​​‍భామనే సత్యభామనే | Sakshi
Sakshi News home page

​​‍భామనే సత్యభామనే

Published Mon, Oct 16 2017 1:56 AM

Satyabhama Biography for this diwali

ఆవేశం పాలు ఎక్కువగా ఉండే తెలుగువారికి సత్యభామ అంటే ఆప్యాయత, ఆదరం. నందితిమ్మన పారిజాతాపహరణం... సత్యభామ అంటే మనలో ఇష్టాన్ని పెంచింది. పోతన భాగవతం... నరకుడి యుద్ధవర్ణనతో... సత్యభామని ఆదర్శ స్త్రీమూర్తిగా నిలబెట్టింది. ‘భామనే, సత్యభామనే’ అంటూ కూచిపూడి భాగవతం... సత్యభామని  మనకు మరింత దగ్గర చేసింది.


ఎవరీ సత్యభామ? ఆమెలో ప్రత్యేకతలేమిటి?
సత్యభామ అనగానే అందరికీ గుర్తొచ్చేది గరుత్మంతుడి మీద కృష్ణుడు మూర్ఛపోయి ఉండగా, వింటిని ఎక్కుపెట్టి పెద్దకళ్లతో తీవ్రంగా చూస్తూ బాణాన్ని సంధిస్తున్న రూపమే. ఆమె పురాణకాలం నాటి స్త్రీకి మాత్రమే కాదు సమర్థవంతురాలైన ఆధునిక స్త్రీకి కూడా ప్రతిబింబం. సత్యభామలో ఉన్న ప్రత్యేక లక్షణాలను పరిశీలిస్తే... సత్యభామను కళ్లారా చూసినట్లే.

స్వాభిమానం: అందరిలో ఒకరిగా ఉండిపోవడానికి ఇష్టపడదు. ఏ పని చేసినా మిగిలిన వారికంటే ఘనంగా, సమర్థవంతంగా చేయాలనుకుంటుంది. తనేంటో నిరూపించుకోవాలనే తపన ఉన్న స్త్రీ.

పౌరుషం: ఆమె తండ్రి సత్రాజిత్తును శతధన్వుడు సంహరిస్తాడు. తండ్రి మరణానికి తీవ్రంగా బాధపడుతుంది. అంతటితో ఆగిపోలేదు, ఏడుస్తూ ఊరుకోలేదు సత్యభామ. తండ్రి ప్రాణాలు తీసిన వాడికి చావంటే ఏమిటో చూపిస్తానని ప్రతినపూనుతుంది. అప్పుడు కృష్ణుడు ఆమెను ఓదార్చి, శతధన్వుడిని తాను సంహరిస్తానని మాట ఇచ్చే వరకు శాంతించని మహిళ.

కళలలో నేర్పరి: నృత్యం, సంగీతం వంటి లలిత కళల్లో ఆరితేరింది. స్త్రీ వీటికే పరిమితం అని గిరి గీసుకోకుండా యుద్ధవిద్యల్లో కూడా ఎనలేని నైపుణ్యాన్ని సాధించింది. స్త్రీ సాధించలేనిది ఏదీ లేదు, స్త్రీ శక్తికి, తెలివితేటలకు పరిధి విధించడం ఎవరితరమూ కాదని నిరూపించిన మహిళ సత్యభామ.

సౌకుమార్యం: సత్యభామ చిలుకలకు పలుకులు నేర్పేది. నెమళ్లకు నాట్యం నేర్పించేది. బొమ్మల పెళ్లిళ్లకు వెళ్లినా అలసి పోయేది. అంతటి సుకుమారి. అయినా ఎప్పుడూ కాలాన్ని నిరుపయోగంగా గడిపేది కాదు.

అందం: యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె చేతిలోని విల్లు వంగి చక్రంలాగా అనిపించింది. ఆ చక్రం చంద్రుడి లాంటి సత్యభామ ముఖం చుట్టూ ఏర్పడిన కాంతి వలయం లాగా ఉంది. బాణాలు ఎక్కు పెడుతుంటే నారి దగ్గర ఉన్న చేతి వేళ్ళ గోళ్ళు మిలమిలా మెరుస్తూ ఆ కాంతులు చెక్కిళ్ళ మీద ప్రతిఫలిస్తుండేవి. నుదుటి మీద పట్టిన చెమటకి ముంగురులు అతుక్కు పోయి వింత సోయగం వెలార్చింది. నారి లాగినప్పుడు వచ్చే ధ్వని మేఘగర్జనం లాగా ఉండింది. చేతిలో ఉన్న విల్లు ఇంద్ర ధనుస్సులాగా ఉండింది. మరి, మేఘం ఏది? అంటే, నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుడే. మెరుపుతీగె ఉండాలి కదా! అది తనే.  

