కి మాత్రమే  "unrestricted'ఎంట్రీ దొరకడమేంటి?
 ఎన్నెన్నో నిర్మాణ విశేషాలున్న ఈ ‘కేవ్’ గురించి
 ఓనర్ పూరీ జగన్నాథ్‌నే అడిగేస్తే పోలా..!

 
మీ ఆఫీస్ అదిరింది... మీ టేస్ట్ కనబడుతోంది...
పూరీజగన్నాథ్: థ్యాంక్యూ... ఎన్టీఆర్,  ప్రభాస్, రవితేజ, నితిన్, రామ్‌గోపాల్‌వర్మ, ప్రకాశ్‌రాజ్,  చార్మి, రానా వచ్చారు. వాళ్లకైతే పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఎన్టీఆర్ అయితే అప్పటికప్పుడు బోస్ కంపెనీ వాళ్ళ సింగిల్ టవర్ కాన్సెప్ట్ స్పీకర్ తెప్పించి నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇలాంటి ఆఫీస్‌లో ఇలాంటివే ఉండాలని చెప్పారు. రామూ గారు మా ఆఫీస్ స్టాఫ్‌ను పిలిచి ‘‘మీ ఆఫీస్ ఇంత టేస్ట్‌ఫుల్‌గా ఉంది కదా. మీరు రెగ్యులర్ జీన్స్, షర్ట్స్‌లో రావద్దు. బెర్ముడాలు, టీ షర్ట్స్ వేసుకు రండి’’ అని చెప్పారు. ఆఫీస్ చూడడం కోసం రోజూ చాలామంది వస్తున్నారు. ఇండియాలోనే ఇలాంటి సినిమా ఆఫీస్ లేదని అందరూ అంటున్నారు. సినిమాకి ఫస్ట్‌లుక్ ఇచ్చినట్లుగా, ఈ ఆఫీస్ ఫస్ట్‌లుక్ మీడియాలో ఫస్ట్ మీకే ఇస్తున్నా... అందుకే మిమ్మల్ని ఆహ్వానించా...
 
 అసలు ఇంత భారీ స్థాయిలో, అత్యాధునికంగా ఆఫీసు కట్టాలని ఎందుకనిపించింది?
 పూరీజగన్నాథ్: నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే మా కాలనీలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని పర్సనల్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నా. రాసుకోవడం, బొమ్మలు వేసుకోవడం లాంటివి అక్కడే చేసేవాణ్ణి. మా ఇంట్లో వాళ్లకు ఆ విషయం తెలీదు. ఒకసారి అనుమానమొచ్చి అడిగితే, ఏదో చెప్పి కవర్ చేశా. నాకంటూ పర్సనల్‌గా ఓ స్పేస్ ఉండాలనేది మొదట్నుంచీ నా కోరిక. మామూలుగా అందరికీ హాలీడే అంటే పనిచేయని రోజు. నాకు మాత్రం పనిచేస్తేనే హాలీడే. సో, మనం పనిచేసే ఏరియా హాలీడే మూడ్‌లో ఎగ్జైటింగ్‌గా ఉండాలి. అందుకే ఈ ఆఫీస్. అయినా నేను ఇంట్లో కన్నా ఎక్కువ ఆఫీస్‌లోనే ఉంటాను. అదొక రీజన్.
 
 సినిమా ఎంత స్పీడ్‌గా తీస్తారో ఆఫీస్ కూడా అంత స్పీడ్‌గా కట్టించేసినట్టున్నారు?
 పూరీజగన్నాథ్: (నవ్వుతూ) అవును. కేవలం 8 నెలల్లో ఈ బిల్డింగ్ రెడీ అయిపోయింది. హైదరాబాద్‌లో ఇంత ఫాస్ట్‌గా ఏ బిల్డింగూ రెడీ అయి ఉండదు.
 
 ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత గొప్పగా ఆఫీస్ కట్టుకోవడం ఎలా అనిపిస్తోంది?
 పూరీజగన్నాథ్: నా టైమ్ బావుందంతే!
 
 మధ్యలో మీ టైమ్ బాగోలేనట్టుంది?
 పూరీజగన్నాథ్: నేను నమ్మే కాన్సెప్ట్ ఎప్పుడూ ఒక్కటే... ‘నథింగ్ ఈజ్ పర్మినెంట్’. మంచి అయినా, చెడు అయినా ఏదీ శాశ్వతం కాదు.
 
 అంత పర్మినెంట్ కానప్పుడు ఇంత డబ్బు ఖర్చుపెట్టి, ఆఫీసు కట్టడం అవసరమా?
 పూరీజగన్నాథ్: (నవ్వుతూ) మీరు ఇది బిల్డింగ్ అనుకుంటున్నారా..? కేవ్ అండీ బాబూ.
 
