మైక్రోస్లీప్అంటే? | Sakshi
Sakshi News home page

మైక్రోస్లీప్ అంటే?

Published Wed, Sep 14 2016 11:47 PM

మైక్రోస్లీప్అంటే?

ఇదొక పెద్ద సమస్య. కొంతమంది రాత్రంతా ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. కానీ ఒక్కోసారి ఎంత వద్దనుకున్నా, ఎంతెంత దూరం ఉంచాలనుకున్నా తమకు తెలియకుండానే కునుకులోకి జారిపోతారు. ఇదెంతో ప్రమాదకరమైన పరిస్థితి. ఒక్కోసారి వ్యక్తులు తీవ్రంగా అలసిపోయి ఉన్నప్పుడు అకస్మాత్తుగా నిద్రమబ్బు కమ్మేస్తుంది. మాగన్ను పడుతుంది.

దీన్నే ‘మైక్రోస్లీప్’ అంటారు. ఇదెంతో ప్రమాదకరం. ఇక ‘డిజానియా’ అనే మరో పరిస్థితి ఉంది. ఈ కండిషన్ ఉన్నవారు ఉదయం ఎంతగా ప్రయత్నించినా నిద్రనుంచి చురుగ్గా లేవలేకపోతుంటారు. ఇలాంటి లక్షణం కనిపిస్తే అది వారు తినే ఆహారంలో లోపాల వల్ల కావచ్చు లేదా డిప్రెషన్ వల్ల అయి ఉండవచ్చు. ఇలాంటి వారు డాక్టర్‌ను సంప్రదించి, తగిన కారణాన్ని తెలుసుకొని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

⇒  కావాలనుకున్నప్పుడు నిద్రపట్టేందుకు... పలగలంతా చురుగ్గా మెలకువతోనే ఉండేందుకు, డ్రైవింగ్ వంటి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితుల్లో నిద్రలోకి జారిపోకుండా ఉండేందుకు చేయాల్సినవి...

⇒  వేళకు నిద్రపోయేలా నిర్ణీత సమయానికి పడక మీదికి చేరుకోండి. అది వీకెండ్ అయినా, మీ సెలవు రోజైనా సరే ఈ నియమం తప్పకండి.

⇒  పగటివేళ ఎంతమాత్రమూ నిద్రపోవద్దు. ఒకవేళ పవర్‌న్యాప్ అంటూ నిద్రించినా... ఆ వ్యవధి 30 నిమిషాలకు మించకుండా చూసుకోండి.

⇒  మీ కంప్యూటర్ స్క్రీన్‌ను, మీ టీవీ స్క్రీన్‌ను నిద్రపోవాలనుకున్న గంట ముందే ఆఫ్ చేయండి.

⇒  రాత్రివేళ నిద్ర సమయానికి కనీసం రెండు గంటలకు ముందే భోజనం పూర్తి చేయండి. రాత్రివేళ కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం ఏమాత్రమూ తీసుకోకండి.

⇒  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది మీకు గాఢంగా నిద్రపట్టేలా చేస్తుంది. రోజూ కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయండి.

శ్వాసవ్యాయామాలు, యోగా వంటవి మీ ఒత్తిడిని తగ్గించి, మీకు రిలీఫ్ వచ్చేలా చేస్తాయి. మంచి నిద్రపట్టేలా చూస్తాయి.

ఒకవేళ నిద్ర సమయంలోనే మీకు అద్భుతమనిపించే ఆలోచనలు వస్తే... వెంటనే వాటిని ఏదైనా నోట్‌బుక్‌లో నోట్ చేసుకోండి. ఆ తర్వాత వెంటనే ప్రశాంతంగా నిద్రపోండి. మిగతా ఆలోచనలను ఉదయం వేళకు వాయిదా వేయండి. మీకు అద్భుతం అనిపించిన ఆలోచన ఆ తర్వాత కూడా తడుతుంది కదా అని దాన్ని వాయిదా వేయవద్దు. సాధారణంగా ఆ ఆలోచనలు మళ్లీ తట్టకపోవచ్చు. ఇలా నోట్ చేసుకోవడం మీకు ప్రశాంతతనిస్తుంది. ఆలోచన పదిలం అయ్యింది కదా అనే భరోసాతో మీకు మంచి నిద్ర పడుతుంది.

నిద్రమాత్రలను డాక్టర్ సలహా లేకుండా వాడకండి. అవి నిద్రలేమి పరిస్థితిని మరింత తీవ్రం చేయవచ్చు.

నిద్ర అనేది మీ సంపూర్ణ ఆరోగ్యానికి ఒక మంచి సూచన. అది ఎలా పడుతుందన్న అంశం మీ కూడా ఆరోగ్యానికి ఒక సూచనే. అయితే నిద్ర తగ్గింది కదా అనే ఆలోచనతో ఆరోగ్యం మందగించిందనే భావన వద్దు. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర తగ్గడం చాలా సాధారణంగా జరిగేదే. కాబట్టి నిద్ర తగ్గింది కదా అని మళ్లీ అనవసరంగా దిగులు పడవద్దు.

Advertisement
Advertisement