6 బయట పోరాటం | Sakshi
Sakshi News home page

6 బయట పోరాటం

Published Mon, Jun 1 2015 12:59 AM

6 బయట పోరాటం

పోరాటానికి ధైర్యం ఉండాలి. శక్తీ ఉండాలి. అలాగే, పోరాటానికి శత్రువూ ఉండాలి. సతీ సావిత్రి పోరాటం... యముడితో... తన భర్తని తనకు తిరిగి ఇచ్చేయమని! ఈ చెల్లెళ్ల పోరాటం కూడా అదే. తమ భర్త తమకు కావాలని. వీళ్ల జీవితాల్ని నరకం చేసిన భర్తలు తిరిగి రావాలని. ఢిపరెన్స్ ఏంటంటే... ఈ మగాళ్లే యముళ్లు. ఆ దుర్మార్గపు యమపాశాల నుంచి వీళ్ల జీవితాలలో మళ్లీ గౌరవం నింపాలంటే మనం కూడా ఈ చెల్లెళ్ల కోసం పోరాడాలి. ఎవరైనా పోరాడుతుంటే సహజంగా సమాజం చప్పట్లు చరిచో కేరింతలు కొట్టో ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచుతుంది.

కానీ వీళ్లని సమాజం ఎంతో చిన్నచూపు చూస్తుంది. ఎగతాళి చేస్తుంది. ఊరి మగాళ్లు సాయంత్రం టీ కొట్టు దగ్గర కూర్చుని చెప్పుకునే ముచ్చట్లలో ఈ అమ్మాయిల జీవితం తప్పకుండా ఉంటుంది. దాని మీద ప్రతి ఒక్కడికీ ఒక చిల్లర కామెంట్ ఉంటుంది. ఆ కామెంట్ మీద వెకిలి నవ్వులు నవ్వినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఊరి ఆడవాళ్లు ‘ఏం పోయే కాలం వచ్చిందీ... మంచీచెడు ఇంట్లో మాట్లాడుకోవాలి కానీ, బజార్న పడతారా?’ అని నాలుగు అక్షింతలు వేసినా వేస్తారు. అసలు సమాజం సరిగ్గా ఉంటే, ఈ ఆరుగురు అమ్మాయిలు ఆరుబయటికి రావలసిన అవసరం ఏముంది? ఆలోచించండి.

 
ఒక్క మే నెలలోనే జరిగిన ఆరు మౌనపోరాటాలివి

నెత్తీ నోరూ కొట్టుకుని చెప్పినా ఈ ఆడపిల్లలు జాగ్రత్తపడరేం?! ప్రేమిస్తున్నామని చెబితే గుడ్డిగా నమ్మేస్తున్నారు. మోసపోయామని తెలిశాక గుండెలు బాదుకుంటున్నారు. కొందరు ధైర్యంగా ముందడుగువేస్తున్నారు. మౌన పోరాటంతో తమ కథను, వ్యథను పరిస్థితిని పదిమంది దృష్టికి తెస్తున్నారు. కానీ, వీళ్ల పోరాటానికి మద్దతుగా వస్తున్నదెవరు? అంతా ఏం చేస్తున్నట్టు? బాగా జరిగిందని చెవులు కొరుక్కుంటున్నారా? సినిమా స్టోరీ కన్నా బాగుందని ఎంజాయ్ చేస్తున్నారా? మన ఊరి అమ్మాయికో, మన వీధి అమ్మాయికో, మన పక్కింటి అమ్మాయికో... అన్యాయం జరిగితే మనింట్లో కాదులే అని నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారు?!

అమ్మాయి తనకు అన్యాయం జరిగిందని ఒంటరిగా పోరాడుతుంటే అంతా ఏం చేస్తున్నట్టు? అధికారులతోనూ, పెద్దలతోనూ మాట్లాడి పరిష్కారాలు చూపద్దా? న్యాయం జరిగేలా చూడద్దా? ఇంకా నయం తెలుగు గడ్డ మీద మహిళా సంఘాలు, మహిళా రక్షణ చట్టాల ఆసరా బాగానే ఉంది. అదే బీహార్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఆ అమ్మాయికి దిక్కేది? దక్కేదేమిటి? ఎంత ధైర్యం చేస్తే ఈ మహిళలు పోరాటానికి దిగారో. ఇంకా ఎంతమంది వెలుగులోకి రాకుండా చీకట్లో కుమిలిపోతున్నారో.. మోసానికి తగిన పరిష్కారం కుమిలిపోవడం కాదు.. పోరాటమే! ఆ పోరాటానికి మనలో ప్రతి ఒక్కరి మద్దతు అవసరం.
 - సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి
 
1
కుమారి, గుంటూరు
ఆరేళ్లుగా తనని ప్రేమిస్తున్నానని వెంటపడటంతో సునిల్‌ను నమ్మింది కుమారి. పెళ్లి చేసుకుంటానని చెప్పిన సునిల్ ఆమెను లోబర్చుకుని తీరా ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. తను మోసపోయాననే విషయం అర్థమైన కుమారి మొదట కంటికి మింటికీ ఏకధాటిగా ఏడ్చింది. తల్లిదండ్రీ కూతురునే తప్పుపట్టారు. ఎవరికి చెబితే తనకు న్యాయం జరుగుతుందో కుమారికి తెలియదు. కానీ, నమ్మినవాడి చేతే తాళికట్టించుకుంటానంటూ అతని ఇంటి ముందు దీక్ష చేపట్టింది. సునిల్ పరారీలో ఉన్నాడు.
 
