Sakshi News home page

షీ...

Published Sat, Aug 15 2015 11:35 PM

షీ... - Sakshi

మెట్రో కథలు
నగరం అంతటి మీదా హీ అని రాసి ఉందా అని అనిపించింది.
రోడ్ల మీదా వీధుల మీదా ఎవరూ లేని మలుపుల్లో మొండి గోడల మీదా...
దూరంగా ఎవడో కారు ఆపాడు. ఫుల్ హ్యాండ్స్ ఇన్ చేసుకుని షూ వేసుకొని ఉన్నాడు. డ్రైవింగ్ సీట్లో నుంచి దిగి కారును ఆసరా చేసుకొని ఆవతలి పక్కకు వెళ్లి టక్ సరి చేసుకుంటూ అక్కడే నిలబడి... ఓహ్... ఏమి విలాసం.
 
పరిగెత్తుకుని వెళ్లి అడగాలనిపించింది. బాబ్బాబూ.. కాస్త కారును అలాగే అడ్డం పెట్రా... నేను కూడా కానిస్తాను... ఊహూ. ఎలా అడగడం? అలా అడుగుతారా ఎవరైనా? అడిగినా చేస్తారా?
పొత్తికడుపు ఉబ్బిపోయి ఉంది. పెళ్లయిన మొదటిరాత్రి పాలు కాకుండా చెంబెడు నీళ్లూ గటగటా తాగేస్తే మనిషివా ఒంటెవా అన్నాడు నవ్వుతూ. ఆ తర్వాత ఎప్పుడు గమనించాడో ఏం పాడో నీ పొత్తికడుపు పెద్దది అన్నాడు. సిగ్గేసింది. అమ్మ ఎప్పుడూ గ్లాసుతో నీళ్లిచ్చేది కాదు. దానికి చాలవురా.... చెంబుతో ఇవ్వండి అని అన్నయ్యనో తమ్ముణ్ణో కేకేసేది. నీళ్లు ఇంత ఇష్టంగా తాగే పిల్లను చూడలేదమ్మా అని ఇరుగూ పొరుగూ అనేవారు. ఇంట్లో బావి ఉండేది. నీళ్లు తియ్యగా ఉండేవి. కొబ్బరి చెట్లు ఉండేవి. తాగేన్ని నీళ్లు ఇచ్చేవి. ఎవరింటికెళ్లినా చల్లకేం కొదవా? చూసుకొని చూసుకొని తాగింది లేదు. సిటీకొ చ్చాకే.
కొత్తల్లో షాపింగ్‌కు బయల్దేరదీస్తూ బాత్‌రూమ్‌కు వెళ్లిరా అన్నాడు.
ఎందుకు?
బయట కుదర్దు. రెండు మూడు గంటలు తిరుగుతాం కదా.
ఇదేం సమస్యో అర్థమయ్యేది కాదు. చిన్నప్పుడు వస్తే స్కూల్ నుంచి ఇల్లు ఎంత దూరమని? క్లాస్‌లో నుంచి లేచి పరిగెత్తుకుని వెళ్లి రావడానికి నిమిషం పట్టేది కాదు. కాలేజీ కొంచెం దూరమే. కాని మధ్యలో అర్జెంటైతే అమమ్మా... పెదమ్మా... పిన్నీ అని ఎవరింట్లోనైనా దూరడానికి ఏం భయం? అయ్యో.. మా తల్లే అని ఎవరైనా సరే దారి చూపించేవారు. ఇక్కడ ఎలా? దూరగలమా ఎవరి ఇంట్లో అయినా? అంత నమ్మగలమా?
చేతిలో కేక్ ఉంది. బుద్ధి తక్కువయ్యి ఇంత దూరం వచ్చి ఆర్డర్ ఇచ్చింది. సాయంత్రం బుజ్జిగాడి పార్టీ. అపార్ట్‌మెంట్‌లో ఫ్రెండ్సందరినీ పిలుస్తానమ్మా అంటే దగ్గర్లో ఉన్న బేకరీ నుంచి ఏం చెబుతాంలే అని ఇక్కడి దాకా వచ్చింది. గంట నిలబెట్టాడు. ఏసి ఉందిగాని వాష్‌రూమ్ లేదట. నీళ్లు తాగి రావడం తప్పయ్యింది. ఈ ఏసికి ఉబ్బరం ఇంకా పెరిగిపోయింది.
