హ్యాపెనింగ్ హాలీవుడ్... నాన్‌స్టాప్ హంగామా! | Sakshi
Sakshi News home page

హ్యాపెనింగ్ హాలీవుడ్... నాన్‌స్టాప్ హంగామా!

Published Mon, Sep 7 2015 11:38 PM

హ్యాపెనింగ్ హాలీవుడ్...  నాన్‌స్టాప్ హంగామా!

ఇంగ్లిష్ స్కోప్
 
ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలలు మనకు పండగ సీజన్. వినాయక చవితి, దసరా, దీపావళి పండగల సీజన్‌లో బోలెడన్ని కొత్త తెలుగు సినిమాలు తెరపై ప్రేక్షకులకు పండగ చేయనున్నాయి. విశేషం ఏమిటంటే, ఈ సీజన్ అమెరికన్లకు ‘ఫాల్’. వాళ్ళ పరిభాషలో సమ్మర్‌కీ, వింటర్‌కీ మధ్యలో ఉండే సీజన్. ఆకులు రాలే ఈ కాలంలో మొదటి రెండు నెలల్లో ఈసారి దాదాపు 30కి పైగా సినిమాలే వస్తున్నాయి. దాదాపుగా ప్రతి రెండు రోజులకీ ఒక కొత్త సినిమా అన్నమాట నిజజీవిత ఘటనలు, ప్రసిద్ధుల జీవితకథలు, మహిళల హక్కుల కథలు - ఇలా హాలీవుడ్ తెర నిండా వైవిధ్యం రాజ్యమేలనుంది. అలాంటి వాటిలో కొన్నిటి గురించి...
 
 స్లీపింగ్ విత్ అదర్ పీపుల్ (రిలీజ్ - సెప్టెంబర్ 11)
కాలేజీ రోజుల్లోనే ఒకరికొకరు శారీరకంగా దగ్గరవుతారు - ఒక అబ్బాయి, అమ్మాయి. జీవితంలో దూరమైన వాళ్ళిద్దరూ మళ్ళీ పన్నెండేళ్ళ తరువాత కలుసుకుంటారు. అప్పటికే వేర్వేరు వ్యక్తులతో డేటింగ్‌లో ఉన్న వాళ్ళిద్దరూ అమలిన స్నేహితులుగా ఉండాలనుకుంటారు. కానీ, వాళ్ళిద్దరూ దాదాపుగా భార్యాభర్తలంత దగ్గరవుతారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ ‘రొమాంటిక్ - కామెడీ’ చిత్రం మీద అమెరికాలో మంచి అంచనాలున్నాయి.
 తారాగణం: జేసన్ సుదీకిస్, అలిసన్ బ్రీ, అమందా పీట్ రచన - దర్శకత్వం: లెస్లీ హెడ్‌ల్యాండ్
 
 పాన్ శాక్రిఫైస్(రిలీజ్ - సెప్టెంబర్ 16)
 ఇంటర్నేషనల్ సూపర్‌స్టార్‌గా ఎదిగిన అమెరికాకు చెందిన బాల చెస్ మేధావి బాబీ ఫిషర్‌కూ, సోవియట్ చాంపియన్ బోరిస్ స్పాస్కీకీ మధ్య 1970లలో జరిగిన చెస్ పోరాటం ఈ చిత్రం. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో రెండు దేశాల మధ్య ఒక రాజకీయ ఎత్తుగడగా సాగిన ఈ చెస్ పోటీని తెరపై పునఃసృష్టిస్తున్నారు. తారాగణం: టోబీ మేగ్విర్, పీటర్ సార్స్‌గార్డ్, దర్శకత్వం: ఎడ్వర్డ్ జ్విక్
 
 ఎబౌట్ రే (సెప్టెంబర్ 18)
 అమ్మాయి నుంచి అబ్బాయిగా మారే క్రమంలో ‘రే’ అనే టీనేజర్ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ ఈ సినిమా. న్యూయార్క్ నేపథ్యంలో సాగే ఈ కథలో రే తల్లితండ్రుల వేదన, ఈ మార్పిడిని సహించలేని బామ్మ గారి బాధ కనిపిస్తాయి.
 తారాగణం: ఎలే ఫ్యానింగ్, నోమీ వాట్స్, టాటే డోనోవన్, దర్శకత్వం: గ్యాబీ డెల్లాల్
 
 బ్లాక్ మాస్ (సెప్టెంబర్ 18)

 ఇది ఒక నిజజీవిత కథ. ఒక మాఫియా కుటుంబాన్ని అంతం చేయడానికి ఒక గ్యాంగ్‌స్టర్, ఎఫ్.బి.ఐతో కలసి చేసే ప్రయత్నం ఈ సినిమా. ప్రముఖ తారలున్న క్రైమ్ కథ ఇది. తారాగణం: జోయల్ ఎడ్గర్టన్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, దర్శకత్వం: స్కాట్ కూపర్
 
