నీ రంగే... బంగారం! | Sakshi
Sakshi News home page

నీ రంగే... బంగారం!

Published Fri, Aug 26 2016 11:33 PM

నీ రంగే... బంగారం!

కార్టికో స్టెరాయిడ్స్ ఉన్న లేపనాల్ని డాక్టర్ల సిఫార్సు లేకుండా విక్రయించరాదని సిఫార్సు చేయాల్సిందిగా తాజాగా ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్, వెనీరాలజిస్ట్స్ అండ్ లెప్రాలజిస్ట్స్’ బృందం కేంద్ర ఆరోగ్యశాఖకు పిటిషన్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయాన్ని సీరియస్‌గా పరిశీలిస్తోంది. ‘కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంఘం’ (సి.డి.ఎస్.సి.ఒ) ద్వారా ఈ వ్యవహారంపై తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. దాంతో, ఇప్పుడు మన దేశంలో వేల కోట్లలో సాగుతున్న ఈ క్రీముల వ్యాపారాన్ని మళ్ళీ కళ్ళు తెరిచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మేనిఛాయను పెంచే ఫెయిర్‌నెస్ క్రీముల మార్కెట్ విలువ ఇప్పుడు మన దేశంలో ఏకంగా రూ. 3 వేల కోట్ల పై మాటే!


క్రీములతో తెల్లబడతామా?
ప్రపంచంలోని మిగిలిన దేశాల కన్నా ఆగ్నేయాసియా ప్రాంతంలో, మరీ ముఖ్యంగా మన దేశంలో ఈ ఒంటి రంగు తెల్లగా ఉండాలనే వేలంవెర్రి ఎక్కువ. నిజానికి, ఒంటికి ఎన్ని లేపనాలు పూసుకున్నా, ఒక్క పిసరంత ఛాయ మాత్రమే పెరుగుతుంది. ఎవరికైనా మన చెవి వెనక భాగం చర్మం ఏ రంగులో ఉంటుందో, అదే నిజమైన ఛాయ. ఎండలో తిరగడం వల్ల ఒంటి రంగు తగ్గితే, సన్‌స్క్రీన్స్ వాడి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, ఫలాల లాంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆ రంగు తెప్పించుకోవచ్చు.

 
నష్టం ఎక్కువే!
ఫెయిర్‌నెస్ క్రీముల్లో మెర్క్యురీ, లెడ్, నికెల్, క్రోమియమ్‌లు ఎక్కువగా ఉంటున్నాయని రెండేళ్ళ క్రితం ఢిల్లీలోని ఒక ఎన్జీవో అధ్యయనం జరిపి మరీ తేల్చింది. ఒక్క మెర్క్యురీకి మినహా మిగిలినవి ఎంత వాడాలన్న దానిపై ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ (బి.ఐ.ఎస్)లో నిర్దిష్ట పరిమితి అంటూ ఏమీ చెప్పలేదు. కొన్ని క్రీముల తయారీ సంస్థలు దాన్ని అలుసుగా తీసుకొంటున్నాయి. పైగా, ఎంత మేర ఏ రసాయనాలు ఉన్నాయనే విషయాన్ని చాలా శాతం క్రీములు చెప్పడం లేదు. ఇలాంటి క్రీముల్ని ముఖానికి పూసుకుంటే, చర్మం ఎర్రబడుతుంది. అలాగే, చర్మం శాశ్వతంగా మరీ పల్చబడిపోతుంది. అలాగే దీర్ఘకాలం ఈ రసాయన లేపనాల వాడకం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కార్టికో స్టెరాయిడ్స్ ఉన్న క్రీముల వాడకం వల్ల వచ్చే అనర్థాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ‘ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా’ సిద్ధమవుతోంది.

 
చట్టం ఏం చెబుతోంది?

నిజానికి, ఫలానా ఔషధం వాడడం ద్వారా ఫలానా ఈ జబ్బును నివారించవచ్చంటూ చెప్పకూడనివాటి జాబితాలో ‘మేని ఛాయ’ కూడా ఒకటి. 1940 నాటి ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్’ ఈ సంగతి స్పష్టంగా పేర్కొంటోంది. అంటే, ఈ మందు వాడితే ‘మీరు తెల్లగా మెరిసిపోతారు’ అంటూ చెప్పడం, ప్రకటించడం కూడని పని అన్న మాట! అయినా సరే, ఫెయిర్‌నెస్ క్రీముల పేరుతో ఇలా స్టెరాయిడ్‌ల వాడకం మన దేశంలో ఎక్కువే. అందుకే, వర్తమాన పరిస్థితులకు తగ్గట్లుగా ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్’లో ఇటీవలే చాలా మార్పులు చేశారు. త్వరలోనే చట్టాన్ని మరింత కఠినతరం చేయనున్నట్లు  ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ వెల్లడించారు.  - రెంటాల జయదేవ

