ఇనుములాంటి ఒంటి కోసం మినుములు | Sakshi
Sakshi News home page

ఇనుములాంటి ఒంటి కోసం మినుములు

Published Mon, Aug 28 2017 12:22 AM

ఇనుములాంటి ఒంటి కోసం మినుములు

మినుములు తింటే ఇనుమంత బలం అన్నది మన వాడుక. దీనిలోని పోషకాలు మంచి వ్యాధి నిరోధక శక్తిని సమకూరుస్తాయి కాబట్టి... వ్యాధి కారకాలకు మన ఒళ్లు ఇనుములాగే తోస్తుంది. దాంతో ఎన్నో రకాల జబ్బుల నుంచి నివారణ సాధ్యమవుతుంది. వంద గ్రాముల మినుముల్లో 18 గ్రాముల పీచు (ఫైబర్‌) ఉంటుంది. ఒక గ్రాము పొటాషియమ్, రెండు గ్రాముల కొవ్వులతో పాటు విటమిన్‌ సి, విటమిన్‌ బి–కాంప్లెక్స్‌లోని బి1, బి3 వంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే క్యాల్షియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, ఐరన్‌ కూడా ఎక్కువే. మినుములతో ఒనగూరే ప్రయోజనాల్లో కొన్ని...

మినుముల్లో ప్రోటీన్‌ పాళ్లు ఎక్కువ. ప్రోటీన్లు కండరాల రిపేర్లకు ఉపయోగపడతాయి. పైగా మినుముల్లో వాపు, మంటను తగ్గించే యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ గుణం ఉంది. కాబట్టి గాయాలైన వారికి అవి త్వరగా తగ్గడానికి  మినుములు మంచి ఆహారం.
ఇక మినుముల్లో దాదాపు 72 శాతం పీచు ఉండటం వల్ల మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేగాక మలబద్దకం, ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలను స్వాభావికంగానే తొలగిస్తాయి. అంతేకాదు... జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డయేరియా, డిసెంట్రీ వంటి సమస్యలు ఉన్న వారు కూడా మందులకు బదులు మినుముతో చేసిన వంటకాలను వాడవచ్చునని ఆహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
గుండె జబ్బులను నివారించే అద్భుతమైన గుణం మినుములకు ఉంది. ఇందుకు మినుముల్లో పుష్కలంగా ఉన్న పొటాషియం, పీచుపదార్థాలే కారణం. అవి రక్తంలోకి వెలువడే చక్కెర, కొలెస్ట్రాల్‌ పాళ్లను గణనీయంగా తగ్గిస్తాయి. పొటాషియమ్‌ వల్ల రక్తపోటు తగ్గుతుంది.
కీళ్లనొప్పులనుంచి ఉపశమనం కలిగించే గుణం కూడా మినుములకు ఉంది.
స్వాభావికమైన పీచు ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్‌ సమస ఉన్నవారికి  మినుములు మంచి ఆహారం.

Advertisement
Advertisement