నిర్ణయానికి నిలబడతారా? | Sakshi
Sakshi News home page

నిర్ణయానికి నిలబడతారా?

Published Mon, Jan 4 2016 11:49 PM

నిర్ణయానికి నిలబడతారా? - Sakshi

న్యూ ఇయర్ హడావుడి ముగిసిపోయినా తీర్మానాల హడావుడి మాత్రం మరో వారం పదిరోజులు కొనసాగుతుంది. భీషణ తీర్మానాలు తీసుకున్న వారందరూ... అడిగినా, అడగకున్నా తమకు తారసపడిన వారందరికీ తమ తీర్మానాల గురించి  ఏకరువు పెడుతూనే  ఉంటారు.
 
న్యూ ఇయర్ అంటే మందు విందు చిందుల కాలం. సందడీ సంబరాల కాలం. కుర్రకారు కేరింతల జోరు హుషారు కాలం. న్యూ ఇయర్ అంటే హ్యాపీ హ్యాపీ గ్రీటింగుల కాలం. అంతేనా? న్యూ ఇయర్ అంటే తీర్మానాల కాలం కూడా! చట్టసభల్లోని పెద్దలు ఎప్పుడు పడితే అప్పుడు తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ల తీర్మానాల దెబ్బకు జనాల జీవితాలే మారిపోతాయి. ఎప్పుడు పడితే అప్పుడు వారం వర్జ్యం లేకుండా ఎడాపెడా తీర్మానాలు తీసుకోవడానికి సామాన్యులేమీ శాసనకర్తలు కాదు కదా! దయగల ప్రభుత్వాల చలవ వల్ల జీవితాల్లో సంభవించిన మార్పులు సరే, తమ జీవితాలను తామే మార్చుకోవాలన్న ఉబలాటమూ సామాన్య ప్రజానీకంలో కొందరికి ఉండకపోదు. అలాంటి పరివర్తనాభిలాషులకు న్యూ ఇయర్ ఒక మహత్తర సందర్భం. న్యూ ఇయర్ సందర్భంగా తీసుకోదలచిన భీషణ తీర్మానాలపై కొందరు అత్యుత్సాహులు క్రిస్మస్‌కు ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.
   
న్యూ ఇయర్ వేడుకల్లో ‘మందు’మార్బలాలతో మిత్రబృందమంతా కొలువు తీరిన వేళ... నెమ్మది నెమ్మదిగా ఎండిన గొంతుల దప్పిక తీరుతుండగా ‘జీరో అవర్’ పుణ్యకాలం ఆసన్నమవుతుంది. ‘హ్యాపీ న్యూ ఇయర్’ బృందగానంతో పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. బృందగానం ఇంకా పూర్తికాక ముందే బృందంలో ఒక ‘మందు’భాగ్యుడు సగం తాగిన గ్లాసును ఠపీమని టేబుల్ మీద పెట్టేసి చేతులు కట్టేసుకుంటాడు. ‘కొత్త సంవత్సరంలో మందు ముట్టనే ముట్టను’ అంటూ తన దారుణ భీకర తీర్మానాన్ని బహిరంగంగా ప్రకటిస్తాడు. బృందంలోని మిగిలిన వాళ్లందరికీ అప్పటి వరకు తలకెక్కిన కిక్కు ఒక్కసారిగా దిగిపోతుంది. నిరంతరం ‘మందేమాతరం’ అని నినదించే డోసుభక్తుడికి ఉన్నట్టుండి ఏమైందబ్బా! అని జుట్టు పీక్కుని మరీ ఆలోచిస్తారు. ‘ఇప్పటి వరకు మాతో కలసి తాగుతూనే ఉన్నావు కదరా?’ అప్పటికి కాస్త తేరుకున్న సందేహాల్రావు గ్లాసెత్తి నిలదీస్తాడు. ‘ఠాఠ్... అదంతా పాత ఏడాది ముచ్చట. కొత్త సంవత్సరంలో మందు ముట్టనే ముట్టను’ తన తీర్మానాన్ని పునరుద్ఘాటిస్తాడు ‘మందు’భాగ్యుడు.
   