సమర్థత: కృష్ణుడు సొమ్మసిల్లినప్పుడు సత్యభామ విల్లు అందుకుని యుద్ధానికి సిద్ధం అయింది. భర్తకి ముందువైపుగా నిలబడింది. అంటే శత్రువు వేసే ఆయుధం ఏదీ తనని దాటి భర్త మీదికి వెళ్లకుండా అడ్డుగా ఉండటానికి. జడని అడ్డురాకుండా గట్టిగా ముడి వేసింది. చీర ముడి గట్టిగా బిగించింది. పమిటని చేతితోలాగి నడుముకు చుట్టి పక్కకి దోపింది. నగలు యథాప్రకారం మెరిసిపోతున్నాయి. ఒక కాలు ముందుకి సాచింది. ఎడమ చేతితో విల్లు పిడి పట్టుకుని కుడి చేతితో నారికి బాణం సంధించింది. శత్రు సైన్యాన్ని బాణాల వర్షంలో ముంచేసింది.

సంభాషణ చాతుర్యం: సత్యభామలో సంభాషణ చాతుర్యానికి అద్దం పట్టే సంఘటన యుద్ధానికి వెళ్లేటప్పుడు కృష్ణుడిని ఒప్పించడంలోనే కనిపిస్తుంది. ‘నీవు ఎంత బాగా యుద్ధం చేస్తున్నావో చూసి, ఆ సంగతిని అందరికీ చెపుతాను’ అంటుంది.

అలంకారప్రియత్వం: ఆమెకు లలిత కళలంటే ఎంతిష్టమో అలంకరించుకోవడం కూడా అంతే ఇష్టం. యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా ఒంటి నిండా నగలను అలంకరించుకుంది.

సున్నిత మనస్కురాలు: సత్యభామ అటు నరకుడి మీదకు బాణాలు వేస్తోంది. ఇటు కృష్ణుడు ఎట్లా ఉన్నాడోనని చూస్తోంది. అటు శత్రువు మీద వాడి బాణాలు. ఇటు భర్తవైపు ప్రేమపూర్వక దృక్కులు. అటువైపు చూపులో కోపం. ఇటువైపు చూపులో ప్రేమ, అనురాగం కనిపిస్తాయి. యుద్ధం చేస్తున్నా మనసులో కృష్ణుడికి ఎలా ఉందోననే ఆందోళన కనిపిస్తుంది ఆమె కళ్లలో.

సద్గుణాలు: కృష్ణుడు వెళ్తున్నది ఒక క్రూరుడిని సంహరించడానికని తెలుసు. అతడు మరణించకపోతే భూమ్మీద ప్రాణికోటి మనుగడ కష్టమని తెలుసు. అందుకే లోకకల్యాణం కోసం దుష్ట సంహారానికి వెళ్లడానికి కృష్ణుడిని అనుమతిస్తుంది. అలాగే భర్త ఒక్కడే యుద్ధానికి వెళ్తున్నాడంటే మనసు తట్టుకోలేకపోతుంది. పట్టుపట్టి తానూ వెళ్తుంది. ఆమె మూర్తీభవించిన స్త్రీత్వం. 

సత్యభామ యుద్ధం చేసినంత సేపు విశ్రాంతి తీసుకున్న కృష్ణుడు ఆనక విల్లు తను తీసుకున్నాడు. నరకుణ్ణి సంహరించాడు. గత జన్మలో (భూదేవి)తన కుమారుడు ఈ జన్మలో తన కళ్ల ముందు చనిపోతుంటే, మిగిలిన బిడ్డలు సుఖంగా ఉంటారని మనసుకు సర్ది చెప్పుకున్న మాతృమూర్తి.



మూలగ్రంథాల్లో లేని పాదతాడనం
శ్రీకృష్ణుణ్ణి పాదతాడనంతో సత్కరించటం, పుణ్యకవ్రతం, రుక్మిణీదేవి తులసిదళంతో కృష్ణుణ్ణి తూచి సత్యభామ అహంకారాన్ని మట్టుబెట్టటం వంటివి శ్రీమద్భాగవతంలో కాని, హరివంశంలో కానీ లేవు. కానీ అవి సత్యభామ మనస్తత్వానికి తగినట్టుగా ఉండటంతో బాగా ప్రాచుర్యం పొందాయి. కూచిపూడి భాగవతుల కారణంగా సత్యభామలేఖ, నందితిమ్మన పారిజాతాపహరణ కావ్యం పుణ్యమా అని శ్రీకృష్ణుడికి పాదతాడన వంటి బహుమానాలు లోకంలో వ్యాప్తి చెందాయి. నిజానికి సత్యభామ స్వాభిమానం ఉన్న స్త్రీ. ధీరత్వానికి ప్రతీక.

– డా. ఎన్‌.అనంతలక్ష్మి

Advertisement
Advertisement