Sakshi News home page

వాన పడతాది జాన... ఎట్ట బొమ్మందునో...

Published Sat, Jan 17 2015 12:34 AM

వాన పడతాది జాన... ఎట్ట బొమ్మందునో... - Sakshi

జ్ఞాపకం
 
‘‘నేను హనుమకొండకు వచ్చిన తర్వాత వెలువడిన ‘సృజన’ సంచిక జూలై 1973. అప్పటికే ఎన్.కె, జనసేన, కానూరి వెంకటేశ్వరరావుల పాటలు విని, వాటిలో కవిత్వం కొంతైనా అనుభవించి ఉన్నానుగాని ఆ సంచికలోనే మొదటిసారిగా వి.బి. గద్దర్ పాటలు చూశాను. అప్పటికే లయ ఉన్న కవిత్వం, గొంతెత్తి చదువుకునే కవిత్వం రుచి దొరికి ఉన్న నాకు ఆ సంచికలో అచ్చయిన నాలుగు గద్దర్ పాటలు కొత్త కవిత్వాన్ని పరిచయం చేశాయి.
 ‘నీవు నిజం దెలుసుకోవరో కూలన్న
 నీవు నడుం గట్టి నడవాలి రైతన్నా’...
‘రిక్షాదొక్కేరహీమన్న రాళ్లుగొట్టే రామన్న
డ్రైవర్ మల్లన్న హమాలి కొమ్రన్న’...
 ‘వాన పడతాది జాన ఎట్టబొమ్మందునో’
 ‘కల్లుముంతో మాయమ్మ నిన్ను మరువజాలనే’... అనే పాటలు చదువుతుంటే ఒళ్లు పులకించింది. ఇంత మామూలు మాటలతో ఇంతగా ఉద్రేకపరిచే కవిత్వం ఉంటుందా అని ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత మూడు నెలలకు ఆ పాటలు గద్దర్ నోటి వెంట విన్నప్పుడు కలిగిన ఉత్తేజం నిజంగా చెప్పడం అసాధ్యం. నిజానికి గద్దర్ పాటలు అచ్చుకెక్కడం అదే మొదటిసారి. అందుకే అవి అచ్చవుతున్నప్పుడు సృజన సంపాదకీయ వ్యాఖ్య కూడా రాసింది. ‘ఈ సంచికలోనూ రాగల వొకటి రెండు సంచికల్లోనూ ఎక్కువ సంఖ్యలో వేయనున్న వి.బి.గద్దర్ పాటలు త్వరలో పుస్తకరూపంలో కూడా వస్తాయి. హైదరాబాద్ జిల్లా మాండలికాలు, అక్కడి ప్రజాజీవితం మాత్రమే కాదు- ఈ పాటలన్నీ ఆ చుట్టుపట్ల పల్లెల్లో ప్రజలు పాడుకునే బాణీల్లో వచ్చినవే. కొన్ని పాటల మకుటాలు చరణాలు కూడా ప్రజలు పడుకునే పాటల నుంచే తీసుకుని విప్లవభావాలకు అనుగుణంగా మలచినవి.

ఈనాడివి హైదరాబాద్ చుట్టూ దాదాపు ఇరవై గ్రామాల్లో విరివిగా పాడుకోబడుతున్నాయి’ అని సృజన రాసింది. అప్పటికి ఎంత అర్థమయ్యాయో చెప్పలేనుగాని ఆ తర్వాత నాలుగు నెలలు నిజంగా జీవితం మారిపోయిన రోజులు. ఆ తర్వాత వెలువడిన ఆగస్ట్ 1973 సంచికలో ‘వీడేనమ్మో డబ్బున్న బాడుకావు’, ‘పోదామురో జనసేనలో కలిసి’, సెప్టెంబర్ 1973 సంచికలో ‘రెక్కబొక్క వొయ్యకుండ సుక్కసెమ్ట వొడ్వకుండ బొర్ర బాగా బెంచావురో దొరోడో’, ‘పిల్లో నేనెల్లిపోతా’, ‘నిజం తెలుసుకోవరో కూలన్న’... గద్దర్ పాటల ప్రభంజనం.
 
- ఎన్. వేణుగోపాల్
ఫేస్‌బుక్ గ్రూప్ ‘కవి సంగమం’లో ‘కవిత్వంతో ములాకాత్’ పేరిట వస్తున్న వ్యాస పరంపర నుంచి
 

Advertisement

What’s your opinion

Advertisement