మాటిమాటికీ నోరు తడారిపోతుంటే... | Sakshi
Sakshi News home page

మాటిమాటికీ నోరు తడారిపోతుంటే...

Published Mon, Aug 25 2014 11:17 PM

మాటిమాటికీ నోరు తడారిపోతుంటే...

డాక్టర్ సలహా
 
నాకు మాటిమాటికీ నోరు తడారిపోతోంది. ఎప్పుడూ దాహంగా ఉన్నట్లుగా అనిపిస్తూ, లాలాజలంతో నోరు తడిచేసుకోవాలనిపిస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు.
 - నరేందర్, కరీంనగర్

 
మన నోటిలో ఊరుతూ ఉండే లాలాజలం (సలైవా) వల్ల నోరు ఎప్పుడూ తడిగా ఉంటుంది. సాధారణంగా ఈ లాలాజలం నోటిలో ఉండే ఆహారపదార్థాలను ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటుంది. నోరు పొడిబారిపోవడం అనే లక్షణం డయాబెటిస్ రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి ఒకసారి మీరు డయాబెటిస్‌కు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోండి. ఇలా నోరు పొడిబారిపోవడాన్ని వైద్యపరిభాషలో ‘జీరోస్టోమియా’ అంటారు. నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా గూడుకట్టినట్లుగా ఒకేచోట అమితంగా పెరిగిపోతాయి. దీన్నే కొలొనైజేషన్ అంటారు.

ఇదే దుష్పరిణామం తల, గొంతు క్యాన్సర్ కారణంగా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారిలోనూ కనిపిస్తుంటుంది. ఇలా నోరు పొడిబారిపోవడం చాలాకాలంపాటు అదేపనిగా కొనసాగితే నోటిలోని మృదుకణజాలం (సాఫ్ట్ టిష్యూస్) దెబ్బతినడం, నొప్పిరావడం మామూలే. ఫలితంగా దంతక్షయం (టూత్ డికే), చిగుళ్ల వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే దంతవైద్యులను కలవాలి.
 
చికిత్స: నోటిలో తగినంత లాలాజలం ఊరని రోగులకు ప్రత్యామ్నాయంగా కొన్ని చికిత్సలు సూచిస్తారు. దాంతోపాటు కొన్ని పుక్కిలించే ద్రావణాలు, పైపూత (టాపికల్)గా వాడదగ్గ ఫ్లోరైడ్ ద్రావణాలను సూచిస్తారు.
 
ఇటీవల మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చక్కెర లేని చూయింగ్ గమ్స్, చక్కెర లేని మింట్ వంటివి నోటిలో తగినంత లాలాజలం ఊరేలా చేస్తాయి. దాంతోపాటు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తీసుకుని గుటక వేస్తుండటం, కరిగే ఐస్‌ను చప్పరించడం కూడా నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇలా నోరు పొడిబారేవాళ్లు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలాంటి డ్రింక్స్‌ను చాలా పరిమితంగా తీసుకోవడం మంచిది, ఆల్కహాల్‌ను మానితే మంచిది. మీరు ఒకసారి చక్కెరవ్యాధి నిర్ధారణకు చేయించే ఫాస్టింగ్ బ్లడ్, పోస్ట్ ప్రాండియల్ పరీక్షలు చేయించి మీ ఫిజీషియన్‌తో పాటు ఒకసారి దంతవైద్యుడిని కూడా కలవండి.
 
- డా. నరేంద్రనాథ్ రెడ్డి, దంతవైద్య నిపుణులు,  స్మైల్ మేకర్ డెంటల్ హాస్పిటల్ , హైదరాబాద్
 

Advertisement
Advertisement