టూకీగా ప్రపంచ చరిత్ర - 36 | Sakshi
Sakshi News home page

టూకీగా ప్రపంచ చరిత్ర - 36

Published Mon, Feb 16 2015 10:56 PM

టూకీగా ప్రపంచ చరిత్ర  - 36

కులాసాలు

అదనపు పాలతో పోషించిన కుక్కలు ఎంత రబ్బసంగా బలుస్తాయో గమనించిన తరువాత, వాటిని తమ పిల్లలకు ప్రయత్నించాలనే ఉబలాటం ఏ తల్లికో కలిగుండాలి. పాలను ఆహారంగా తీసుకోవడం అలా మొదలయ్యుండాలి. కుండల్లో నిలువచేసిన పాలు వూట మారితే తోడుకోవడం తేలిగ్గానే తెలిసొచ్చే సమాచారం. అలా పేరుకున్న ‘పెరుగు’ది అదోరకమైన వింత రుచి. పిండితో కలిపితే మధురంగా కూడా ఉంటుంది. బెల్లంతో కలిపి దంచిన పేల పిండి (వేయించిన గింజలతో కొట్టిన పిండి) ఇప్పటికీ ఉత్తరభారతదేశంలో ‘సత్తు’గా ప్రతి ఇంట అపురూపంగా దాచుకుంటారు. కొత్తరాతియుగంలో బెల్లం లేదు. తీపికోసం వాళ్ళకు అందుబాటైన ఏకైక పదార్థం తేనె. పేల పిండిని పెరుగుతో కలిపి, తేనెతో రంగరించిన ముద్దలు ‘కరంభం’ పేరుతో అప్పటి కాలానికి ప్రీతిపాత్రమైన పిండివంట.

సంచార జీవితంలో ఉన్నప్పుడు మనిషికి సొంత ఆస్తి లేదు. మహా ఉంటే చేతి అలవాటును బట్టి ఆయుధాల వరకు సొంతవిగా ఉండొచ్చు. గవ్వల హారాలు సొంతవిగా ఉండొచ్చు. పశువుల మందలు మాత్రం ఉమ్మడి ఆస్తి. వేట మీద హక్కు కూడా అందరికీ సమానమే. వేటాడిన జంతువును శిబిరానికి మోసుకురాగానే, రాతి ఉలితో చర్మం ఒలిచి, రాతి కత్తులతో ముక్కలు నరికి, నెగడు చుట్టూ చేరిన కుటుంబసభ్యులందరికి తగుపాళ్ళతో పంచడం, ఎవరి వాటాను వాళ్ళు కాల్చుకుంటూ ఆరగించడం నిత్యం జరగవలసిన యజ్ఞం. కాలేయం, ఉలవకాయలవంటి సున్నితమైన మాంసం అప్పుడప్పుడే పళ్లొస్తున్న పిల్లలకు ఆహారం. ఇండో-ఇరానియన్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ‘సత్రయాగం’ అన్నారు. ఇదే వ్యవస్థకు సామాజికశాస్త్రం ‘ఆదిమ కమ్యూనిజ’మని నామకరణం చేసింది.
 ఆ తరువాత ప్రవేశించిన వ్యవసాయం కూడా మొదట్లో ఉమ్మడి కార్యక్రమమే. దుక్కి దున్నేందుకు ఉపయోగించిన నాగలి వంటి సాధనం సంపూర్ణంగా కొయ్యది కావడంతో వాళ్ళ ఇతర వస్తువులతోపాటు అది మనకు దొరకలేదు. తొలిరోజుల్లో నాగలితో కాకుండా, బలమైన కర్రలతో నేలను పైపైన కుళ్ళగించేవారేమో చెప్పలేం.

