పీచు తింటే పీస్ ఉంటుంది

26 Aug, 2015 23:26 IST|Sakshi
పీచు తింటే పీస్ ఉంటుంది

మన డైట్‌లో పీచు పదార్థాలు ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. కొబ్బరి పీచు తీసుకుని గిన్నెల్లో జిడ్డు తోమేసినట్టు... పీచు పదార్థం కడుపు అనే గిన్నెని శుభ్రం చేసేస్తుంది. ఫన్నీ థింగ్ ఏంటంటే... పీచు పదార్థాల్లో పోషక విలువలు తక్కువ,
 పీచు ఎక్కువ ఉన్నా... శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి, అనారోగ్యాల నుంచి కాపాడటానికి... చాలా విలువలున్నాయి. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చెయ్యడానికి, డయాబెటిస్‌ని దూరంగా ఉంచడానికి బరువు తగ్గించడానికి... ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అంతేకాదు... మలబద్ధకం వల్ల వచ్చే బుద్ధి బద్ధకాన్నీ ఫ్లష్ చేసేస్తుంది. అందుకే... పీచు తినండి. పీస్ ఆఫ్ మైండ్ తెచ్చుకోండి.
 
కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్... ఇలాంటి పోషకాలన్నీ శరీరానికి తప్పనిసరిగా తగిన మోతాదుల్లో అవసరమే. ఆహారంలో ఇవన్నీ ఉన్నా, పీచుపదార్థాలు తగినన్ని లేకుంటే మాత్రం ఆరోగ్యం వికటించి గుండె పీచు... పీచుమనడం ఖాయం. ఇంతకీ ఈ పీచుపదార్థాలేమిటి? ఇవేమైనా శక్తినిస్తాయా? కండబలాన్నిస్తాయా? గుండెబలాన్నిస్తాయా? ఎందుకు వీటిని తీసుకోవాలి... అనుకుంటున్నారా? నిజమే! ఇవి తక్షణమే శక్తినివ్వవు. కండబలాన్నీ, గుండెబలాన్నీ ఇవ్వవు. ఇతర పదార్థాల్లా కనీసం జీర్ణమైనా కావు. అయినా, మన ఆరోగ్యం సజావుగా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. పీచుపదార్థాలే లేకుంటే, మనం తిన్న ఆహారంలో జీర్ణమైపోయినవి జీర్ణమైపోగా, మిగిలిన వ్యర్థాలు బయటకుపోయే వీలే ఉండదు. కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపాలంటే పీచుపదార్థాలను తీసుకోక తప్పదు.

కరిగేవీ... కరగనివీ...
ఆహారంలోని పీచుపదార్థాలను నాన్-స్టార్చ్ పాలీశాచరైడ్స్ (ఎన్‌ఎస్‌పీ) అంటారు. ఇవి శాకాహార పదార్థాల్లో ఉంటాయి. వీటిలో సెల్యులోజ్, సెమీసెల్యులోజ్, పెక్టిన్స్, లిగ్నిన్స్, గమ్స్, మ్యూకిలేజెస్, బీటా-గ్లుకేన్స్ వంటి రకరకాల పీచుపదార్థాలు ఉంటాయి. అయితే, వీటిని స్థూలంగా నీటిలో కరిగే పీచుపదార్థాలు, నీటిలో కరగని పీచుపదార్థాలుగా విభజిస్తారు. నీటిలో కరిగే పీచుపదార్థాలు నీటిలో కలిసిన తర్వాత జెల్‌లాంటి మెత్తని పదార్థంగా మారుతాయి. ఇవి రక్తపోటును అదుపు చేయడంలోను, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలోను ఉపయోగపడతాయి. ఓట్స్, బీన్స్, వేరుశెనగలు, ఆపిల్స్, పుల్లని పండ్లు, క్యారట్లు, బార్లీ వంటి వాటిలో కరిగే పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
 
ఇక నీటిలో కరగని పీచుపదార్థాలు మన జీర్ణకోశంలోని వ్యర్థాల కదలికకు దోహదపడతాయి. ఇవి మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి. మలబద్ధకంతో బాధపడేవారికి నీటిలో కరగని పీచుపదార్థాలు చాలా ఉపయోగపడతాయి. పొట్టుతో కూడిన ధాన్యాలు, గింజలు, బీన్స్, క్యాలీఫ్లవర్, బంగాళదుంపలు వంటి కూరగాయల్లో నీటిలో కరగని పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్, బీన్స్ వంటి శాకాహార పదార్థాల్లో రెండురకాల పీచుపదార్థాలూ ఉంటాయి. శరీరానికి పీచుపదార్థాలు పుష్కలంగా అందాలంటే రకరకాల శాకాహార పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

