ఎవరిది అరాచకం?! | Sakshi
Sakshi News home page

ఎవరిది అరాచకం?!

Published Sun, Mar 31 2019 12:20 AM

Ramachandra Murthy Article On Chandrababu Naidu - Sakshi

జగన్‌మోహన్‌రెడ్డి గెలిస్తే రాష్ట్రంలో అరాచకం అనివార్యమని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను రోజుకు పదిసార్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడేదో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్నట్టూ, సర్వ జనులకూ సమన్యాయం జరుగుతున్నట్టూ, తాను అభినవ ధర్మ రాజులాగా పరి పాలిస్తున్నట్టూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అనుభవజ్ఞుడనీ, కొత్త రాష్ట్రా నికి గట్టి పునాది వేస్తారనీ విశ్వసించి ప్రజలు 2014లో పట్టం కడితే ఎంత సలక్ష ణంగా పరిపాలించారు? కడచిన 58 మాసాల వ్యవధిలో జరిగిన పరిణామాలు గమనిస్తే టీడీపీ ఎంత అరాచకంగా, ఎంత అధర్మంగా, ఎంత ప్రజావ్యతిరేకంగా, ఎంత అప్రజాస్వామికంగా పాలించిందో స్పష్టంగా తెలిసిపోతుంది.  

అధికారంలోకి వచ్చిన కొన్ని వారాలకే శేషాచలం అడవులలో ఎర్రచందనం కూలీలను ఎన్‌కౌంటర్‌ చేయించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. వారిని అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ డీఐజీ కాంతారావు దుందుడుకు ఆదేశాలు ఇర వై మంది దుర్మరణానికి దారి తీశాయి. ఈ ఘటనపైన సవ్యంగా విచారణ జరిపిం చకపోవడం, ఎవ్వరినీ దోషులుగా నిర్ధారించకపోవడం అరాచకం కాదా? చింత మనేని ప్రభాకర్‌ అనే అధికార పార్టీ శాసనసభ్యుడు అడ్డగోలుగా చేస్తున్న ఇసుక దోపిడీకి అడ్డుతగిలిన తహసీల్దార్‌ వనజాక్షిని జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఆమె కంటనీరు పెట్టుకొని తనపైన హత్యాప్రయత్నం జరిగిందంటూ పోలీసు లకు ఫిర్యాదు చేశారు. వనజాక్షిని ముఖ్యమంత్రి పిలిపించుకున్నారు. ఫిర్యాదు ఉపసంహరించుకోమని ఆదేశించారు. మరెవరైనా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే సదరు శాసనసభ్యుడిని మందలించి అతని చేత అధికారికి క్షమాపణ చెప్పించేవారు. చంద్రబాబు వనజాక్షినే తప్పుపట్టారు. ఆమెపైనే ఆగ్రహించారు. ఇది న్యాయమా? ధర్మమా? అదే శాసనసభ్యుడు దళితులను ఉద్దేశించి ‘మీకు రాజకీయాలెందుకురా?’ అంటూ దుర్భాషలాడారు. ఇంత అసభ్యంగా ప్రవర్తిం చినా ప్రభాకర్‌ను చంద్రబాబు మందలించిన దాఖలా లేదు. గోదావరి పుష్కరా లకు అంత హడావిడి చేయనవసరం లేదు. సందర్భం ఏదైనా ప్రభుత్వ వ్యయంతో గొప్ప ఈవెంట్‌గా నిర్వహించి దాన్ని ఒక ఘనవిజయంగా  పరిగణించి తన ఖాతాలో జమచేసుకోవడం స్వీయప్రేమికుడైన చంద్రబాబుకి ఆనవాయితీ.

అదే విధంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తాను గోదావరి పుష్కరాల సందర్భంగా కుటుంబ సమేతంగా పవిత్ర స్నానం చేసే ఘట్టాన్ని చిత్రీకరించి చరిత్రపుటల్లోకి ఎక్కాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఈ  ఘట్టానికి విశేష ప్రచారం ఇచ్చి వేలాదిమంది ప్రజలను రప్పించి వారి సమక్షంలో షూటింగ్‌ చేస్తుండగా తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు. విలువలున్న రాజకీయ నాయకుడు ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ దుర్ఘటన జరిగిన వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పేవారు. పదవి నుంచి వైదొలిగేవారు. ప్రభుత్వ వైఫ ల్యాన్ని బేషరతుగా అంగీకరించేవారు. తొక్కిసలాట జరగడానికి బాధ్యులైన అధికారులపైన చర్య తీసుకునేవారు. చంద్రబాబు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవ హరించారు. ఈ ఘటనపైన జస్టిస్‌ సోమయాజులుతో విచారణ జరిపించారు. సుమారు మూడు పదుల మరణాలకు మీడియా అతిపోకడలూ, భక్తుల అవి వేకం మాత్రమే కారణమంటూ విశ్రాంత న్యాయమూర్తి నిర్ధారించారు. శేషాచలం ఎన్‌కౌంటర్‌లాగానే, పుష్కరాల తొక్కిసలాటలో కూడా దోషులు ఎవ్వరూ లేరు. శిక్ష ఎవ్వరికీ లేదు. ఇది అరాచకం కాదా?

మంటలార్పకుండానే నిందలు
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానంటూ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది టీడీపీ. ఆ వాగ్దానం అమలు చేయాలంటూ కాపు నాయకుడు ముద్రగడ పద్మ నాభం ఉద్యమం చేశారు. ఆ సందర్భంలో తునిలో సభ నిర్వహించారు. అప్పుడు ఎవరో దుండగులు రైలుకు నిప్పుపెట్టారు. బాధ్యతగల ప్రభుత్వం ముందు మంటలు ఆర్పేందుకు అగ్నిమాపకదళాన్ని పురమాయించి రంగంలోకి దింపాలి. ప్రాణనష్టం లేకుండా చూడాలి. రైలుకు నిప్పు పెట్టింది ఎవరో తెలుసు కోవడానికి దర్యాప్తు జరపవలసిందిగా పోలీసులను ఆదేశించాలి.  చంద్రబాబు ఏమి చేశారు? రైలు తగలబడుతూ ఉండగానే మీడియాను  పిలిచి ఈ పని పులివెందుల రౌడీలే చేశారంటూ నిందమోపారు. పోలీసులు మాత్రం స్థానిక వ్యక్తులను అనుమానించి అరెస్టు చేశారు. ఉద్యమం సందర్భంగా పోలీసులు ముద్రగడ భార్యపైనా, కోడలిపైనా దాడి చేశారు. వారిని బండబూతులు తిట్టిన డీఎస్‌పీ దామోదర్‌కి ఎస్‌పీగా పదవోన్నతి కల్పించి సత్కరించింది టీడీపీ సర్కార్‌. ఈ ఘటనలో కూడా దోషులు ఎవరో తేలలేదు. ఎవరికీ శిక్ష పడలేదు. 2014 ఎన్నికల ప్రచార ఘట్టంలో కూడా విశాఖపట్టణంలో కడప నుంచి రౌడీలు దిగారనీ, అరాచకం సృష్టించేందుకు జగన్‌ వారిని రప్పించారనీ టీడీపీ, దాని అనుబంధ సంస్థలూ వదంతులు పుట్టించాయి. అంతా అభూతకల్పన అని విశాఖ ప్రజలకు అర్థమైపోయింది. చంద్రబాబు మాటలను విశ్వసించరాదని వారు అప్పుడే తీర్మానించుకున్నారు.

మాటమాటకీ పులివెందుల ప్రజలనూ, కడప జిల్లా ప్రజలనూ నేరస్వభావం కలవారిగా చిత్రించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్లను రూపు మాపి, ఫ్యాక్షన్‌ నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి కడపకు మంచిపేరు తీసుకొని రావడానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శాయశక్తులా కృషి చేస్తే ఆ ప్రాంతాన్ని బదనాం చేసే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. బాధ్యత కలిగిన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇంత నేలబారుగా, బాధ్యతారహితంగా ఒక జిల్లా లేదా నియోజకవర్గం ప్రజల గురించి మాట్లాడటం సంస్కారమా? ఒక పాలకుడు తన పరిపాలనలో ఉన్న వారి గురించి ఇంత అన్యాయంగా వ్యాఖ్యానించడం రాజధర్మమా? నోటికి వచ్చినట్టు మాట్లాడటం అరాచకం కాదా? ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యం పైన విజయవాడ ఎంపీ కేశినేని నాని, శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు, ఎంఎల్‌సీ బుద్ధా వెంకన్న వాగ్దాడి చేస్తే వారిని పిలిపించుకొని పరిష్కారం (సెటిల్మెంట్‌) చేసిన ముఖ్యమంత్రి అరాచకవాది కాదా? ఫిరాయింపులను అరికట్టడానికి రాజీవ్‌గాంధీ, వాజ్‌పేయీ చేసిన విశేషమైన కృషిని వమ్ము చేస్తూ 23 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎంఎల్‌ఏలను కొనుగోలు చేసి వారిలో నలుగురిని అక్ర మంగా మంత్రులను చేయడం అరాచకం కాదా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా? ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చాలక పొరుగున తెలంగాణ రాష్ట్రం లోనూ చక్రం తిప్పాలన్న దురాశతో ఎంఎల్‌సీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)కి చెందిన ఎంఎల్‌ఏ స్టీఫెన్సన్‌ను కొనుగోలు చేసే క్రమంలో బయానాగా రూ. 50 లక్షలు తెలంగాణ టీడీపీ ఎంఎల్‌ఏ రేవంత్‌రెడ్డి చేత ఇప్పించి, ‘మనవాళ్ళు బ్రీఫ్డ్‌ మీ...’ అంటూ టేపులో చిక్కిపోవడం, అడ్డంగా దొరికిపోవడం అప్రజాస్వామికం కాదా? అరాచకం కాదా?

బాబు బాధ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యథ
‘ఓటుకు కోట్ల’ కేసుతో భయపడి విజయవాడకు పలాయనం చిత్తగించడం నిజం కాదా? రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడగొట్టారనీ, ఆంధ్రులను కట్టుబట్టలతో పంపారనీ, తాను విజయవాడలో కొంతకాలం బస్సులో జీవించాననీ అరిగిన రికార్డులాగా చెప్పిందే చెబుతున్న చంద్రబాబు అనవసరంగా ప్రభుత్వ ఉద్యో గులను కష్టాలపాలు చేశారు. పదేళ్ళు హైదరాబాద్‌లో కొనసాగుతూ అమరావతి రాజధానిని శాశ్వత ప్రాతిపదికపైన నిర్మించుకొని దర్జాగా వెళ్ళవలసింది పోయి కేసు తరుముతున్న దొంగలాగా విజయవాడ వెళ్ళి తప్పిదం చేసింది చంద్ర బాబు. తన తప్పులకు మూల్యం చెల్లిస్తున్నది సీమాంధ్రులు. చంద్రబాబూ, ప్రభుత్వోద్యోగులూ హైదరాబాద్‌ వదిలిపెట్టి విజయవాడకు వెళ్ళారు కానీ విభజనకు ముందు హైదరాబాద్‌లో నివసించిన  సీమాంధ్రులందరూ అక్కడే  క్షేమంగా ఉన్నారు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ అన్నట్టు బాబు బాధ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజల వ్యథగా పరిణమించింది. 2018 మార్చిలో ఎన్‌డీఏ నుంచి నిష్క్ర మించిన క్షణం నుంచీ కేంద్రం అన్యాయం చేస్తున్నట్టు బాబు ప్రతిరోజూ మొత్తు కుంటున్నారు. సమాఖ్య స్ఫూర్తిని ఎన్‌డీఏ ప్రభుత్వం పాటించాలనీ, ప్రతి విష యంలో జోక్యం చేసుకోకుండా రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలనీ  కోరుతు న్నారు. రాష్ట్రం స్వయంప్రతిపత్తిని కాపాడుకునే పేరుతో కేంద్రాన్ని ధిక్కరిస్తూ తాను ప్రజాస్వామ్య పరిరక్షణకోసం తెగించి పోరాడుతున్నట్టు భ్రమిస్తున్నారు.

డాంక్విక్జోట్‌ గాలిమరపై కత్తియుద్ధం చేసినట్టు చంద్రబాబుతో కత్తి కలపడానికి సిద్ధంగా లేని  నరేంద్రమోదీపైన భీకరపోరాటం చేస్తున్నట్టు ప్రజలు నమ్మాలని అంటున్నారు. కానీ ప్రజలు నేరుగా ఎన్నుకున్న పంచాయతీ సర్పంచ్‌ల అధికా రాలను తాను నియమించిన జన్మభూమి కమిటీలకు అప్పగించి క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని నిలువెత్తు పాతరేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం జన్మభూమి కమిటీలకు అప్పగించి గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్య స్ఫూర్తిని కుళ్ళపొడిచారు. ఇది ‘పచ్చ’అరాచకం కాదా? తాను చుట్టూ చేర్చుకున్న ఆర్థిక నేరస్తులను కాపాడుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌(ఈడీ), ఆదాయంపన్ను శాఖ (ఐటీ)లను రాష్ట్రంలోకి అనుమతించేది లేదంటూ స్వతంత్రం ప్రకటించుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇది పచ్చి అరాచకం కాదా? పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని నేరస్తులకు రక్షణ కల్పిస్తూ అమాయకులను వేధిస్తూ పరిపాలన చేయడం ప్రజాస్వామ్యమా? విశాఖ విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో ప్రతిపక్ష నాయకుడిపైన శ్రీనివాస్‌ అనే దుండగీడు దాడి చేసినప్పుడు చంద్రబాబు వ్యవ హరించిన తీరు ఎంత దరిద్రంగా ఉన్నదో ప్రజలు గమనించడం లేదని అనుకుం టున్నారా? ‘కోడికత్తి’తో ప్రతిపక్ష నాయకుడే కావాలని దాడి చేయించుకున్నట్టు ప్రతి సభలోనూ వెకిలిగా మాట్లాడటం కుసంస్కారానికి నిదర్శనం కాదా? వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేసి ఎన్నికలలో ప్రచారాంశంగా చేసి జగన్‌ స్వయంగా ఈ హత్య చేశారంటూ నిత్యం ఆరోపిం చడం బరితెగింపు రాజకీయం కాదా? ఇంత నీచంగా ఒక ముఖ్యమంత్రి మాట్లా డవచ్చునా? ఎవరు హంతకులో తేల్చవలసింది దర్యాప్తు సంస్థలు కాదా? ఆది వాసీ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావునూ, మాజీ శాసనసభ్యుడు సికీరి సోమునూ మావోయిస్టులు చంపివేస్తే అది ప్రభుత్వ వైఫల్యం కాదా? బాబు బాక్సైట్‌ రాజకీయంలో హతులు సమిధలు కాదా? ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ప్రత్యర్థి, పత్తికొండ వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్‌ చెరుకులపాడు నారాయణరెడ్డి హంతకులను కాపాడే ప్రయత్నం చేయడం అరాచకం కాదా?