 ఇంతకు ముందు మీ పాత ఆఫీస్ కూడా చాలా క్రియేటివ్‌గా ఉండేది కదా. దాన్నెందుకు తీసేశారు?
 పూరీజగన్నాథ్: అవును... అప్పట్లో ఆ ఆఫీస్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అయితే దాన్ని టెంపరరీగానే కట్టా. ఒక దశలో అప్పుల పాలై ఆ ఆఫీసు అమ్మేశా. ‘బిజినెస్‌మేన్’ సినిమా తర్వాత పుంజుకుని ఈ ఆఫీసు కొని, ఇక్కడున్న పాత బిల్డింగ్ పడగొట్టి నా డ్రీమ్ ఆఫీస్ కట్టుకున్నా. ఇందులోనే నా రెసిడెన్స్ కూడా.
 
 మీ ఆఫీస్ ఎంత బాగుందో, మీ హోమ్ థియేటర్ అంతకన్నా బాగుంది...
 పూరీజగన్నాథ్: నేనెక్కువ గడిపేది హోమ్ థియేటర్‌లోనే. యాపిల్ ఐ ట్యూన్స్ ద్వారా ఏ సినిమా కావాల్సి వస్తే, ఆ సినిమా ఇక్కడ చూడొచ్చు. అంతా శాటిలైట్ టెక్నాలజీ. మన అరచేతిలో వరల్డ్ సినిమా మొత్తం ఉన్నట్టే. ఒక్క సినిమాలు అనేకాదు, పాటలు, డాక్యుమెంటరీలు, టీవీ షోలు... ఇలా అన్నీ చూడొచ్చు. జస్ట్ ఐ ప్యాడ్ ద్వారానే కూర్చున్న చోట నుంచి కదలకుండా ఇవన్నీ ఆపరేట్ చేయొచ్చు. లైట్స్ ఆన్ అండ్ ఆఫ్, ఏసీ ఆపరేటింగ్ కూడా ఐ ప్యాడ్ ద్వారా చేసుకోవచ్చు. సినిమాలు చూడనప్పుడు దీన్ని డ్రాయింగ్ రూమ్‌లా కూడా వాడుకోవచ్చు. కర్టెన్స్ ఓపెన్ చేసుకుంటే, చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా ముచ్చట్లాడుకోవచ్చు. ఒకసారి పైకి చూడండి. పైన సీలింగ్‌కి వాడిన వాల్‌పేపర్‌కు ఓ స్పెషాల్టీ ఉంది. లండన్‌లో ఫేమస్ ప్లే అయిన ‘ఫ్యాంటమ్ ఆఫ్ ది ఓపెరా’ వాల్ పోస్టర్ అది. ఆ నాటకం గొప్పతనం ఏంటంటే - గత యాభై ఏళ్లుగా నిర్విరామంగా ప్రదర్శిస్తూనే ఉన్నా, ఇప్పటికీ అది హౌస్‌ఫుల్లే. ఇక్కడ వాడిన ఆడియో సిస్టమ్స్ కూడా చాలా అత్యాధునికం. హైదరాబాద్‌లో ఈ తరహా సిస్టమ్ ఇదే మొట్టమొదటిదట.
 
 ఈ ఆఫీస్ డిజైనింగ్ ఆలోచన అంతా మీదేనా?
 పూరీజగన్నాథ్: జయకిరణ్ అని హైదరాబాద్‌లో ఫేమస్ ఆర్కిటెక్ట్. నా స్నేహితుల ఇళ్లల్లో ఆయన వర్క్ చూసి, ఈ ప్రాజెక్ట్ అప్పగించా. ఆయనతో గంటలు గంటలు కూర్చొని నా పిచ్చి అంతా చెప్పా. దానికి తగ్గట్టే ఆయన డిజైన్ చేశారు.
 
ఫ్లోరింగ్ అంతా చాలా  కొత్తగా ఉంది!
పూరీజగన్నాథ్: నాకు రెగ్యులర్ ఫ్లోరింగ్ నచ్చదు. ఇలా పాలిపోయినట్టుగా, రస్టిక్‌గా ఉంటేనే ఇష్టం. క్యాలిఫోర్నియా స్లేట్‌ని కొన్ని గోడలకు వాడాం. స్పెయిన్ నుంచి ఆర్డర్ చేసిన ఉడెన్ ఫ్లోర్‌లా అనిపించే టైల్స్ మరికొన్ని చోట్ల వాడాం. అంతా రెడీ అయ్యాక ఫ్లోర్స్‌ను క్లీన్ చేయడానికి కొంతమంది వచ్చారు. ఆ టైమ్‌లో ఒకామె నాతో అన్న మాటలు విని నాకు నవ్వొచ్చింది. ‘‘ఏం సార్... ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. ఫ్లోరింగ్ మాత్రం సెకండ్ హ్యాండ్ కొన్నారేం’’ అందామె. ఆ డిజైనింగ్ అలా ఉంటుందని ఆమెకు తెలియదు కదా.
 
 ఇంతకూ మీ హోమ్ స్టూడియోకు ‘కేవ్’ అనే పేరు ఎందుకు పెట్టినట్టు?
 పూరీజగన్నాథ్: ప్రపంచం ఓ అడవి లాంటిది. అందులో నేనో జంతువును. నేను ఉండడానికి ఓ కేవ్ దొరికిందంతే.
 