ఆటో... హారన్ మోగించాడు.
నువ్వెళ్రా బాబూ... పంపించేసింది.
ముప్పై నిమిషాలు పడుతుంది ట్రాఫిక్‌లో ఇల్లు చేరేసరికి. కుదుపులకు కాన్పులే అయిపోతాయి. అది ఆగుతుందా.
రోడ్డుకు ఆ వైపు రెస్టారెంట్ కనిపిస్తూ ఉంది. కచ్చితంగా వాష్‌రూమ్ ఉంటుంది. వెళితే? చూసింది. దాటడానికి వీల్లేకుండా డివైడర్ పొడవునా ఫెన్సింగ్ ఉంది. ఎంతదూరం ఉందో. యూ టర్న్ దాకా వెళ్లి మళ్లీ అంతా నడుచుకుంటూ వచ్చి చేరుకోవాలి. అడుగు వేయడం కష్టంగా ఉందే. ఎలా? పెదాలు బిగపడుతూ నిలుచుంది. ముప్పై రెండేళ్లున్న ఒక స్త్రీ.. ఎనిమిదేళ్ల పిల్లాడి తల్లి.. చేతిలో కేక్ పట్టుకుని, దిక్కులు చూస్తూ, కళ్ల నీళ్ల పర్యంతం అయి నిలబడి ఉంటే ఎందుకు నిలబడి ఉంది అని అడగడానికి లేదు. ఎందుకు నిలబడి ఉందో చెప్పడానికీ లేదు.
పోనీ ఎలాగోలా రెస్టారెంట్ చేరుకోగలిగితే? దానికీ భయం వేసింది. ఒకసారి ఇలాగే అర్జెంటయ్యి దూరి వాష్ రూమ్ నుంచి బయటకు వస్తుంటే మేనేజర్ తను మగాడినని ఎదురుగా ఉన్నది ఒకింటి ఆడకూతురని కూడా పట్టించుకోకుండా చెడామడా మాటలనేశాడు. రెస్టారెంట్‌కు వచ్చినవాళ్లే వాడాలట. దారిన పోయేవాళ్ల కోసం కాదట. వాటర్ స్కేర్సిటీ వల్ల టాయిలెట్‌ల నిర్వహణ చచ్చేచావుగా ఉందట. ఇంకెప్పుడూ ఈ పని చేయకండి అన్నాడు.
దగ్గరలో ఏవైనా పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా అని చూసింది.
అవెక్కడుంటాయి?
అంతలోనే నవ్వు వచ్చింది. ఉంటే మాత్రం వాడగలమా?
ఒకసారిలాగే రెండ్రూపాయలిచ్చి లోపలికి దూరి అదురుతున్న గుండెలతో క్షణంలోనే బయటకు వచ్చేసింది. లోపలంతా బూతు బొమ్మలు. అంటే మగాళ్లు వచ్చి పోతున్నారా? ఎక్కణ్ణుంచి వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడుగాని చూస్తున్నారా? కాళ్లు వణికిపోయాయి. మా అంగాలు మాకే చూపించి ఇదేం పైశాచిక ఆనందంరా గాడిదల్లారా...
పైకి చూసింది. ఎండ మండిపోతోంది. సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. అదే మబ్బు పట్టి చల్లగా ఉంటే తన పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉండేది.
ఏం చేయాలి?
అడుగు కదపడం కష్టంగా ఉంది.
