అమ్మ ఒడి... గర్భ గుడి! | Sakshi
Sakshi News home page

అమ్మ ఒడి... గర్భ గుడి!

Published Sun, Dec 4 2016 12:54 AM

అమ్మ ఒడి... గర్భ గుడి!

పరమేశ్వరుడు కంటికికనబడడు. అంతటా నిండిపోయిన పరమాత్మ ఎప్పుడో అనుగ్రహించాలనుకున్నప్పుడు మాంస నేత్రాలతో దర్శించడానికి యోగ్యమైన రీతిలో ఎక్కడో, ఎప్పుడో భూమి మీదకు దిగివస్తాడు. అప్పుడు దర్శించవచ్చు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుణ్ణీ, ద్వాపరయుగంలో కృష్ణ భగవానుడినీ దర్శించారు. అది అన్నివేళలా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఏమీ తెలియని పసికూన దగ్గర్నుంచీ, వృద్ధులు, జ్ఞాని వరకు నమస్కరించడానికి యోగ్యమైనదీ, ఉద్ధరణకు హేతువైనదీ, కంటి ముందు మాంసనేత్రాలతో దర్శించడానికి యోగ్యమైనదీ, భూమిపై తనతో పాటు తిరుగుతున్న పరబ్రహ్మ స్వరూపం - అమ్మ మాత్రమే!

ఆమె పరబ్రహ్మ స్వరూపిణి ఎలా అయింది? ఎక్కడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త... మూడూ కలిసిన రూపంగా భాసిస్తుందో దాన్ని ‘పరబ్రహ్మ స్వరూపం’ అంటాం. ఆ పరబ్రహ్మ - సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, దాన్ని నిలబెట్టినప్పుడు, పోషించినప్పుడు స్థితికర్తయైన శ్రీమహావిష్ణువుగా, లయం చేసినప్పుడు మహేశ్వర స్వరూపంగా నిలబడుతుంది. ఎవరిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు - ముగ్గురూ కలిసి ప్రచోదనం అవుతారో, ఆ ముగ్గురూ కలిసి ఒక ముద్దరూపంగా కళ్ళ ముందు కనబడతారో దాన్నే ‘పరబ్రహ్మ స్వరూపం’ అని పిలుస్తాం. మానవధర్మంలోని గొప్పతనం ఏమిటంటే- దేవతా స్వరూపాలలో చాలావాటిని మనం పరబ్రహ్మ స్వరూపాలుగా కీర్తిస్తాం.

ప్రత్యక్షంగా కంటితో దర్శనం చేయడానికి యోగ్యమైన పరబ్రహ్మ స్వరూపాలలో ఒకటి- సూర్యనారాయణమూర్తి. ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల సమాహార స్వరూపమై ఉంటాడు. ‘ఆదిత్య హృదయం’లో దాన్నే వాల్మీకి మహర్షి చక్కగా వర్ణన చేస్తాడు. తిక్కన సోమయాజి కూడా ‘మహాభారతం’లో ‘‘హరిహర బ్రహ్మ’’ అంటాడు. ‘‘సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త... ముగ్గురూ కలిసినప్పుడు ఏర్పడిన ముద్ద... మాంస నేత్రాలకు గోచరమై, తూర్పు దిక్కున ప్రకాశిస్తున్నది. అదే పరబ్రహ్మం’’ అన్నాడు.

అలాంటి పరబ్రహ్మ స్వరూపం అమ్మ. అమ్మే దేవతా స్వరూపం, ఉద్ధరణ హేతువు. ఏ కారణంతో అమ్మకు ‘మాతృదేవోభవ’ అని తొలి వందనం చేయించింది వేదం?

అమ్మ సృష్టికర్త. అమ్మలేని నాడు సృష్టి జరగదు. సృష్టి జరిగిందీ అంటే అమ్మ ఉన్నది అని గుర్తు. అసలు ఈ సమస్త భువనాలలో సృష్టి జరగడానికి అనువైన శరీర నిర్మాణాన్నీ , అమరికనూ ఈశ్వరుడు ఒక్క స్త్రీస్వరూపంలోనే ఏర్పాటు చేశాడు. ఆమె లేని నాడు, అటువంటి అవయవాల సంఘాతం లేనినాడు, అసలు ఈ సృష్టి జరగడం కానీ, నిలబడడం కానీ కుదరదు. సృష్టికర్త అయిన బ్రహ్మ అంశ స్త్రీలో ప్రచోదనమై ఉంటుంది. అమ్మ శరీరం గురించి ‘భాగవతం’లో ‘కపిల గీత’ చదివితే అవగతమవుతుంది.

బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు తనువు, కరణం, భువనం, భోగం నాలుగిం టిని దృష్టిలో పెట్టుకుంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘తనువు’ అంటే శరీరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ శరీరం ఏర్పడినప్పుడు మనుష్యుడు బుద్ధితో శాస్త్రాన్ని తెలుసుకుంటాడు. గురువు గారి పాదాలు పట్టుకుని, ఈ జన్మలో మంచి కార్యాలు చేసి చిత్తశుద్ధి పొంది, జ్ఞానానికి యోగ్యత పొందుతాడు. మళ్ళీ జ్ఞానంతో పుట్టాల్సిన అవసరంలేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందడానికి కావలసిన ఊర్ధ్వముఖ చలనం చేయగలిగిన మనుష్య ఉపాధిని నిర్మాణం చేయాలంటే - అది అమ్మ కడుపులోనే చేయాలి.

పుట్టినప్పుడు భూమికి అడ్డంగా ఉండాలి వెన్నుపాము. పెరుగుతున్నప్పుడు నిలువుగా పెరగాలి. అలాంటి ప్రాణిని తయారు చేయాలన్నా అమ్మ కడుపులోనే! ఏమీ చేత కాక అసలు కర్మాధికారం లేకుండా, బుద్ధి లేకుండా గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాల్ని అనుభవించడానికే పనికొచ్చే శరీరం తయారుచేయాలన్నా - అమ్మ కడుపులోనే తయారుచేయాలి. అంటే బ్రహ్మ సృష్టికర్తగా శరీరాన్ని ఇవ్వాలనుకున్నా, అది తయారు కావలసింది - అమ్మ గర్భాలయంలో కనుకనే శాస్త్రం అమ్మకు ప్రాధాన్యమిచ్చింది.

ఈశ్వరుడు ఈ శరీరాన్ని దయామయుడై అనుగ్రహించాడు. నీ పాపాలు పోగొట్టుకో. మనస్సు, వాక్కు, శరీరం తో పాపం చేశావు. ఇప్పుడా మూడింటితో పుణ్యం చేసుకో. అందుకే శరీరాన్నిచ్చాడు. దీనితో దేవాలయాన్ని కడుగు! తల్లికి, తండ్రికి నమస్కారం పెట్టుకో! గురువుకు ప్రదక్షిణం చేసుకో! పరులకి ఉపకారం చేస్తుండు! మన స్సులో ఉత్తమభావాలతో ఉండు! ఇతరుల్ని తక్కువగా చూడకు! వారి హితం కోరుకో! మనస్సును సంస్కరించుకో!!

 

Advertisement
Advertisement