కడుపులో మంట, అజీర్ణం, పుల్లటితేన్పులు... తగ్గేదెలా? | Sakshi
Sakshi News home page

కడుపులో మంట, అజీర్ణం, పుల్లటితేన్పులు... తగ్గేదెలా?

Published Mon, Jan 6 2014 10:46 PM

కడుపులో మంట, అజీర్ణం, పుల్లటితేన్పులు... తగ్గేదెలా?

నా వయసు 42. గత రెండేళ్లుగా కడుపులో మంట, పుల్లని తేన్పులు, అజీర్ణం, అప్పుడప్పుడు కడుపుబ్బరం, గ్యాస్ లక్షణాలతో బాధపడుతున్నాను. హైపర్ అసిడిటీ అని చెప్పి డాక్టర్లు సూచించిన ఎన్నో మందులు వాడాను. కానీ ఫలితం కనపడలేదు. దీని సంపూర్ణ నివారణకు ఆయుర్వేద మందులు తెలియజేయప్రార్థన.
 - కె. భానుప్రకాశ్, ఆదిలాబాద్

 
 మీకు ఉన్న సమస్యను ఆయుర్వేదంలో ‘ఆమ్లపిత్తం’ వ్యాధిగా చెబుతారు. నియమ నిబంధనలకు భిన్నంగా ఆహారవిహారాలు జరిగితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీనికి తోడు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురిచేసే వృత్తివ్యాపారాలు కూడా మరొక ముఖ్యకారణం. ఈ కింది సూచనలు పాటించండి. రెండుమూడు నెలల్లో మీకు గణనీయంగా సత్ఫలితం లభిస్తుంది.
 
 ఆహారం : అల్పాహారమైనా, భోజనమైనా ప్రతిరోజూ నియమిత వేళల్లోనే స్వీకరించాలి. పులుపు, ఉప్పు, కారం పూర్తిగా మానేయండి. తీపిపదార్థాలు, నూనె పదార్థాలు బాగా తగ్గించండి. ప్రతి రెండు గంటలకు ఒక లీటరు నీళ్లు తాగండి. అల్పాహారంలో ఇడ్లీ మంచిది. మొలకలు, గ్రీన్‌సలాడ్స్ కూడా తీసుకోండి. భోజనంలో మసాలాలు లేని శాకాహారం మంచిది. ఆవుపాలు, ఆవుమజ్జిగ వాడండి. బొంబాయిరవ్వ, బార్లీ, రాగులు మొదలైనవాటితో చేసిన జావ అప్పుడప్పుడూ తాగాలి. బయటి తినుబండారాలు, బేకరీ వస్తువులు, జంక్ ఫుడ్స్, శీతలపానీయాల వంటివి అస్సలు పనికిరావు. అరటిపండ్లు మంచిది.
 
 విహారం : నియమతి వేళల్లో రాత్రిపూట నిద్ర అత్యంతావశ్యకం. జాగరణ చేయవద్దు. ధూమపాన, మద్యపానాల వంటి అలవాట్లు వ్యాధిని మరింత ఉద్ధృతం చేస్తాయి. దుఃఖం, చింత, శోకం, భయం వంటి ఉద్వేగాలను దూరంచేసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. వ్యాయామం వల్ల... ముఖ్యంగా ప్రాణాయామం వల్ల మానసిక ఒత్తిడి దూరమై మీ సమస్య కుదుటపడుతుంది.
 
 మందులు
 లఘుసూతశేఖరరస (మాత్రలు) :ఉదయం 2, రాత్రి 2
 అవిపత్తికర చూర్ణం : మూడుపూటలా ఒక్కొక్క చెంచా (నీటితో)
 శూక్తిన్ (మాత్రలు ) : ఉదయం 1, రాత్రి 1
 
 గమనిక... అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతర వ్యాధులుంటే, వాటిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ప్రతిరోజూ పరగడుపున ఒక అరటిపండు తినడం ఈ సమస్యకు మంచిది.
 
 మా పాప వయసు 5 నెలలు. గత పది రోజులుగా పాపకి మలమార్గం చుట్టూ ఉన్న చర్మం ఎర్రగా కమిలిపోయినట్లు, ఒరిసినట్లుగా ఉంది. తాకితే పాప ఏడుస్తోంది. పరిష్కారం సూచించండి.
 - ఎమ్. నిర్మలమ్మ, తణుకు

 
 శిశువు విసర్జించిన మలం ఎక్కువసేపు ఆ ప్రాంతానికి తగులుతూ ఉంటే, అక్కడి చర్మం ఆ విధంగా తయారవుతుంది. దీనిని ఆయుర్వేదంలో ‘గుదకుట్ట లేదా అహిపూతనా’ అనే పేర్లతో వివరించారు. మలమూత్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే అలవాటు మంచిది. శిశువు పక్కబట్టలను ఎప్పుడూ పొడిగా, పరిశుభ్రంగా ఉంచాలి. గోరువెచ్చని నీళ్లలో కొంచెం పసుపువేసి ఆ ప్రాంతాన్ని శుభ్రపరచి, అనంతరం ‘మహామరిచాదితైల’ అనే మందును దూదితో ముంచి, ఒరిసిన చర్మం మీద నాజూగ్గా రాయాలి. ఇది బయటి పూతకు మాత్రమే. ‘అరవిందాసవ’ అనే ద్రావకాన్ని అర చెంచా ఉదయం, అరచెంచా రాత్రి తేనెతో శిశువుకు తాగించండి. దీనివల్ల చంటిపిల్లలకు అరుగుదల, బలం చక్కగా ప్రాప్తిస్తాయి. ఎన్నో వ్యాధులకు నివారకంగా కూడా పనిచేస్తుంది.
 
 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
 సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
 హుమాయూన్ నగర్, హైదరాబాద్

 

Advertisement
Advertisement