మాట మరచిన ఊరు | Sakshi
Sakshi News home page

మాట మరచిన ఊరు

Published Thu, Mar 12 2015 10:43 PM

మాట  మరచిన ఊరు - Sakshi

‘‘నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.  నీకు నోరే లే కపోతే  నీ కోసం ఊరే మూగబోతుంది’’ అన్నట్టుగా ఆ అన్నా చెల్లెళ్ల కోసం ఊరు ఊరంతా మూగబోయిన వైనమిది. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో నివసించే ముహర్రమ్ మూగ, చెవిటి. ముహర్రమ్ మంచివాడు కావడంతో చుట్టుపక్కలవాళ్లు అతనిని బాగా అభిమానిస్తారు. ఒక రోజు ముహర్రమ్, సోదరితో కలిసి  ఒక షాపు మీదుగా వెళుతుంటే... ఆ షాపతను  గుడ్మార్నింగ్ అంటూ అతడిని విష్ చేశాడు. అదీ సైన్ లాంగ్వేజ్‌లో. ఆ తర్వాత వీళ్లిద్దరూ లోకల్ క్యాబ్ ఎక్కబోతుంటే ఆ డ్రైవర్ కూడా ముహర్రమ్‌ని సైన్ లాంగ్వేజ్‌లోనే పలకరించాడు. ఈ రెండు సంఘటనలు జరిగిన కాసేపటికే... స్థానికులంతా గుంపుగా వచ్చి ముహర్రమ్‌తో సంభాషించడం ప్రారంభించారు. అదీ సైన్‌లాంగ్వేజ్‌లోనే. అప్పుడు అర్ధమైంది ముహర్రమ్‌కి... తమ చుట్టుపక్కల వాళ్లంతా తన ‘భాష’ నేర్చుకున్నారని. అదీ తన కోసమేనని. ‘‘నోటిమాట లేదు నొసట... ఎన్నో నోళ్లున్నాయి నా కోసం ఇచట’’ అంటూ ఉప్పొంగిపోయిన ముహర్రమ్ ఆనందం ఆపుకోలేక కన్నీరు మున్నీరయ్యారు.

కొసరంత: మదిని కదిలించే ఈ సన్నివేశాన్ని మొత్తాన్ని నిశ్శబ్దంగా షూట్ చేశాయి కొన్ని కెమెరాలు. శామ్‌సంగ్ సంస్థ వినికిడి లోపం ఉన్నవారి  కోసం తాము రూపొందించిన వీడియో కాల్ సెంటర్ ప్రమోషన్ ఇది. ఒక యాడ్ ఏజెన్సీ  ఈ మొత్తం కథను నడిపింది. మొహర్రమ్‌కి తెలియకుండా చుట్టుపక్కలవాళ్లకు సైన్ లాంగ్వేజ్ నేర్పి మరీ ఈ ఈ యాడ్ చేసేందుకు  నెలలు పట్టింది. గత వారం యూట్యూబ్‌కి ఎక్కిన ఈ వీడియోని లక్షలాదిగా వీక్షకులు చూస్తున్నారని రూపకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారట!
 

Advertisement
Advertisement