 

మన దేశంలో ఎలా మొదలయ్యాయంటే...
1919లో మన దేశంలో తొలిసారిగా వాణిజ్య ఉత్పత్తి రూపంలో ‘ఆఫ్‌ఘన్ స్నో’ పేరిట ఫెయిర్‌నెస్ క్రీమ్ వచ్చింది. రాజస్థాన్‌లోని ఒక చిన్న ప్రాంతం నుంచి ముంబయ్‌కి వచ్చిన ఇ.ఎస్. పాటన్‌వాలా అనే సౌందర్య వస్తువుల వ్యాపారి దీన్ని తయారు చేశారు. ఆఫ్‌ఘనిస్తాన్‌కు చెందిన జహీర్ అనే రాజు గారికి ఆయన దేశం తాలూకు మంచును గుర్తు చేస్తుండడంతో, ఈ క్రీమ్‌కు ఆ రకం పేరు పెట్టారట!


1970ల దాకా ఒంటి రంగును బ్లీచింగ్ చేసే క్రీములే గతి. 1975లో హిందుస్తాన్ లీవర్ సంస్థ తొలిసారిగా చర్మానికి మృదువుగా తోచే క్రీమ్‌తో ముందుకొచ్చింది. మార్కెట్ లీడర్‌గా అవతరించింది. ఆర్థిక సరళీకరణ తరువాత బోలెడన్ని బ్రాండ్‌లు మార్కెట్‌లోకి దూసుకొచ్చాయి. ఒకప్పుడు మేనిఛాయ విషయాన్ని పట్టించుకోని కాస్మెటిక్ ప్రోడక్ట్ సంస్థలు కూడా మార్కెట్‌లో మనుగడ కోసం తమ ఉత్పత్తితో ఒంటి రంగు తెల్లబడుతుందని చెప్పుకోక తప్పలేదు.


సహజంగా పుట్టుకతో వచ్చిన రంగు వల్లో, మేకప్, ప్లాస్టిక్ సర్జరీల వల్ల ఇనుమడించిన అందం తోనో మెరిసిపోతున్న హిందీ సినీ తారలు సైతం ఈ క్రీముల ద్వారానే తాము ఇంతగా తెల్లగా, మెరిసిపోతున్నామంటూ యాడ్స్‌లో మెరిశారు. అప్పటి పద్మినీ కొల్హాపురీ నుంచి ఈ తరం స్టార్స్ దాకా అందరూ చేసిన ఈ ప్రచారంతో ఈ క్రీమ్‌ల వాడకం వ్యసనమైపోయింది.
 

నలుపే బంగారం!
సింగారం మాటెలా ఉన్నా, ఆరోగ్య రీత్యా నలుపే బంగారం. ఈ మాట ఎవరో పుట్టించినది కాదు. సరికొత్త అధ్యయనం తేల్చిన విషయం ఇది. నల్లరంగు చర్మం వల్ల ఒంట్లో సహజమైన వ్యాధి నిరోధక శక్తి పెరిగే సూచనలున్నాయి. అలాగే, తెల్ల చర్మం ఉన్నవాళ్ళతో పోలిస్తే, నల్ల చర్మం ఉన్నవాళ్ళకు వ్యాధుల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందట! నల్ల రంగు మేనిలో ఉండే ‘మెలనిన్’ కాస్తా వ్యాధికారక వైరస్‌లను పోరాడేందుకు శరీరంలో ఉండే సహజమైన శక్తిని పెంచుతుందట!

 

మగాళ్ళకూ అంటుకున్న రంగు!
మన దేశంలో ఈ బ్యూటీ క్రీముల వాడకందార్లలో నూటికి 30 మంది మగాళ్ళే! గడచిన పదేళ్ళలో మగాళ్ళ ప్రోడక్ట్‌లు చాలానే మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఇప్పుడు ఆడాళ్ళ మేనిఛాయ క్రీమ్‌ల మార్కెట్ కన్నా, మగాళ్ళ క్రీమ్‌ల మార్కెట్ శరవేగంగా పెరుగుతోంది.  కాస్మెటిక్ కంపెనీలు క్రీముల్లో వాడే రసాయనాల మోతాదు పెంచి, ప్రత్యేకంగా మగాళ్ళకు తయారు చేస్తుంటారు. అందువల్ల చర్మం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.

Advertisement
Advertisement