మందు మానేయడమే ఘన తీర్మానం కాదు, కొందరు సిగరెట్లను, చీట్ల పేకాటలనూ మానేయడానికి కూడా చాలామంది న్యూ ఇయర్ శుభముహూర్తాన్నే ఎంచుకుంటారు. ఇదే సందర్భాన కొందరు అప్పారావులు అప్పులు చేయడం మానేస్తున్నట్లు ప్రకటించి రుణదాతలకు గుండెపోటు తెప్పించేటంత పని చేస్తారు.  కొత్త ఏడాది అడుగుపెట్టడమే తడవుగా నిక్కర్లేసుకునే బుడ్డోళ్ల నుంచి మూడుకాళ్ల ముదుసళ్ల వరకు ఎవరికి వారు తమకు తోచిన తీర్మానాలు తీసేసుకుంటారు. అప్పటి వరకు పెంకిఘటాలుగా తిరిగే పిల్లకాయలు బడికి డుమ్మాకొట్టడం మానేస్తామని పుస్తకాల మీద ఒట్టేసి మరీ తీర్మానించేసుకుంటారు. అమ్మాయిలకు లైనేయడం మానేస్తామని కాలేజీ కుర్రాళ్లు ఎవరి మీదా ఒట్టేయకుండానే తీర్మానం తీసుకుంటారు. ఇక నుంచైనా జిహ్వచాపల్యాన్ని మానుకోవాలని ఇప్పటికే సుగర్, బీపీలతో బాధపడుతున్న సీనియర్ సిటిజన్లు తీర్మానించేసుకుంటారు. న్యూ ఇయర్ హడావుడి ముగిసిపోయినా, తీర్మానాల హడావుడి మాత్రం మరో వారం పదిరోజులు కొనసాగుతుంది.

ఇలాంటి భీషణ తీర్మానాలు తీసుకున్న వారందరూ... అడిగినా, అడగకున్నా తమకు తారసపడిన వారందరికీ తమ తీర్మానాల గురించి ఏకరువు పెడుతూనే ఉంటారు. కాలం గడిచే కొద్దీ నెమ్మదిగా ఈ సందడి సద్దుమణుగుతుంది. తీర్మానాల బలమూ నెమ్మదిగా సడలడం మొదలవుతుంది. ఏదో ఒక శుభసాయంత్రవేళ డోసుభక్తుడికి పాతనినాదం గుర్తుకొస్తుంది. నెల రెండోవారానికే జేబులు ఖాళీ చేసుకున్న అప్పారావులకు త‘రుణో’పాయాల ఆలోచన రేగుతుంది. నిత్యాగ్నిహోత్రావధానులకు మంచుకురిసే వేళలో శ్వేతకాష్టాన్ని రగిలించాలన్న కోరిక దహించడం మొదలవుతుంది. పేకాట పాపారావుకు చీట్లపేక కనిపించగానే చేతులు పీకడం ప్రారంభమవుతుంది. నెమ్మదిగా ఎవరికి వారే ఒట్టు తీసి గట్టున పెట్టి పాత పంథాలో పడిపోతారు. ప్రపంచంలో ఇలాంటి వాళ్లే ఎక్కువ. న్యూ ఇయర్ తీర్మానాలను దాదాపు 92 శాతం మంది మధ్యలోనే వదిలేస్తున్నారని, మిగిలిన 8 శాతం జనాలు మాత్రమే కడవరకు వాటికి కట్టుబడి ఉంటున్నారని స్క్రాన్‌టన్ వర్సిటీకి చెందిన మానసిక వైద్యశాస్త్ర నిపుణులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
 - పన్యాల జగన్నాథ దాసు
 
సంకల్పబలం పదిరెట్లు ఉండాలి
చెడును వదిలేసి, మంచిమార్గం పట్టడానికి ఒక లక్ష్యం, ఒక గమ్యం కావాలి. అందుకే చాలామంది తమ చెడు అలవాట్లను వదిలేయడానికి ఏడాదిలో చివరి రోజైన డిసెంబర్ 31ని ఎంచుకుంటారు. కొత్త ఏడాది మొదలైన నాటి నుంచి చెడు అలవాట్ల జోలికి పోకుండా ఉండాలని తీర్మానించుకుంటారు. ఆ సమయానికి వారి సంకల్పబలం క్షణికమైనదే. కొంతకాలానికే మానసికంగా పట్టుసడలి తిరిగి పాతబాట పడతారు. చెడును వదిలేసి మంచి మార్గం పట్టడానికి తీర్మానాలు తీసుకోవడం మంచిదే గానీ, తీర్మానాలు తీసుకునే వారు ముందు వాటి సాధ్యాసాధ్యాలను, తమ మానసిక బలాబలాలను బేరీజు వేసుకోవాలి. స్వల్పకాలికంగా సాధ్యమయ్యే లక్ష్యాలను పెట్టుకుని, వాటిని సాధించే దిశగా కృషి చేయాలి. వాటిని సాధించాక, సమకూరిన ఆత్మవిశ్వాసంతో క్రమ క్రమంగా దీర్ఘకాలిక లక్ష్యాలను పెంచుకుంటూ పోవాలి. ఇలా చేయడానికి మామూలు కంటే పదిరెట్లు ఎక్కువగా సంకల్పబలం ఉండాలి. సాధ్యాసాధ్యాలను, మానసిక బలాబలాలను బేరేజీ వేసుకోకుండా క్షణిక భావోద్వేగాలతో వ్యసనాలను వదిలేస్తామంటూ తీసుకునే తీర్మానాలను నిలబెట్టుకోవడం  తేలిక కాదు. అందుకే చాలామంది న్యూ ఇయర్ తీర్మానాలను చివరి వరకు నిలబెట్టుకోలేకపోతారు.
- డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
 

Advertisement
Advertisement