Sakshi News home page

‘రోబోటిక్స్’ను సృష్టించిన రచయిత

Published Sun, Oct 25 2015 3:29 AM

‘రోబోటిక్స్’ను సృష్టించిన రచయిత

పీఛేముడ్
సైన్స్ ఫిక్షన్ రచనలకు పితామహుడు అనదగ్గ రచయిత ఇసాక్ అసిమోవ్. రికార్డుల్లో ఆయన 1920 జనవరి 2న పుట్టినట్లుగా నమోదైనా, ఆయన అంతకు ముందే పుట్టి ఉండవచ్చనేది చరిత్రకారుల అంచనా. రష్యాలో పుట్టిన అసిమోవ్ బాల మేధావిగా పేరు పొందాడు. ఐదేళ్ల వయసులో స్వయంగా చదవడం నేర్చుకున్నాడు. పదిహేనేళ్ల వయసులోనే హైస్కూల్ చదువు పూర్తి చేశాడు. పంతొమ్మిదో ఏట తొలి కథను ప్రచురణకర్తలకు అమ్మాడు. శాస్త్ర సాంకేతిక రంగం అంతగా అభివృద్ధి చెందని ఇరవయ్యో శతాబ్ది తొలి రోజుల్లోనే ఎవరూ ఊహించని శాస్త్ర సాంకేతిక పరిణామాలను ఊహించాడు.

న్యూయార్క్‌లో స్థిరపడి దాదాపు ఐదువందలకు పైగా పుస్తకాలను రాశాడు. వాటిలో కొన్నింటికి సంపాదకత్వం వహించాడు. సైన్స్ ఫిక్షన్ రచనలు ఆయనకు పేరు, డబ్బు తెచ్చిపెట్టినా, లిమరిక్కులు రాయడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. ‘రోబో’ల గురించి రాసిన ఒక నవలలో తొలిసారిగా ‘రోబోటిక్స్’ పదాన్ని ఉపయోగించిన ఘనత అసిమోవ్‌కే దక్కుతుంది. ఆయన ఆ మాట వాడిన దశాబ్దాల తర్వాత ‘రోబోటిక్స్’ ఒక ప్రత్యేక సాంకేతిక శాస్త్రంగా ఎదిగింది. విల్ స్మిత్ రూపొందించిన హాలీవుడ్ సూపర్‌హిట్ ‘ఐ, రోబో’కు అసిమోవ్ రచనే ఆధారం. అయితే, అంతరిక్షానికి సంబంధించి చాలా కాల్పనిక సాహిత్యాన్ని సృష్టించిన అసిమోవ్ తన జీవితకాలంలో రెండు సార్లు మాత్రమే విమాన ప్రయాణం చేయడం విచిత్రం.
 
నైలు నదిని తస్కరించాలనుకున్న బ్రిటన్
ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక నదిని తస్కరించగలరా? కనీసం అలాంటి ఊహనైనా ఊహించగలరా? ‘రవి అస్తమించని’ ప్రాభవం సన్నగిల్లిన సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచన చేసింది. ఈజిప్టు నుంచి నైలు నదిని తస్కరించాలనే ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలించింది. ఆ ప్రతిపాదనలో చాలా ప్రతికూలతలు  ఉండటంతో విరమించుకుంది. అందువల్ల అదృష్టవశాత్తు నైలు నది ఇప్పటికీ క్షేమంగానే ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? 1956 నాటికి ప్రపంచంలో బ్రిటన్ ప్రాభవం దాదాపు అవసాన దశకు చేరుకుంది.

అలాంటి పరిస్థితుల్లో కూడా బ్రిటిష్ దళాలు కీలకమైన సూయజ్ కాలువపై అనధికారికంగా పెత్తనం చలాయించసాగాయి. ఈ పోకడలను అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నసీర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. సూయజ్ కాలువ నుంచి బ్రిటిష్ బలగాలు వెనక్కు మళ్లాల్సిందేనని కరాఖండిగా హెచ్చరించాడు. గత్యంతరం లేక బ్రిటిష్ బలగాలు వెనక్కు మళ్లాయి. సూయజ్ కాలువ నుంచి తమను వెళ్లగొట్టిన ఈజిప్టుకు బుద్ధి చెప్పాలంటే, నైలు నదిని తస్కరించడమే తగిన పని అని ఆఫ్రికాలోని బ్రిటిష్ కొలోనియల్ కార్యాలయం ప్రతిపాదనను పంపింది.

