రిపోర్ట్ ప్రవర్ ఫుల్ | Sakshi
Sakshi News home page

రిపోర్ట్ ప్రవర్ ఫుల్

Published Sun, Jan 10 2016 10:54 PM

రిపోర్ట్ ప్రవర్ ఫుల్

ఇప్పుడంటే మగవాళ్లని ఆడిపోసుకుంటున్నారు కానీ, అప్పట్లో అంటే పురాణకాలంలో అందమైన మగవాళ్లకు ఆడవాళ్ల నుంచి ముప్పు ఉండేదట! ప్రవరాఖ్యుడినే తీసుకుంటే... వరూధిని అనే అందగత్తె మనవాణ్ణి ఎన్ని తిప్పలు పెట్టింది... ఎంత కవ్వించింది, ఎంత లవ్వించింది..? అసలే పెళ్లయిన వాణ్ణి అని మొత్తుకుంటున్నా వినకుండా వచ్చి మీదపడిపోయిందట. అయినా సరే, ప్రవరుడు ఆవిడ అందచందాలకు, హావభావ వచోవిన్యాసాలకూ మీసమెత్తు కూడా చలించక ఛీ పొమ్మన్నాడట. అప్పుడు ఆమెగారు అంటే వరూధిని అప్పట్లో అత్యంత సౌందర్యవంతులుగా పేరు పొందిన నలకూబరుడు, జయంతుడు, వసంతుడు... అనే ముగ్గురు మగానుభావులను తలచుకుని, వారెవ్వరూ కూడా చక్కదనంలో ఇతగాడి కాలిగోరు పాటి చెయ్యరే! అని వాపోయిందట.

సూర్యుణ్ని సానబట్టి పొడితీసి ఆ బంగారు అడుసులో ఈ రజనుకలిపి అమృతం చేర్చి ఆ బ్రహ్మ ఈతణ్ణి సృష్టించాడా అన్నంత అందంగా ఉన్నాడే... అసలింత అందమెలా సాధ్యమీ యువకునిలో!’’ అని తలపోసిందట. ఆమె ఎంతగా రెచ్చగొట్టినా మనవాడు మాత్రం ఖాతరు చెయ్యకుండా, కాదు పొమ్మన్నాట్ట. చేసేదేమీ లేక అతణ్ణే తలచుకుని బాధపడుతుంటే, అదను చూసి మాయాప్రవరుడు ఆమె తాపం తీర్చాడట. మరొకావిడ... రంభ కూడా ఇలానే చేసిందట.. అర్జునుణ్ణి చూసి మనసు పారేసుకుని వచ్చి మీదపడితే, మనవాడు ఎంతో వినమ్రంగా, ‘నువ్వు నాకు అమ్మమ్మ వరుస’ అన్నాడట. దాంతో ఆమెకు రోషమొచ్చి, ‘ఆడదాని మనసు గ్రహించలేని నువ్వు నపుంసకుడివైపోతావులే’ అని శపించదట. అయితే అర్జునుడు ఆమెను అరటిచెట్టై పొమ్మని ప్రతిశాపమిచ్చి, తనకిచ్చిన ఆ శాపాన్ని అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో బృహన్నలగా ఉంటూ వరంగా మార్చుకున్నాడట. రామలక్ష్మణులను చూసి, శూర్పణఖ అనే రాకాసి ఇలానే మోహించిందా, ఆ తర్వాత భీముడిపై హిడింబ అనే మాయావి మనసు పారేసుకుంది.   చెప్పుకుంటూ పోతే జాబితా కాస్తా కొండవీటి చాంతాడంత అవుతుందికానీ వారిలో ప్రవరుడే పవర్ ఫుల్!
 - బాచి
 
 

Advertisement
Advertisement