ఎందుకంటే, పశువులను కాడిగా కట్టి దున్నేందుకు ఉపయోగించేంత లోతైన సేద్యం అప్పట్లో లేదు. విత్తనం గాలికి కొట్టుకుపోకుండా నేలను గరుకు చేయడమే తప్ప, లోతైన దుక్కితో కలిగే ప్రయోజనాలు ఇంకా వాళ్ళకు తెలిసిరాలేదు. అందువల్ల, ఆరోజుల్లో తేలికైన చేతి సేద్యం స్త్రీలద్వారా జరిగుండొచ్చు. కారణం ఎవరైనా, వ్యవసాయం మూలంగా వాతావరణ పరిస్థితులను బహుజాగ్రత్తగా గమనించే అవసరం మనిషికి ఏర్పడింది. ఆరుబయట నెగళ్ళ దగ్గర పడుకుని, ఆకాశంలో నక్షత్రాలను ఆహ్లాదం కోసం వీక్షిస్తూ, వాటి గమనాన్ని ఇదివరకే పరిశీలించిన మనిషికి, ఇప్పుడు వాతావరణంలో మార్పులకూ నక్షత్రాల స్థానాలకూ మధ్యనున్న సంబంధం తెలిసొచ్చింది. దరిమిలా రుతువులను వేరువేరుగా గుర్తించడం వీలుపడింది.

స్వేచ్ఛ వరకు స్త్రీల హక్కులు ఆ తరువాత చాలాకాలం దాకా కొనసాగినా, హోదాలో పురుషుని ప్రాముఖ్యత పెరిగేందుకు కూడా పశుపోషణే దోహదం చేసింది. మందలను వృద్ధిచేసే వనరుల కోసం అన్వేషించే మనిషి, పెంటి కడుపులో బిడ్డగా ఎదుగుతున్నది పోతు వీర్యమేననే అభిప్రాయం ఏర్పరుచుకున్నాడు. వ్యవసాయంతో కలిగిన అనుభవాన్ని దానికి జోడించి, స్త్రీది కేవలం క్షేత్రస్థానంగా, బీజం పురుషస్థానంగా నిర్ధారించి, ఏ బీజం నాటితే అదేజాతి మొక్కలు మొలకెత్తే రీతిలో, పురుషబీజానికి ఏర్పడే సంతానం పురుషునికి ఆనవాలుగా తీర్మానించాడు. అండాశయం ఉత్పత్తిజేసే గుడ్డును గురించి తమకే తెలియనందున, ఈ కొత్త సిద్ధాంతానికి తలవొగ్గక స్త్రీలకు తప్పిందిగాదు. దాంతో ‘వంశం’, ‘వారసత్వం’ అనే విధానాలు సమాజంలో సర్వజనామోదంగా ప్రవేశించాయి.

పశుపోషణకు ఉపక్రమించని క్రోమాన్యాన్ ప్రాథమిక దశలో అనేకచోట్ల ‘మాతృస్వామ్య’ వ్యవస్థ నడిచిందని కొందరు శాస్త్రజ్ఞుల వాదన. ఆ వాదనకు ప్రధానమైన ఆధారం భారతదేశంలో ఆచరించే శక్తిపూజలూ, పురాణాలు. శక్తికి నరబలి ఇచ్చే ప్రస్తావన మహాభారతంలో కూడా కనిపిస్తున్నందున, కాళి ఆరాధన అత్యంత పురాతనమైనదే కాక, ఆసేతు హిమాచలం భారతదేశాన్ని మానసికంగా అనుసంధించే సంస్కృతిలో భాగంగా దాన్ని చెప్పుకోవచ్చు. పురాణాల ఆధారంగా కాళికాదేవి ఏ ప్రాంతంలో నివసించేదో తేల్చుకోవడం సాధ్యపడదు. ఆమె సంహరించిన ‘మహిషాసుర’ అనే రాక్షసుని పేరుకు శబ్దసాన్నిహిత్యం కలిగిన ‘మైసూరు’ పట్టణం ఉండేది దక్షిణ భారతదేశంలో! ఆ నగరం కాళికాదేవికి సంబంధించిన ‘దశరా’ ఉత్సవాలకు ప్రసిద్ధి కూడా!

రచన: ఎం.వి.రమణారెడ్డి
 
 
 

Advertisement
Advertisement