ఒకసారి ఫ్రెండ్ చెప్పింది. తనసలు నీళ్లే తాగదట. తాగి బయటకెళితే ఈ సమస్య ఉంటుందని తాగడం తగ్గించి తగ్గించి అసలు నీళ్లు తాగడమే మర్చిపోయిందట. ఇప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతోంది. ఇంకో ఫ్రెండ్ చెప్పింది. ఇలాంటి టైమ్‌లో మరీ అర్జెంట్ అయితే దాని నుంచి దృష్టి మళ్లించడానికి ఏవేవో ఊహించుకోవాలట. మొగుడితో మైమరపులో ఉన్నట్టు అనుకోవాలట. అప్పుడు తీవ్రత తగ్గుతుందట. ఈ ఎండలో ఈ ట్రాఫిక్‌లో ఈ రోడ్డు మీద మొగుడితో ఏం ఊహించుకోవాలి? లేదంటే మడమకు కాస్త పైన మాటిమాటికీ గీరుకోవాలట. అప్పుడైనా ధ్యాస మళ్లుతుందట. ఇంకా నయం. నడి బజారులో చీర పైకి జరిపి... ఏం ఖర్మ ఇది.
ఉబ్బరం ఇంకా పెరిగిపోయింది.
ఒక ఆలోచన వచ్చింది. ఒన్నాట్ ఎయిట్ నొక్కితే ఆంబులెన్స్ వస్తుంది. ఇంకేదో నొక్కితే మొబైల్ టాయిలెట్ వస్తే? అది అచ్చంగా ఆడవాళ్ల కోసమే అయితే? అందులో పని చేసేవాళ్లంతా ఆడవాళ్లే అయితే? అలాంటివి ఒక వంద కొని సిటీలో తిప్పుతూ ఉంటే? ఎవరికి చెప్పాలి ఇది...
ఆలోచన ముందుకు సాగలేదు.
అంచు తెగడానికి సిద్ధంగా ఉంది.
ఒక నిమిషం... రెండు నిమిషాలు.. మూడు నిమిషాలు... అయిదూ. అంతకు మించి సాధ్యం కాదు.
కణతలు నొప్పిగా అనిపిస్తున్నాయి. పళ్లు పెదాలను గట్టిగా కొరికేస్తున్నాయి. దేవుడా... శక్తినివ్వు... పరమాత్ముడా అదుపునివ్వు...
కిందకు ఒంగి రెండు మూడు మట్టిబెడ్డలను వెతికి అందుకుంది. అరచేతిలో గట్టిగా అదిమి పట్టుకుంది. ఆ..టో... ఆటోని పిలిచింది. రెండు కిలోమీటర్ల దూరంలో షాపింగ్ మాల్ ఉంది. వాళ్లయితే పట్టించుకోరు. అంతవరకూ ఉగ్గబట్టుకోగలగాలి.
కేక్ ఒళ్లో పెట్టుకుంటూ కాళ్లు రెండూ దగ్గరకు చేర్చుకుంటూ మనిషంతా బంతిలా మారుతూ కూచుంది.
తొందరగా ప్లీజ్... చాలా తొందరగా...
ఆటోవాడు మంచివాడిలా ఉన్నాడు. ఏదో కష్టంలో ఉన్నట్టు కనిపెట్టాడు. రివ్వున బయలుదేరాడు. చేతిలో మట్టిబెడ్డలు నలుగుతున్నాయి. పిండి పిండి అవుతున్నాయి. దేవుడా....
ఆటో ఆగింది.
తూనిగలా దిగి, సెక్యూరిటీని దాటుకుని, రెస్ట్ రూమ్ ఎక్కడా అని అడిగితే థర్డ్ ఫ్లోర్‌లో లేడీస్ వింగ్‌లో అని చెబితే, ఎక్స్‌లేటర్ ఎక్కీ ఎక్కీ, మళ్లీ ఎక్స్‌లేటర్ ఎక్కీ ఎక్కీ, మళ్లీ ఎక్స్‌లేటర్ ఎక్కీ ఎక్కీ....
కనిపించింది.
షీ....
దడేలున తలుపులాగి లోపలికి దూరి హైరానా హైరానాగా కమోడ్ మీద కూలబడ్డాక మొదట ఏడుపు వచ్చింది. మొదట ఏడుపే వచ్చింది. చాలాసేపటి వరకూ ఏడుపు వస్తూనే ఉంది.
ఈ దేశంలో ఆడవాళ్లు చాలావాటికి ఏడుస్తూ ఉన్నారు.
దీనికీ ఏడ్పిస్తూ ఉన్నారు.
- మహమ్మద్ ఖదీర్‌బాబు

Advertisement

What’s your opinion

Advertisement