దైవవాణి అవతరణా పరంపర!

2 Jul, 2016 23:29 IST|Sakshi
దైవవాణి అవతరణా పరంపర!

ప్రవక్త జీవితం

ముహమ్మద్ (స) తలపెకైత్తి చూశారు. దైవదూత జిబ్రీల్ భూమ్యాకాశాల మధ్య శూన్యంలో ఆసనంలో కూర్చుని ఉన్నాడు.

 ఆ దృశ్యాన్ని చూసిన ముహమ్మద్ (స) మనసు దైవంపట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. దేవా! నువ్వు మహా కరుణగలవాడవు. ఈ దాసుని పట్ల నీ ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అనిపించింది మనసుకు. దూతను చూడగానే ముచ్చెమటలు పోశాయి. శరీరం కంపించసాగింది. మొదటిసారి హిరా గుహలో కూడా ఆయన నిలువెల్లా వణికిపోయారు. గాలిలో ఆకులు ఊగినట్లు. కాని అప్పటి వణుకుకు, ఇప్పటి వణుకుకు, అప్పటి భయానికి, ఇప్పటి భయానికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పటి స్థితి అత్యంత భయానకమైనది. ఇప్పటి స్థితి ఆనందంతో కూడుకున్నది. ఇందులో ఆత్మసంతృప్తి, ఆత్మసంతోషం ఉన్నాయి. అదేస్థితిలో ఆయనగారు ఇంటికి వచ్చేశారు. వచ్చీరాగానే ‘ఏమైనా కప్పు.. ఏమైనా కప్పు’ అన్నారు. వెంటనే బీబీఖదీజా ఓ వస్త్రం తెచ్చి కప్పారు. అంతలో అదే దూత దైవవాణితో అక్కడ ప్రత్యక్షమయ్యాడు.

 వస్త్రం కప్పుకుని పడుకున్నవాడా! లే, లేచి (ప్రజలను) హెచ్చరించు. నీ ప్రభువు ఘనతను చాటిచెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. మాలిన్యానికి దూరంగా ఉండు. ఎక్కువ పొందాలనే కాంక్షతో ఉపకారం చేయకు. నీ ప్రభువుకొరకు సహనం వహించు. (అల్ ముద్దస్సిర్ 1-7)

 దైవవాణి అవతరణతో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. గుండెమంట చల్లారింది. మేధస్సుకు ప్రశాంతత చేకూరింది. మనసుకు స్థిమితం, నిలకడ ప్రాప్తమైంది.

 ఇక బీబీ ఖదీజా విషయమైతే చెప్పనే అక్కరలేదు. ఆమె ఆనందానికి అవధులే లేవు. ముఖవర్ఛస్సు దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మనసంతా సంతోషంతో విరబూసిన పూదోట అయిపోయింది. ఎందుకంటే ఆమె నిరీక్షణ ఫలించింది. కోరిక ఈడేరింది. దైవవాణి అవతరించింది.

 ఇక తరువాత దైవవాణి అవతరణా పరంపర కొనసాగుతూనే ఉంది. దైవసందేశం వస్తూనే ఉంది. కాని దైవ నిర్ణయమేమిటోగాని, అకస్మాత్తుగా మళ్ళీ దైవవాణి అవతరణ ఆగిపోయింది. సందేశప్రచారపరంపర ప్రారంభం కాగానే తిరస్కారుల నుండి వ్యతిరేకత కూడా మొదలైంది. వ్యతిరేకించడానికి పెద్దపెద్ద కారణాలేమీ అవసరం లేదు. చిన్నసాకు చాలు. దైవవాణి ఆగిపోవడం నిజంగా పెద్దవిషయమే. ఇక తిరస్కారులు ఊరుకుంటారా! వారు దీన్నొక ఆయుధంగా ఉపయోగించుకున్నారు.

 ‘అబ్బో, ఈయనగారు దైవప్రవక్త అట. నాలుగు రోజులపాటు ఆకాశవాణితో ముచ్చట్లు నడిచాయి. జిబ్రీల్ రాకపోకలూ సాగాయి. అంతలోనే అంతా మాయం. మాటాముచ్చట అంతా బంద్. సోదరా ముహమ్మద్! నీ ప్రభువు నీపై ఆగ్రహం చెందాడేమో చూడు. అందుకే ముఖం చాటేశాడు’ అంటూ తిరస్కారులు వ్యంగ్యబాణాలు సంధించడం మొదలుపెట్టారు.

 వహీ ఆగిపోవడమనేది నిజంగా చాలా బాధాకర విషయమే, దానికంటే ఎక్కువ గోరుచుట్టుపై రోకటిపోటులా ఈ వ్యతిరేకుల వ్యంగ్యబాణాలు మనసును ఇంకాస్త బాధిస్తున్నాయి. ముహమ్మద్ (స) చాలా అశాంతికి గురయ్యారు. కాని ఎక్కువ రోజులు గడవకముందే హ.జిబ్రీల్ (అ) మళ్ళీ వచ్చేశారు. - ముహమ్మద్  ఉస్మాన్‌ఖాన్  (మిగతా వచ్చేవారం)

మరిన్ని వార్తలు