నిలకడగా.. నిబ్బరంగా..
తండ్రి మరణవార్త విని తట్టుకోలేక ప్రాణాలు విడిచినవారి కుటుంబాలను పరామర్శించేందుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రపంచంలో పదిమంది అత్యంత శక్తిమంతులలో ఒకరైన సోనియాగాంధీని ధిక్కరించి కాంగ్రెస్‌ నుంచి నిష్క్ర మించి సొంత పార్టీ పెట్టుకోవడం అరాచకమా? కాంగ్రెస్‌ నుంచి వైదొలిగి తన పార్టీలో చేరడానికి వచ్చిన శాసనసభ్యుల చేత రాజీనామాలు చేయించి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గౌరవించడం అరాచకమా? కాంగ్రెస్, టీడీపీలు కలిసి సీబీఐ చేత పెట్టించిన బూటకపు కేసులలో బాబులాగా స్టేలు తెచ్చుకోకుండా  కోర్టులను గౌరవిస్తూ విచారణ ఎదుర్కోవడం అరాచకమా? తాను నిష్కార ణంగా 16 మాసాలు జైలులో ఉండటానికి కారకులైనవారిని పల్లెత్తు మాట అనకుండా హుందాగా వ్యవహరించడం అరాచకమా? తనపైన దాడి జరిగి కత్తి భుజంలో దిగి నెత్తుటితో తడిసిన చొక్కాను ప్రదర్శించకుండా మరో చొక్కా తొడు క్కొని చిరునవ్వుతో విమానం ఎక్కి హైదరాబాద్‌ వెళ్ళి ఆసుపత్రిలో చేరడం, ఈ ఘటనతో రెచ్చిపోవద్దంటూ పార్టీ కార్యకర్తలకూ, అభిమానులకూ పిలుపు నివ్వడం అరాచకమా? బాబు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా, సంయమనం కోల్పోకుండా, నిబ్బరంగా వ్యవహరించడం, మాట తూలకపోవడం, నిరాధా రమైన ఆరోపణలు చేయకపోవడం అరాచకమా? అమలు సాధ్యం కాని వాగ్దానం చేయకపోవడం, మాటకు కట్టుబడి ఉండేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నించడం అరాచకమా? ప్రజల కష్టనష్టాలను స్వయంగా తెలుసుకోవ డానికి సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించడం, లక్షలాదిమంది ప్రజలను కలుసుకొని పలకరించడం, వారి సమస్యలను ఆకళింపు చేసుకోవడం, వాటి పరి ష్కారం కోసం పరిశ్రమించడం అరాచకమా? రాబోయే ఎన్నికలలో ప్రజలు ఒక్క సారి అవకాశం ఇస్తే తండ్రి బాటలో నడిచి రాజన్న రాజ్యం నెలకొల్పాలని  కలలు  కనడం, ప్రజారంజకంగా పరిపాలించాలని పరితపించడం అరాచకమా? ఎవరు పద్ధతిగా వ్యవహరిస్తున్నారో, ఎవరిది అరాచకమో ప్రజలే నిర్ణయించాలి. ఆ నిర్ణయం సార్వత్రిక ఎన్నికలలో ఏప్రిల్‌ 11వ తేదీన ఓటు వేయడానికి ముందే జరగాలి.

కె. రామచంద్రమూర్తి

Advertisement
Advertisement