 ఎవరెస్ట్ (సెప్టెంబర్ 18)
 ఐ-మ్యాక్స్ వెర్షన్‌లో చిత్రీకరించిన ఈ 3డి చిత్రం ఉత్కంఠగా సాగుతుంది. 1996లో ఎవరెస్ట్ శిఖరారోహణ ప్రయత్నంలో ఎనిమిదిమంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన ఆధారంగా తీసిన సాహసోపేతమైన ఈ సెల్యులాయిడ్ ప్రయత్నం గురించి అందరూ ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. తారాగణం: జోష్ బ్రోలిన్, జాన్ హాక్స్, జేసన్ క్లార్క్, దర్శకత్వం : బల్టాసార్ కొర్మాకూర్

 ది మార్టియన్ (అక్టోబర్ 2)
 రిడ్లే స్కాట్ రూపొందిస్తున్న సైన్-ఫిక్షన్ సినిమా ఇది. అంగారక గ్రహానికి చేసిన అంతరిక్ష ప్రయోగం అతలాకుతలమవుతుంది. వ్యోమగామి మార్క్ వాట్నీ చనిపోయాడని అందరూ వదిలేస్తారు. బతికే ఉన్న అతను ప్రాణం నిలుపుకొంటూ, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ను ఎలా సంప్రతించాడు, అతణ్ణి వెనక్కి తీసుకురావడానికి జరిగిన సాహసం - ఈ చిత్ర కథ.
 తారాగణం: మ్యాట్ డామన్, జెస్సికా చాస్టయిన్, కేట్ మారా, దర్శకత్వం: రిడ్లే స్కాట్
 
స్టీవ్ జాబ్స్ (అక్టోబర్ 9)
ప్రపంచ గతిని మార్చేసిన ‘యాపిల్’ సంస్థ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ జీవితం ఆధారంగా తీస్తున్న బయోపిక్. స్టీవ్ జాబ్స్ మరణించిన అయిదేళ్ళ తరువాత తెరకెక్కిన ఆయన కథ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాల్టర్ ఐజాక్సన్ విస్తృతంగా రాసిన భారీ జీవితకథా పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ద్వారా మన దేశంలోనూ సుపరిచితుడైన ప్రముఖ దర్శకుడు డ్యానీ బోయల్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం మరో విశేషం. తారాగణం: మైఖేల్ ఫాస్‌బెండర్, దర్శకత్వం: డ్యానీ బోయల్
 
 బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్ (అక్టోబర్ 16)
 రష్యా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం రోజుల్లో1960లలో జరిగిన సంఘటనల ఆధారంగా తీస్తున్న బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఇది. అమెరికాకు చెందిన గూఢచారి విమానం పైలట్‌ను రష్యా నుంచి విడిపించడానికి చర్చలు జరిపే పని చేపట్టిన లాయర్‌గా టామ్ హాంక్స్ నటిస్తున్నారు. స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 4వ సినిమా.
 తారాగణం: టామ్ హాంక్స్, ఎమీ రయాన్, అలన్ అల్డా, మార్క్ రైలాన్స్, దర్శకత్వం: స్టీవెన్ స్పీల్‌బర్గ్
 
ఇవే కాకుండా, ‘మేజ్ రన్నర్ - ది స్కార్చ్ ట్రయల్స్’ (సెప్టెం. 18), రాబర్డ్ డీనీరో 70 ఏళ్ళ శిక్షణార్థిగా ఒక యంగ్ ఆడ బాస్ నటిస్తున్న ‘ది ఇన్‌టర్న్’ (సెప్టెం. 25), 1969 నాటి సంఘటనల ఆధారంగా ‘గే’ల హక్కుల ఉద్యమ ఆరంభంపై తీసిన ‘స్టోన్‌వాల్’ (సెప్టెం. 25), నోబెల్ శాంతి బహుమతి గెల్చిన పాకిస్తాన్ అమ్మాయి మలాలా యూసఫ్జాయ్‌పై తీసిన డాక్యుమెంటరీ ‘హి నేమ్డ్ మి మలాలా’ (అక్టోబర్ 2), దయ్యం కంటికి కనిపించే పాత్ర చుట్టూ తిరిగే హార్రర్ సినిమా ‘క్రిమ్‌సన్ పీక్’ (అక్టో. 16), పాకశాస్త్ర ప్రవీణుడిగా బ్రాడ్లే కూపర్ నటించిన ‘బర్న్ట్’ (అక్టో. 23), హార్రర్ ప్రియులు మెచ్చే ‘ప్యారా నార్మల్ యాక్టివిటీ - ది ఘోస్ట్ డైమన్షన్’ (అక్టో. 23), శాండ్రా బుల్లక్ నటిస్తున్న అమెరికన్ రాజకీయ కథా చిత్రం ‘అవర్ బ్రాండ్ ఈజ్ క్రైసిస్’ (అక్టో. 30) లాంటివన్నీ ఈ రెండు నెలల్లో రానున్నాయి. ఆసక్తికరమైన కథాంశాలు, విభిన్నమైన నేపథ్యాలున్న ఈ హాలీవుడ్ సినిమాల్లో కొన్ని ఈ పండగ సీజన్‌లో మన హాళ్ళలోనూ సందడి చేస్తాయి. సో... బీ రెడీ!    
 

Advertisement
Advertisement