Sakshi News home page

ఈ వరుస పాటిస్తే ప్రపంచాన్ని జయించినట్టే...

Published Thu, Mar 6 2014 10:53 PM

ఈ వరుస పాటిస్తే ప్రపంచాన్ని జయించినట్టే...

ఇస్కాన్ దేవాలయంలో అడుగుపెట్టగానే భక్తులందరూ హరేకృష్ణ మంత్రాన్ని జపిస్తూ కనిపిస్తారు. ఎవరు దేవాలయంలో అడుగుపెట్టినా ఇస్కాన్ సేవకులు ఓ చిన్నకార్డు, ఓ జపమాల ఇస్తారు. రోజుకి 108సార్లు దానిపై ఉండే మంత్రాన్ని జపిస్తే ఆ శ్రీకృష్ణుడితో మీకు అనుబంధం ఏర్పడుతుందని చెబుతారు.  అసలు ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? ఉంటే ఆయనతో అనుబంధం ఎలా కుదురుతుంది? ఆ అనుబంధంవల్ల మనకు వచ్చేదేమిటి? మానవుని మస్తిష్కంలో మెదిలే ఈ ప్రశ్నలకు ఇస్కాన్ దక్షిణభారత అధ్యక్షులుగా పనిసత్యగౌరచంద్రదాస్ జవాబులివి...
 
మనిషి తన బాహ్యప్రపంచాన్ని తనకు నచ్చినట్టు తీర్చిదిద్దుకున్నాడు కానీ, తన ఆంతరిక ప్రపంచాన్ని మాత్రం తన చేతుల్లోకి తెచ్చుకోలేపోతున్నాడు. అవసరమైతే భూమిని దాటి మరో గ్రహంలో ఆవాసం ఏర్పాటుచేసుకోగల మనిషి తన ఆత్మను కనుగొనే ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నాడు. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సులువైన మార్గంలో ప్రయాణించాలి.
 
మనసుని తమ నియంత్రణలో పెట్టుకునే దారి తెలియక రకరకాల ఇబ్బందులు పడుతున్న ఆధునిక మానవునికి గీతా సారాంశం ఓ దివ్యఔషధం అనడంలో సందేహం లేదు. అదెలాగంటారా...ముందుగా మన స్వరూపమేమిటో తెలుసుకోవాలి. మనలో ఎన్ని విభాగాలున్నాయో గుర్తించి ఓ వరుస (ప్రొటోకాల్)  ప్రకారం వాటికి మర్యాదలు చేస్తే చాలు... ఆ పరమాత్మతో మీకు అనుబంధం ఏర్పడుతుంది. ఇంతకీ ఏమిటా ప్రొటోకాల్ అంటారా...
 
శరీరం... ఇంద్రియాలు... మనస్సు... అహంకారం... బుద్ధి... పరమాత్మ... ఆత్మ. ఇదీ... మనిషి పాటించాల్సిన వరుస. ఇక్కడ మనిషి బాహ్య స్వరూపుడే కాదు ఆత్మ స్వరూపుడు కూడా. ఆత్మ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా...ముందుగా పరమాత్మ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ పరమాత్ముడితో చర్చించాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. కానీ, మనమేం చేస్తున్నాం... మనకన్నా(ఆత్మ)మూడు మెట్లు కిందనున్న మనస్సుతో ముచ్చటించి, అది చెప్పినదానికల్లా తలాడించి తోచినట్టు ప్రవర్తిస్తుంటాం.

అది తప్పంటుంది గీత. ఎవరైనా మనల్ని తిట్టగానే మనకంటే ముందుగా మనస్సు బాధపడిపోతుంది. గతంలో ఆ వ్యక్తితో ఉన్న వైరం తాలూకు విషయాలన్నీ గుర్తుచేసి గందరగోళం సృష్టించేస్తుంది. ఇంద్రియాలకు, శరీరానికి, బుద్ధికి మనసే బాస్ కాబట్టి అది చెప్పిన పనిని చెప్పినట్టు వెంటనే చేసేస్తాయి. జరగాల్సిన నష్టం జరిగిపోయాక... పరమాత్మ గుర్తుకొస్తాడు. ‘అయ్యో...ఆ సమయంలో నేను అలా చేసి ఉండాల్సి కాద’ంటూ...’ భగవంతుడి ముందు తలొంచుకుంటాం.
 