పులిసి మెలిసి...
ఆహారంలో కలిసిమెలిసి పేగుల్లో ప్రయాణించే కొన్నిరకాల పీచుపదార్థాలు జీర్ణకోశంలోని బ్యాక్టీరియా ప్రభావంతో పులుస్తాయి. ఇలాంటి పులిసే పీచుపదార్థాలు ఎక్కువగా పళ్లు, కూరగాయలు, గింజలు, ఓట్స్ వంటి పదార్థాల్లో ఉంటాయి. పులిసే పీచుపదార్థాలు జీర్ణకోశంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను కాపాడతాయి. ఇవి ఆరోగ్యకరమైన కొలెస్టరాల్ స్థాయిని కాపాడటంతో పాటు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం నిలకడగా ఉండేలా దోహదపడతాయి. వీటికి భిన్నంగా గోధుమలు, ఓట్స్, బార్లీ వంటి పొట్టుధాన్యాల్లో ఉండే పీచుపదార్థాలు పెద్దగా పులవవు. అయితే, ఇవి మలబద్ధకాన్ని నివారించడానికి గణనీయంగా దోహదపడతాయి.
 
రెసిస్టెంట్ స్టార్చ్
 రెసిస్టెంట్ స్టార్చ్... ఇది దాదాపు పిండిపదార్థం. దీనిని పూర్తిస్థాయి పీచుపదార్థంగా పరిగణించరు. అయినా, ఇది కూడా పీచుపదార్థం తరహాలోనే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు దోహదపడుతుంది. పొట్టుధాన్యాలు, గింజలు, అరటికాయలు, బంగాళదుంపలు, పప్పులలో రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటుంది. రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణకోశంలో ఉండే బ్యాక్టీరియా ప్రభావం వల్ల ఫ్యాటీయాసిడ్స్‌గా మారుతుంది. ఈ ఫ్యాటీయాసిడ్స్ రక్తంలో కలిసి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.
 
 ఇదీ మేలు
 పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా కాపాడుకోవచ్చు. కొలోన్ కేన్సర్ వంటివి రాకుండా చూసుకోవచ్చు. పులిసేరకానికి చెందిన పీచుపదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. వీటివల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నీటిలో కరగని పీచుపదార్థాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని అదుపు చేస్తాయి. ఫలితంగా టైప్-2 డయాబెటిస్ సోకే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తాయి. పీచుపదార్థాలను పుష్కలంగా తీసుకుంటే, త్వరగా కడుపు నిండినట్లవుతుంది. చాలాసేపటి వరకు ఆకలి వేయదు. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే, శరీరంలో అనవసరపు కొవ్వుచేరే అవకాశాలు దాదాపు ఉండవు.
 
పీచు ప్రణాళిక

చాలాకాలంగా పీచుపదార్థాలు దాదాపు లేని ఆహారం తినేవాళ్లు అకస్మాత్తుగా ఒకేసారి పుష్కలంగా పీచుపదార్థాలతో కూడిన ఆహారం తినడం ప్రారంభిస్తే, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందువల్ల అలాంటి వాళ్లు తమ ఆహారంలో పీచుపదార్థాల మోతాదును పెంచుకుంటూ పోవాలి. రోజుకు ఐదుగ్రాముల పీచుపదార్థాలు అదనంగా అందేలా, ప్రతిరోజూ పెంచుకుంటూ పోతే, వారం రోజుల్లోగా తగినన్ని పీచుపదార్థాలు ఆహారం ద్వారా తీసుకోవడం అలవాటవుతుంది. పీచు పదార్థాలను సప్లిమెంట్ల ద్వారా తీసుకునే బదులు సహజసిద్ధమైన ఆహార పదార్థాల ద్వారానే తీసుకోవడం మంచిది. సగటున రోజుకు పాతిక గ్రాముల పీచుపదార్థాలు అందేలా చూసుకోవాలంటే, ఇలాంటి ఆహార ప్రణాళికను అనుసరిస్తే చాలు...

ఉదయం    చిరుధాన్యాలతో కూడిన అల్పాహారం, ఏదైనా ఒక పండు    5 గ్రాములు
మధ్యాహ్నం    మల్టీగ్రెయిన్ చపాతీ, బ్రౌన్‌రైస్,ఆకుకూరలు, కూరగాయలతో    5 గ్రాములు
సాయంత్రం    మొలకెత్తిన గింజలు, ఉడికించిన రాజ్మా, శనగలు వంటివి, వెజిటబుల్ సలాడ్    5 గ్రాములు
రాత్రి    మల్టీగ్రెయిన్ చపాతీ, ఆకుకూరలు, కూరగాయలతో...    5 గ్రాములు
ఏవైనా పళ్ల ముక్కలు ఒక కప్పు లేదా ఫ్రూట్‌సలాడ్    5 గ్రాములు
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల్లో 7 గ్రాముల వరకు పీచు పదార్థాలు ఉంటాయి. రోజువారీ ఆహారంలో పీచుపదార్థాలు తగ్గినట్లయితే, అవిసెగింజలను తీసుకోవచ్చు. వీటిని నేరుగా లేదా మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు.
 
పీచు ఫ్యాక్ట్స్
మాంసాహారంతో పోల్చితే శాకాహారంలో పీచు ఎక్కువ.
కొన్ని ప్రత్యేక చికిత్సలలో తప్పించి, పీచును ఆహారం ద్వారా మాత్రమే పొందాలి.
ఆరోగ్యరక్షణకు తోడ్పడే గ్జెనో బయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు, సైటో ఈస్ట్రోజన్లు పీచునుండి లభిస్తాయి.
 
 
ఫైబర్ టిప్స్

భోజనం చేశాక ఏదైనా ఒక పండు తినండి.
తొక్కతోపాటు తినగలిగే పండు ఏదైనా దానిని తొక్కతో పాటే తినండి.
ఆహారంలో కూరగాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.
ఒకే రకం ఆకుకూరలు, కాయగూరలు కాకుండా వేర్వేరు రకాలు, పండ్లు తీసుకోండి.
హోల్‌మీల్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోండి.
 
 - సాక్షి ఫ్యామిలీ
 ఇన్‌పుట్స్: సుజాతా స్టీఫెన్, సీనియర్ న్యూట్రిషనిస్ట్,
 మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పురుగులపై వలపు వల!

బడుగు రైతుకు ఆదాయ భద్రత!

ఆడపిల్ల చేతిని పిడికిలిగా మార్చాలి

సీన్లో ‘పడ్డారు’

‘మతి’పోతోంది

తనయుడు: హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ అమ్మా!

ఊపిరి తీసుకోనివ్వండి

డ్యాన్స్‌ రూమ్‌

రారండోయ్‌

నవమి నాటి వెన్నెల నేను

విప్లవం తర్వాత

అక్కమహాదేవి వచనములు

గ్రేట్‌ రైటర్‌.. డాంటే

పుట్టింటికొచ్చి...

మంచివాళ్లు చేయలేని న్యాయం

పురుషులలో సంతాన లేమి సాఫల్యానికి మార్గాలు

నాన్నా! నేనున్నాను

ఈ భవనానికి విద్యుత్తు తీగలుండవు!

అవమానపడాల్సింది అమ్మకాదు

ఆయుష్షు పెంచే ఔషధం సక్సెస్‌!

అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే!

విడాకులు డిప్రెషన్‌..మళ్లీ పెళ్లి...డిప్రెషన్‌..

తడబడింది.. నిలబడింది...

అలా అమ్మ అయ్యాను

బంగాళదుంప నీటితో కురుల నిగారింపు...

స్వచ్ఛాగ్రహం

అమ్మలా ఉండకూడదు

అదిగో.. ఆకాశంలో సగం

ఆకాశానికి ఎదిగిన గిరి

వీటితో అకాల మరణాలకు చెక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా: చిరంజీవి

ట్రోల్స్‌ నాకు కొత్తేమీ కాదు: సమంత

కష్టాల్లో శర్వానంద్‌ సినిమాలు

మనసును తాకే ‘మల్లేశం’

ఒక్క సెట్‌ కూడా వేయకుండానే..!

‘మన్మథుడు 2’ ఫ్రీమేకా..?