 సరే... దీనికి ఎంత బడ్జెట్ అయ్యింది?
 పూరీజగన్నాథ్: ఇప్పుడు అవసరమా! ముందు మంచి కాఫీ తాగండి. మా ఆఫీస్‌లో కాఫీ బార్ కూడా ఉంది. కేపర్చినో, ఎక్స్‌ప్రెసో... ఇలా ఏది కావాల్సి వస్తే అది తాగొచ్చు.
 
 - పులగం చిన్నారాయణ
 
 The Man Behind....
 
 ఆర్కిటెక్ట్‌గా నా కెరీర్ 1998లో మొదలైంది. ఇప్పటివరకూ ఉన్న నా క్లయింట్స్ అందరిలోకెల్లా పూరీగారు డిఫరెంట్. ఫలానాది వాడుతున్నామంటే ‘ఓకే’ అనేసేవారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు.
 
 పూరీ గారితో వర్క్ చేయడం వెరీ ఫన్. నా ఐడియాలను బాగా గౌరవించేవారు. ఆయన బిహేవియర్ ప్యాట్రన్‌ను దృష్టిలో పెట్టుకునే, ఈ ఆఫీస్ డిజైన్ చేశాం. ఆయనకు ప్రకృతి ఇష్టం కాబట్టి, చుట్టూ చెట్లు, మొక్కలు, పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చాం.
 
 ఆయనకు బ్లాక్ అంటే ఇష్టం. ఆందుకే ఈ ఆఫీస్‌లో ఎక్కువ అంశాలు బ్లాక్ కలర్‌లో కనిపిస్తాయి. ఆయన చాలా ఇన్‌ఫార్మల్‌గా ఉంటారు. అందుకే ఆఫీస్‌ను కూడా ఇన్‌ఫార్మల్‌గా డిజైన్ చేశాం.
 
 18,000 చదరపు అడుగుల్లో ఈ ఆఫీస్ కట్టాం. గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్‌కు ఉంచేశాం. ఫస్ట్ ఫ్లోర్ సినిమా ఆఫీస్. సెకండ్ ఫ్లోర్‌లో జగన్‌గారి పర్సనల్ రూమ్, లైబ్రరీ, ఫొటోసెషన్ రూమ్‌తో పాటు రెసిడెన్స్ ఉండేలా డిజైన్ చేశాం.
 
 ఫ్రంట్ ఎలివేషన్‌ను ఐరన్ గ్రిల్స్‌తో లైన్స్‌లా పెట్టడానికి కారణం కొత్తగా, స్టయిలిష్‌గా ఉంటుందనే. దానికి తోడు ఈయన తీసే సినిమాల వల్ల ఆఫీసు మీద అప్పుడప్పుడు రాళ్లు పడుతుంటాయి కదా... (నవ్వేస్తూ).
 
 ఇది యాక్చ్యువల్‌గా గ్లాస్ హౌస్. లైటింగ్ కూడా నేచురల్‌గా ఉంటుంది. పగలు లైట్లు వాడనవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే, లైటింగ్ ఎక్కువ అవుతోందని స్టిక్కరింగ్ చేయాల్సి వచ్చింది.
 
 టై మీద సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సోలార్ ఎనర్జీ వాడుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. ఏసీని కూడా సోలార్ ఎనర్జీతో రన్ చేసుకోవచ్చు.    
 
 - జయకిరణ్, ఆర్కిటెక్ట్
 
 ఆఫీస్ ముందు 11 అడుగుల యూరోపియన్ స్టాచ్యూ...

 
 యూరోపియన్ స్టాచ్యూను రెప్లికా చేసి ఆఫీస్ ముందు పెడుతున్నాం. సుమారు 11 అడుగుల ఎత్తు ఉంటుందా స్టాచ్యూ. అలాగే అమెరికా నుంచి 10 అడుగుల రెక్కలున్న పెద్ద ఫ్యాన్‌లు తెప్పిస్తున్నాం. ఆ కంపెనీ వాళ్లకు మన స్పెసిఫికేషన్స్ నచ్చితేనే ఆర్డర్ ఓకే చేస్తారు. ఆఫీస్‌లో సోఫాలన్నీ దాదాపుగా టచ్ ఆపరేటెడ్. ఆఫీస్‌లో ఇంటర్‌కామ్ ఉంది. అంతా ఇంటర్‌నెట్ ఆపరేటెడ్. ఫారిన్ నుంచి కూడా ఇంటర్‌కామ్‌లో మాట్లాడొచ్చు. ఆఫీస్‌లో ఎక్కడేం జరుగుతోందో... ఐ ప్యాడ్ ద్వారా ప్రపంచం ఏ మూలన ఉన్నా చూడొచ్చు. ఫారిన్ వెళ్లినప్పుడు ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ కొనాలి.
 
 ఫొటోలు: శివ మల్లాల
 

Advertisement
Advertisement