ఆపరేషన్‌ గజిని | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ గజిని

Published Sun, Nov 12 2017 8:01 AM

Donald Trump Calls Kim Jong Un 'Short and Fat' - Sakshi

న్యూయార్క్‌లో కీలకమైన అంతర్జాతీయ సమావేశం ఒకటి జరుగుతుంది. ‘నార్త్‌ కొరియా అండ్‌ తాడోపేడో’ అనే టాపిక్‌ మీద చర్చించడానికి 193 దేశాల నుంచి ప్రతినిధులు ఆ సమావేశానికి హాజరయ్యారు.నాకు గాని తిక్క లేస్తే ఆ ఉత్తర కొరియోడిని  ఉరి తీసి ఉప్పు పాతర వేస్తాను. ఏమనుకుంటున్నాడు?! హోటల్లో ప్లేట్లు  ఎత్తుకుపోయే ఫేసూ...వాడూనూ...’’ పలచటి జుట్టును సవరించుకుంటూ కిమ్‌–జోంగ్‌ను తిడుతున్నాడు ట్రంప్‌. ఇది మీ ఇల్లు కాదు. అంతర్జాతీయ సమావేశం. భాష హుందాగా ఉండాలి. ఉప్పుపాతరేస్తాం, పప్పుపాతరేస్తాం...ఏమిటండీ ఈ లాంగ్వేజ్‌ గలీజుగా నిరసన తెలిపాడు  చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌. చాల్లేవోయ్‌ చెప్పొచ్చావు. వాడు అలా రెచ్చిపోతుంటే  కామ్‌గా ఉండడానికి నేనేమైనా గాజులు తొడుక్కున్నాననుకున్నావా?  పాములు తినే ఫేసు నువ్వూనూ’’ అని పింగ్‌ను విసుక్కున్నాడు ట్రంప్‌.

‘‘గాజులు తొడుక్కున్నామా... అనే మాటను ఉపయోగించడం ద్వారా యావత్‌ మహిళాలోకాన్ని అవమానించావు. సారీ చెప్పకపోతే...మహిళల చేతిలో శిక్ష తప్పదు’’ సీట్లో నుంచి లేచి  హెచ్చరించింది హిల్లరి క్లింటన్‌.శారీ లేదు...రామరాజు పంచె లేదు. వెళ్లవమ్మా వెళ్లూ’’ హిల్లరీని అల్లరి చేశాడు ట్రంప్‌.‘‘ఈ దొంగసచ్చినోడు మొదటి నుంచీ ఇంతే తన పక్కన కూర్చున్న ఆంగ్‌సాన్‌సూకీతో చెబుతూ ఆక్రోశం వెళ్లగక్కింది హిల్లరి.ఐరాస సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరిస్‌ మైక్‌ అందుకొని...గౌరవసభ్యులు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం ఇవ్వాళ  సమావేశమైంది ‘నార్త్‌ కొరియా అండ్‌ తాడోపేడో’ అనే టాపిక్‌ మీద చర్చించడానికి. ఇది మరిచి సిల్లీ విషయాల మీద చీప్‌గా పోట్లాడుకుంటున్నారు అని మనసులోని ఆవేదన వెళ్లగక్కాడు.

ఆ  తరువాత టై సర్దుకుంటూ...మిస్టర్‌ ట్రంప్‌...మీ దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉన్నాయా? వాడి దగ్గరనా? అని అడిగాడు.అప్పుడు ట్రంప్‌ అతని చెవిలో చిన్నగా...వాడి దగ్గరే ఎక్కువ ఉన్నాయి. తెల్లారిలేస్తే వాడికి అదే పని కదా.  రాజు కంటే పిచ్చివాడు  బలవంతుడు. వాడి కంటె నేను బలవంతుడిని. నా కంటే వీడు బలవంతుడు అని చెప్పాడు.ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వార్‌ రాకుండా నేను చూస్తాగా’’ అని ధైర్యం చెప్పాడు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జె ఇన్‌.ఎలా? సంతోషంగా, ఆశ్చర్యంగా, ఆసక్తిగా అడిగాడు ట్రంప్‌ . ఆపరేషన్‌ గజిని చేపడతాం. అంటే ఏమిటో కాదు...కిమ్‌ జోంగ్‌ తాగే పొడవాటి చుట్టల్లో యంఎల్‌ 96.26 బి6.26 మందును దట్టిస్తాం. ఆ తరువాత ఏమవుతుందో చూద్దురుగానీ’’ అన్నాడు సౌత్‌ కొరియా అధ్యక్షుడు.కోవర్ట్‌ల ద్వారా కిమ్‌ జోంగ్‌ తాగే చుట్టల్లో ఆపరేషన్‌ గజిని చుట్టలని చేర్చారు. 

