దారిచూపే ఫుట్‌పాత్ స్కూల్! | Sakshi
Sakshi News home page

దారిచూపే ఫుట్‌పాత్ స్కూల్!

Published Mon, Apr 14 2014 10:56 PM

దారిచూపే ఫుట్‌పాత్ స్కూల్!

 స్ఫూర్తి
 ‘‘కమలేష్‌కు పిచ్చిగాని పట్టలేదు కదా?!’’
 ‘‘నాకూ అలాగే అనిపిస్తోంది’’
 ‘‘ఉన్న వ్యాపారమేదో చేసుకోక... ఏమిటీ పని?’’

 పది సంవత్సరాల క్రితం అహ్మదాబాద్(గుజరాత్)లోని భూదర్‌పురాలో...సరిగ్గా ఇలాంటి మాటలే వినిపించాయి. దీనికి కారణం కమలేష్ పర్మర్ స్కూల్ పెట్టాలనుకోవడం, అది కూడా ఫుట్‌పాత్ మీద!
 
నిజానికి, కమలేష్ తన వ్యాపారమేదో తాను చేసుకునే రకమే. అయితే ఒక చిన్న సంఘటన అతనిలో మార్పు తీసుకువచ్చింది. ఒకరోజు తన కొడుకును స్కూలు నుంచి తీసుకునిఒక మురికివాడ మీదుగా వస్తుండగా కొందరు పిల్లలు కనిపించారు. వాళ్లతో కమలేష్‌కు మాట్లాడాలనిపించింది.
 
 ‘‘ఏరా... చదువుకుంటున్నారా?’’ అని అడిగాడు.
 ‘‘చదువుకుంటున్నాం’’ అని స్కూలు పేరు కూడా చెప్పారు.

 
ఎలా చదువుతున్నారో తెలుసుకోవడానికి ఆ పిల్లలను చిన్న చిన్న ప్రశ్నలు అడిగాడు కమలేశ్. ఒక్కరూ ఒక్క సమాధానం చెప్పలేదు. స్కూలుకు వెళుతున్నారనే మాటేగానీ... వారికి ఏమీ తెలియదనే విషయం ఆయనకు అర్థమైంది. మనసుకు బాధ కలిగింది.
 
పిల్లాడిని రోజూ స్కూలు నుంచి తీసుకువచ్చే క్రమంలో మురికివాడలో తప్పనిసరిగా ఆగేవాడు. స్కూల్లో ఏం చెబుతున్నారు? ఇంట్లో ఎంత సమయం చదువుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో అడిగేవాడు. ‘‘ఈయనకు పెద్దగా పనేమీ లేనట్లు ఉంది’’ అనుకునేవాళ్లు ఆ పిల్లల తల్లిదండ్రులు.
 
ఇంటికొచ్చి భోజనం చేస్తున్నప్పుడు అతనిలో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. తింటూనే ఆలోచించడం మొదలుపెట్టాడు. ‘అవును. నేను ఆ పిల్లల కోసం స్కూలు ఒకటి మొదలు పెట్టాలి’ అనుకున్నాడు. తాను పెద్దగా చదువుకోలేదు. బోధన చేసిన పూర్వానుభవం కూడా లేదు. కానీ ఒక మంచి ఆలోచన ముందు దారులన్నీ తమకు తాము తెరుచుకుంటాయి కదా! బ్లాక్‌బోర్డు, చాక్‌పీసులు కొనగలడు. మరి స్థలం సంగతి? స్థలం అద్దెకు తీసుకొని స్కూలు నడిపేంత స్థోమత తనకెక్కడ ఉంది? అప్పుడు అతని దృష్టి ఫుట్‌పాత్ మీద పడింది.
 
‘ఫుట్‌పాత్ స్కూలు’ అన్నాడు కాస్త గట్టిగానే. దేవతలు తథాస్తు అనే ఉంటారు. మురికివాడల్లోకి వెళ్లి తన ఆలోచన గురించి చెప్పినప్పుడు పిల్లల తల్లిదండ్రులు వింతగా చూశారు. ‘‘గవర్నమెంట్ స్కూళ్లలోనే చదువు సరిగ్గా చెప్పడం లేదు. మీరేం చెబుతారు’’ అన్నారు ఒకరిద్దరు. వాళ్లను ఒప్పించడం తలకు మించిన భారం అయింది. ఎట్టకేలకు తమ పిల్లలను బడికి పంపించడానికి ఒప్పుకున్నారు.

‘‘మా వాడికి ఒక్క ముక్క చదువు రాదయ్యా... మీ స్కూల్లో చేర్పించుకొని వాడిని దారిలో పెట్టండి’’ అనేవాళ్ల సంఖ్య పెరుగుతూ పోయింది. ‘‘కమలేష్ సార్ అందరికీ అర్థమయ్యేలా చక్కగా పాఠం చెబుతారు. గతంలో వేరే స్కూలులో చదువుకున్నాను. అప్పుడు స్కూలుకు వెళ్లాలంటే భయగా ఉండేది. ఇప్పుడు మాత్రం సంతోషంగా ఉంది’’ అంటున్నాడు ఏడు సంవత్సరాల యశ్ పర్మర్.
 
విశేషం ఏమిటంటే, గతంలో కమలేష్ దగ్గర చదువుకున్న విద్యార్థులలో కొందరు వీలు చేసుకొని ఈ ఫుట్‌పాత్ స్కూల్‌లో పాఠాలు బోధిస్తున్నారు. ‘‘ఆయన గురించి ఏం చేయడానికి అయినా సిద్ధమే’’ అంటున్నాడు త్వరలో డిగ్రీ పట్టా పుచ్చుకోనున్న జ్యోతినాథ్ వాఘేలా.
 
‘‘ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఆయన పేద పిల్లల కోసం పాటు పాడుతున్నాడు. ఆయన ఎప్పుడూ అడిగిన నా స్థాయిలో ఆర్థిక సాయం చేయడానికి సిద్ధం’’ అంటున్నారు తులసీరామ్ అనే చిరువ్యాపారి. కమేలేష్ ఒక్కడుగా మొదలు పెట్టిన పనికి ఇప్పుడు అనేక చేతులు తోడయ్యాయి. అరవై ఏడు సంవత్సరాల ఈ పెద్దాయన కోరుకున్నది కూడా అదే!

Advertisement
Advertisement