నైలు నది ఆవిర్భావ ప్రాంతమైన ఉగాండా అప్పటికి ఇంకా బ్రిటన్ అధీనంలోనే ఉండేది. దానిపై బ్రిటిష్ ప్రభుత్వం డ్యాము కూడా నిర్మించింది. అక్కడి నుంచి నియంత్రిస్తే, ఈజిప్టులోకి చేరే నైలు నది నీరు దాదాపు ఎనభై శాతం వరకు తగ్గిపోతుంది. ఆ దెబ్బకు ఈజిప్టు ప్రభుత్వం దిగివస్తుందనేది ఆ ప్రతిపాదన సారాంశం. లండన్‌లోని బ్రిటిష్ పెద్దలు దీనిపై చాలా తర్జన భర్జనలు పడ్డారు. ఇలా చేస్తే ఈజిప్టు చుట్టుపక్కల మరో రెండు దేశాలకు కూడా నీరు అందకుండా పోయి అంతర్జాతీయంగా బ్రిటన్ పరువు మంటగలుస్తుందని భావించి, ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు.
 
మందు కోసం వెర్రి పందెం
పెను తుపానులు చెలరేగినప్పుడు ఎవరికి వారే సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకుంటారే తప్ప తుపానులకు ఎదురీదాలనే వెర్రి ప్రయత్నాలేవీ చేయరు. ప్రాణాలపై ఆశలు ఉన్న వాళ్లెవరైనా కనీసం అలాంటి దుస్సాహసాలను కలలోనైనా ఊహించలేరు. అయితే, బ్రిటిష్ నావికాదళంలో పనిచేసిన కల్నల్ జోసెఫ్ డక్‌వర్త్ అలాంటిలాంటి మనిషి కాదు. ‘సాహసమే నా ఊపిరి’ అనే టైపు! ఆ సంగతిని నిరూపించుకోవడానికి ఎంతటి దుస్సాహసాలకైనా తెగించేవాడు.

ఇతగాడి దళం అమెరికాలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు 1943 జూలై 27న టెక్సాస్‌లో పెనుతుపాను చెలరేగింది. విమానాలన్నింటినీ నిలిపివేశారు. అలాంటి పెను తుపానులో విమానాలు ఎగిరితే అవి గల్లంతవడం ఖాయం. సైనిక స్థావరంలో ఇదే విషయాన్ని కొందరు మాట్లాడుకోవడం విన్నాడు డక్‌వర్త్. తుపాను మీదుగా విమానాన్ని నడిపి, సురక్షితంగా రాగలనని వాళ్లకు సవాలు చేశాడు. మాటా మాటా ముదరడంతో పందెం... అంటే పందెం అనుకున్నారు.

పందెం కాసిందేమీ డబ్బూదస్కం, నగానట్రా వంటి విలువైనదేదీ కాదు. కేవలం ఒక సీసా విస్కీ, దానికి అనుపానంగా తగినంత సోడా! ఏదైతేనేం... పందెమంటే పందెమే... అంటూ విమానం తీసుకుని బయలుదేరాడు డక్‌వర్త్. ఈ ఆలోచనకు అప్పటికే భయంతో బిక్కచచ్చి ఉన్న లెఫ్టినెంట్ రాల్ఫ్‌ను తనకు తోడుగా తీసుకుపోయాడు. ఈ దుస్సాహసాన్ని అందరూ కళ్లప్పగించి చూశారు. వాళ్లు చూస్తుండగానే విమానం నింగికెగసింది. తుపాను కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం వైపుగా దూసుకుపోయింది.

తుపాను సుడులు తిరుగుతున్న కేంద్ర ప్రాంతం మీదుగా విమానాన్ని భూమికి తొమ్మిదివేల అడుగుల ఎత్తుకు పోనిచ్చాడు డక్‌వర్త్. తుపాను తాకిడికి విమానం చిగురుటాకులా కంపించింది. తుపానును చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోయింది. రెండుసార్లు తుపాను మీదుగా చక్కర్లు కొట్టిన తర్వాత తిరిగి యథాస్థానానికి చేరుకుంది. విమానం దిగిన తర్వాత డక్‌వర్త్ విజయగర్వంతో విస్కీ బాటిల్ అందుకున్నాడు.

కూర్పు: పన్యాల జగన్నాథదాసు

Advertisement

What’s your opinion

Advertisement