ఒకానొక రోజు ఆ చుట్టల్లో ఒక చుట్ట తాగిన కిమ్‌ జోంగ్‌ తన జ్ఞాపకశక్తిని గంపగుత్తగా పోగొట్టుకున్నాడు. ఈ దెబ్బతో తాను ఒక దేశానికి అధ్యక్షుడిని అనే విషయంగానీ, తాను అమెరికా మీద యుద్ధం చేయాలనుకున్న విషయంగానీ...ఏవీ అతడికి గుర్తులేవు. అసలు తన పేరే తనకు గుర్తు లేదు. ఇట్టి విషయం ప్రపంచానికి తెలిస్తే బాగుండదని జోంగ్‌ను ఒక రహస్యప్రదేశంలో దాచారు భద్రతా సిబ్బంది.ఒక సంవత్సరం తరువాత...‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించగలరు’ అని లవకుశ’ లో కత్తి కాంతారావు పాడినట్లుగా ఆరోజు ఏమైందంటే...కలర్‌ టీవీ ముందు ఖాళీ బుర్రతో కూర్చున్న కిమ్‌ జోంగ్, చేతిలో రిమోట్‌తో రకరకాల చానళ్లను వేగంగా మారుస్తున్నాడు. ఏదో టీవీలో తెలుగు సినిమా  పాట  వస్తుంది. ఆసక్తిగా ఆ పాటపై నిలిచాయి జోంగ్‌ చూపులు.

‘మిల మిల మెరిసే తారక నువ్వేలే ధడేల్‌ మని  దూసుకుపోయే మిస్సైల్‌ నేనేలే అని గెంతుతూ పాడుతున్నాడు హీరో. మిస్సైల్‌ అనే పదం వినగానే కిమ్‌జోంగ్‌ బ్రెయిన్‌లో చిన్నగా వైబ్రేషన్‌ మొదలైంది.మళ్లీ రిమోట్‌ నొక్కాడు. మరో ఛానల్లో  ఏదో తెలుగు సినిమా క్లైమాక్స్‌ సీన్‌ వస్తోంది. హీరో విలన్‌తో ఇలా అంటున్నాడు...రేయ్‌...నా పేరు రాజన్‌బాబు కాదురా. హైడ్రోజన్‌ బాంబు. నాతో పెట్టుకుంటే పీస్‌ పీస్‌ అయిపోతావు హైడ్రోజన్‌ బాంబు’ అనే మాట వినబడగానే కిమ్‌ జోంగ్‌ బ్రెయిన్‌లో వైబ్రేషన్‌ తారస్థాయికి చేరింది. అప్పుడే నిద్ర నుంచి లేచినట్లు...రి.... యోంగ్‌.... హో’ అని గట్టిగా అరిచాడు.రక్షణ మంత్రి రింగ్‌ యోంగ్‌ ఒక్క ఉదుటున  పరుగెత్తుకు వచ్చాడు. 

‘సార్‌...మీరు మళ్లీ మామూలు మనిషి అయ్యారు అని ఆ రింగ్‌ అనబోయాడో లేదో...మన మిస్సైల్‌ టెస్ట్‌లు, హైడ్రోజన్‌ బాంబు టెస్ట్‌లు ఎక్కడి వరకు వచ్చాయి? రేపు వార్‌ చేయవచ్చా? ముందు ఆ ట్రంప్‌గాడికి ఫోన్‌ కలుపు’’ అని ఆదేశించాడు జోంగ్‌.నంబర్‌ కలిపి ఫోన్‌ చేతికి ఇచ్చాడు రక్షణమంత్రి. ఏమప్పా ట్రంపు. బాగున్నావా? బాగుండక ఛస్తావా...విషయమేమిటంటే...అన్నాడో లేదో...అవతలి నుంచి ప్రసుత్తం ఈ నంబర్‌తో  ఈ  ఫోనే కాదు అమెరికాలో  ఏ ఫోనూ  పని చేయడం లేదు. వీలైతే క్షమించండి’ అని గొంతు మార్చి బదులిచ్చాడు ట్రంప్‌.
యాకుబ్‌ పాషా

Advertisement
Advertisement