2
మణెమ్మ, ప్రకాశం
ప్రకాశం జిల్లాకు చెందిన నాగూర్, మణెమ్మ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నాగూర్ నమ్మించాడు. ఈ నెల ఆరో తేదీన ఆమెను ఇంటి నుండి తీసుకెళ్లాడు. ఇద్దరూ కనిగిరిలో మూడు రోజులున్నారు. తర్వాత ఆ యువకుడు కనిపించకుండా పోయాడు. తను మోసపోయిన విషయం గ్రహించిన మణెమ్మ న్యాయం కావాలంటూ నాగూర్ ఇంటిముందు దీక్ష చేస్తోంది. మోసం చేసిన యువకుడు మణెమ్మను పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు.
 
3
సుకన్య, వరంగల్
సుకన్య కూలిపనులకు వెళ్లేది. ఇదే ప్రాంతానికి చెందిన వర్ధన్‌తో ఆమెకు పరిచయం పెరిగి, ప్రేమకు దారితీసింది. ఇద్దరూ మేజర్లు కావడంతో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. 45 రోజులు  కాపురం పెట్టారు. ఓ రోజు సుకన్యకు చెప్పకుండా తల్లిదండ్రుల ఇంటికి చేరాడు వర్ధన్. మూడు రోజులైనా భర్త తిరిగి రాకపోవడంతో  వర్ధన్ ఇంటికి వెళ్లింది సుకన్య. అతని తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వకపోగా భర్త ఎదుటే ఆమెను చితకబాదారు. దీంతో తనకు న్యాయం జరగాలని సుకన్య నిరసన దీక్షకు దిగింది.
 
4
రాధిక, హైదరాబాద్
రాధిక, సూర్యప్రకాశ్ ప్రేమించుకున్నారు. ఫలితంగా పెళ్లికాకుండానే రాధిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని సూర్యప్రకాశ్ అడిగింది. అబార్షన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. రాధికను వరంగల్ తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత రాధిక సూర్యప్రకాశ్ వద్ద ఎన్ని సార్లు పెళ్లిమాట తీసుకువచ్చినా తప్పించుకు తిరిగాడు. రాధిక ఇక ఉండబట్టలేకపోయింది. సూర్యప్రకాశ్ ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది. చివరికి సూర్యప్రకాశ్ తన తప్పు ఒప్పుకొని, రాధికను పెళ్లి చేసుకున్నాడు.
 
5
సుధారాణి, కడప
కడపజిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు, సుధారాణిలకు పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. కలకాలం తోడూనీడగా ఉంటానని బాస చేసిన భర్త సుధారాణిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. పిల్లలను తీసుకొని పుట్టినింటికి చేరుకున్న సుధారాణి భర్త ఎప్పటికైనా వస్తాడులే అని ఎదురుచూస్తూ ఉంది. కానీ, వెంకటేశ్వర్లు గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకొని భార్యా బిడ్డల్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆమె భర్త ఇంటి ముందు పిల్లలతో సహా మౌన పోరాటానికి కూర్చుంది.
 
6
అలివేణి, నెల్లూరు

నెల్లూరు జిల్లాలో అలివేణి అనే మహిళ అత్తింటి ముందు మౌనపోరాటానికి దిగింది. అలివేణి, సుధాకర్‌లకు రెండేళ్ల కిందట పెళ్లైంది. ఓ బిడ్డ కూడా ఉన్నాడు. భర్త రెండో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే తనను వేధించి, బయటకు వెళ్లగొట్టాడని ఆమె ఆరోపణ. తన భర్త అలా ప్రవర్తించడానికి అత్తమామలు, స్నేహితులే కారణంగా ఆమె చూపుతోంది. భర్త తనను ఇంటిలోకి తీసుకెళ్లేంతవరకు న్యాయపోరాటం చేస్తానని పట్టుబట్టింది.
 
పెళ్లి కాకపోయినా కొన్ని రోజులు కలిసుంటే చాలు. అది గృహహింస చట్టపరిధిలోకే వస్తుంది. ‘ఆమె’ రక్షణకు 493, 420, 498ఎ’.. వంటి ఎన్నో చట్టాలు అమలులో ఉన్నాయి. బాధితురాలు తనకు కావల్సిన న్యాయాన్ని నూరు శాతం పొందవచ్చు.
 - ఎమ్.ఎ. అజిమ్ క్రిమినల్ లాయర్
 
ప్రేమ, పెళ్ళిళ్ళలో నష్టపోతున్నది అమ్మాయిలే. సమస్యను ఎలా పరిష్కరించు కోవాలో పిల్లల్లో అవగాహన పేరెంట్సే తీసుకురావాలి. ఇలాంటి సంఘటనల్లో అమ్మాయికి కుటుంబ మద్దతు తప్పనిసరి.
- వీరేందర్ సైకాలజిస్ట్
 
ఆడపిల్ల జీవితం నిలబెట్టడానికే మా ప్రయత్నం. ముందుగా మోసపుచ్చిన వాడిని అరెస్ట్ చేసి, ఇద్దరికీ  స్థానిక స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇప్పించి, రాజీ కుదుర్చుతాం.
- వినోద్‌కుమార్, ఎస్.ఐ, గుంటూరు జిల్లా

Advertisement
Advertisement