ఆ పనేదో...నిర్ణయాన్ని మనసుకి అప్పగించకముందు చేస్తే మనకంటే బలవంతుడు ఈ ప్రపంచంలో ఉండడు. ఏ సంస్థలోనైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే యజమానితో ఆలోచిస్తారు కాని గుమస్తాలతో, ఇంకా దిగువస్థాయి వారితో చర్చించరు కదా! అలాగే ఇక్కడ కూడా మన పైవాడితో ఆలోచిస్తే ప్రయోజనం ఉంటుంది కాని మనకన్నా మూడు స్థానాల కిందనున్న మనసు అభిప్రాయం అడిగితే అదొచ్చి మన నెత్తిన కూర్చుని తోచిన సలహాలిచ్చి మనల్ని అథముల్ని చేస్తుంది.
 
అర్జునుడంతటివాడే...
 
నీళ్లలో చేపకన్ను చూసి బాణం విసరగలిగాడంటే అర్జునుడెంత తెలివైనవాడో అర్థమవుతుంది. అంతటివాడే...ఒక సందర్భంలో కృష్ణుడిని ‘నన్ను తీసికెళ్లి ఏ అడవిలోనైనా వదిలిపెట్టు, నా మనసుకి ప్రశాంతత ప్రసాదించు’ అంటూ వేడుకున్నాడు. అంటే...మానవుడు ఎన్ని తెలివితేటలు, ఎంతటి పరిజ్ఞానం సంపాదించినా మనస్సును నియంత్రించుకోలేనపుడు దేహాన్ని వీడి పారిపోడానికి కూడా వెనకాడడు. పాతికేళ్లు నిండని యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే...దానికి అర్థం వారికి జీవితం భారమైపోయిందని కాదు...జీవించడం ఎలాగో అర్థం కాలేదని. అందుకే దుఃఖమొచ్చినా, సంతోషమొచ్చినా ముందుగా దాన్ని మీపైనున్న పరమాత్మ (భగవంతుడు)తో పంచుకోవాలి.

ఆ తర్వాత మన  (ఆత్మ) కిందున్న అహంకారాన్ని తగ్గించుకుని బుద్ధిగా ఆలోచించి మనసుతో పనులు చేస్తే మనిషికి ఎలాంటి సమస్యలూ రావు.  కొన్ని సందర్భాల్లో నిర్ణయాలను పరమాత్మకు వదిలిపెట్టాలి. ఆ ఒక్క నిర్ణయంతో మీ మనసుకి సగం భారం తగ్గుతుంది.  అహంకారాన్ని చంపుకుంటే చాలు పరిష్కారాలు వాటంతటవే వస్తాయి  చిన్న చిన్నవాటికి బుద్ధిని ఉపయోగిస్తే సరిపోతుంది  మనసున్నది వినడానికే కాని...చెప్పడానికి కాదని మరిచిపోకూడదు.  

ఇంద్రియాలకు, శరీరానికి తగినంత పని ఉండాలి. నామజపం వల్ల మన ఇంద్రియాలకు, శరీరానికి తగిన వ్యాయామంతో పాటు మనస్సుకి విశ్రాంతి దొరుకుతుంది. ఆలోచనలేమీ లేకుండా దేవుణ్ణి తలుచుకుంటూ పది నిమిషాలు నిర్మలంగాగడిపితే చాలు... మీరు రోజంతా ప్రశాంతంగా ఉండవచ్చు!  

- భువనేశ్వరి
 
 ఇస్కాన్ గురించి: ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్‌నెస్(ఇస్కాన్)ని 1966లో శ్రీల ప్రభుపాదదాస్ అమెరికాలో స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 108 ఇస్కాన్ దేవాలయాలున్నాయి. వీటిలో హరినామ స్మరణతో పాటు గీతాసారాంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం భక్తులకు, హరేకృష్ణా ఫౌండేషన్ సమావేశాలకు హాజరైన ప్రజలకు ఉపదేశాలు చేస్తుంటారు. సామాన్యులకు అర్థమయ్యేలా గీతాబోధ చేస్తారు. అంతేకాదు... ఇస్కాన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవాకార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తున్నారు. మన రాష్ర్టంలో పేదవిద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టే ‘అక్షయ పాత్ర’, పేదరోగులకు ఉచితంగా అన్నంపెట్టే ‘భోజనామృతం’ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి.
 
 కృష్ణకృపా సాగరంలో...

 శ్రీమాన్ సత్యగౌరచంద్రదాస్...మద్రాస్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న సమయంలో ఇస్కాన్ గురించి తెలిసింది.  మొదట హరినామ జపం, ఆ తర్వాత గీతాపఠనం చేశాక... ఆ ఆనందాన్ని నిరంతరం అనుభవించడం కోసం ఇస్కాన్‌లో సభ్యుడిగా చేరారు. అప్పటి నుంచి ఇస్కాన్‌లో తన సేవలను పెంచుకుంటూ పోయారు. ప్రస్తుతం ఇస్కాన్ దక్షిణ భారతదేశ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement