ఆ ఇద్దరు! | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు!

Published Wed, Sep 3 2014 10:37 PM

ఆ ఇద్దరు!

ఆ ప్రేమికుల  గురించి చెప్పగానే... సినిమా కథ గుర్తు రావచ్చు. ‘‘నిజజీవితంలో ఇలాంటి వారు కూడా ఉంటారా?’’ అని అనుమానం కూడా రావచ్చు. అణుమాత్రం సందేహం లేదు. ఇది నిజమైన కథ. నిజాయితీ నిండిన తిలక్, ధనల ప్రేమ, పెళ్లి కథ.

***********

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ‘నువ్వు లేకపోతే నేను బతకలేను’లాంటి భారీ డైలాగులేవీ చెప్పుకోలేదు. ‘పేద వాళ్ల కోసం బతకాలి’ అనుకున్నారు. చెన్నైకి చెందిన తిలక్, ధనలకు మొదటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు అంటే ఇష్టం. ఈ క్రమంలోనే వారి మధ్య పరిచయం పెరిగింది. స్నేహంగా మారింది.
 
ధన పెళ్లిచేసుకోవాలనుకోలేదు. కారణం...సామాజిక సేవ, వన్యప్రాణి సంరక్షణ అంటే ఆమెకు ఇష్టం. వాటికి సంబంధించిన పనుల్లో చురుగ్గా పాల్గొవాలనేది ఆమె ఆలోచన. తిలక్‌కు పెళ్లి ఆలోచన ఎప్పుడూ లేదు.  కారణం....ఆధ్యాత్మిక, సామాజిక కార్యకలాపాలలోనూ, ట్రెక్కింగ్ లాంటి సాహసిక పనుల్లో కాలం గడపాలని ఆయన ఆలోచన.
 
దేవుడు...ఈ ఇద్దరినీ చూసి నవ్వి ఉంటాడు. మంచి ఆలోచనలు ఉన్న ఈ ఇద్దరికీ పెళ్లి చేస్తే లోకానికి మేలు జరుగుతుందని కూడా అనుకొని ఉంటాడు!

***********

‘సేవై కరంగళ్’ పేరుతో పిల్లల సంక్షేమానికి సంబంధించిన రకరకాల కార్యక్రమాలను చెన్నైలో నిర్వహించేవాడు తిలక్. ‘సేవై కరంగళ్’ సంస్థ పనితీరు కూడా భిన్నంగా ఉండేది. ఎంతో కొంత సహాయం చేసి చేతులు దులుపుకోవడం కాకుండా పిల్లల చదువులు, ఆరోగ్యం...ఇలా అన్ని విషయాలలో పిల్లలతో మమేకమయ్యేది. అలాగే ‘చెన్నై ట్రెక్కింగ్ క్లబ్’ ద్వారా ఒక సహకారం కూడా తీసుకుంది సంస్థ.
 
‘చెన్నై ట్రెక్కింగ్ క్లబ్’ తరపున ఎంతో మంది ‘చిల్డ్రన్స్ హోం’లలో తమ పుట్టిన రోజు వేడుకలను జరుపుకొని పిల్లలకు కానుకలు, వారి సంక్షేమానికి విరాళాలు ఇచ్చేవారు. తమతో పాటు పిల్లలను ట్రెక్కింగ్‌కు తీసుకువెళ్లేవాళ్లు. వాళ్లలో సంతోషం నింపేవాళ్లు.
 ‘‘పిల్లలకు కావాల్సింది తిండి, బట్ట మాత్రమే కాదు. ప్రేమ, ఆత్మీయతలు కూడా’’ అని చెప్పే తిలక్ ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు.
 ఎక్కడైనా ‘చిల్డ్రన్స్ హోమ్’లు పిల్లలతో కిక్కిరిసి ఉన్నాయంటే, మరిన్ని గదుల నిర్మాణం కోసం నిధులు సేకరించి కొత్త గదులు కట్టించేవాడు.
 సేవాకార్యక్రమాలే కాకుండా పిల్లల్లో సృజనాత్మకతను తీర్చిదిద్దడానికి ‘నేవిగేటర్’ పేరుతో ఒక సంస్థను కూడా నిర్వహించాడు. ఎక్కడ... ఏ చిల్డ్రన్ హోంలో మౌలిక వసతులు సరిగా లేకపోయినా రంగంలోకి దిగి యుద్ధప్రాతిపాదికన రంగంలోకి దిగేవాడు.
 నాలుగు సంవత్సరాల కాలంలో చైల్డ్‌హోమ్, వృద్ధాశ్రమాలకు తిలక్ అందించిన సహకారం గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితాయే అవుతుంది.
 తిలక్ వ్యక్తిగత విషయానికి వస్తే, అతనేమీ సంపన్న కుటుంబం నుంచి రాలేదు. పేద కుటుంబం నుంచే వచ్చాడు. అతని హృదయం మాత్రం సంపన్నమైంది. ధన కూడా అంతే.

***********

 పెళ్లే వద్దనుకున్న ధన కాస్తా తిలక్ విశిష్ట వ్యక్తిత్వాన్ని చూసి ముచ్చటపడింది. ఒకానొక రోజు ‘‘మనం పెళ్లి చేసుకుందాం’’ అని ప్రతిపాదన పెట్టింది. ‘‘వద్దు’’ అనదగిన కారణం ఒక్కటీ అతనికి కనిపించలేదు. ఆమె ఆసక్తులు, అభిరుచులు కూడా తన లాంటివే!
 ‘‘తప్పకుండా’’ అన్నాడు సంతోషంగా.
 కానీ రెండు వైపులా కుటుంబ పెద్దలను ఒప్పించడానికి రెండు సంవత్సరాలు ఓపిక పట్టారు. ఈమధ్య కాలంలో ప్రేమికులుగా మాత్రమే ఉండిపోయారు. పెద్దలకు తమ భావాలను అర్థం చేయించే ప్రయత్నం చేయించారు తప్ప ‘ఈ పెద్దలు ఉన్నారే..’ అని అనుకోలేదు. ఓపికతో ఎదురుచూశారు. ఎట్టకేలకు పెద్దలు ఒప్పుకున్నారు.
 సాధారణంగా మనం చూసే ‘పెళ్లిళ్ళ’తో పోలిస్తే ఆ పెళ్లికి ఎక్కడా పోలిక, పొంతన లేదు. నిరాడంబరంగా  జరిగింది.
  విశేషం ఏమిటంటే ఈ పెళ్లివేడుక పేద పిల్లల చదువులకు ఉద్దేశించిన నిధుల సమీకరణకు వేదిక అయింది. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన రీతిలో వారు విరాళాలు ఇచ్చారు. పెళ్లికి ముఖ్య అతిథులుగా...చెన్నైలోని  ఎనిమిది ‘చిల్డ్రన్స్ హోమ్స్’ నుంచి పిల్లలు వచ్చారు.
 పెళ్లి పందిరిలో వధువు తన ఒడిలో కూర్చోబెట్టుకున్న ఆరు నెలల అమ్మాయి గురించి అందరూ ఆసక్తిగా ఆరా తీయడం ప్రారంభించారు. ఆ అమ్మాయి పేరు ‘థెరిసా’ హెచ్‌ఐవి సోకిన ఒక టీనేజ్ అమ్మాయికి పుట్టిన బిడ్డ. ‘థెరిసా’ను పెళ్లికి ముందే దత్తత తీసుకున్నారు ధన, తిలక్‌లు.
 ‘‘చాలా కాలం తరువాత నా మనసుకు నచ్చిన పెళ్లికి వచ్చాను. మన దేశంలో ఎందరికో స్ఫూర్తినిచ్చే పెళ్లి ఇది’’ అన్నాడు పెళ్లికి వచ్చిన ఒక అతిథి. ఇది ఆయన అభిప్రాయం మాత్రమే కాదు...పెళ్లికి వచ్చిన అందరి అభిప్రాయం.

***********

తిలక్, ధనలు కలిసికట్టుగా సేవాకార్యక్రమాలు చేస్తున్నారనేది ఒక కోణం అయితే, చాలామంది యువకులకు వీరి పెళ్లి స్ఫూర్తిగా నిలిచింది. సేవాస్పృహ ఉన్న యువకులు తిలక్-ధనల తరహాలోనే వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
తిలక్, ధనలు కలిసి ఏడడుగులు మాత్రమే వేయలేదు. చాలామందికి స్ఫూర్తినిచ్చే ఒక కొత్త అడుగు కూడా వేశారు!
 

Advertisement
Advertisement