ఆదర్శ మహిళ రైతుగా ... | Sakshi
Sakshi News home page

ఆదర్శ మహిళ రైతుగా ...

Published Sat, Feb 21 2015 11:03 PM

ఆదర్శ మహిళ రైతుగా ... - Sakshi

 మహిళారైతు  భూదేవి-6
 
పురుగుల మందు డబ్బాలు రైతు చేతులో కనిపిస్తే చాలు పంజాల విజయతో పాటు ఆమె కుటుంబ సభ్యులూ నిలువెల్లా వణకిపోతుంటారు. వారి కళ్లలో గత కాలపు విషాదం నీటి బిందువులుగా క్షణాల్లో సుడులు తిరుగుతుంది. కారణం.. కుటుంబంలో ముగ్గురు రైతులు రెండేళ్ల వ్యవధిలోనే పురుగులమందు తాగి బలవన్మరణం పాలయ్యారు. వ్యవసాయాన్నే జీవనాధారంగా బతికిన  భర్త, తండ్రి, సోదరుడు అప్పులపాలై పురుగులమందు తాగి మరణించడంతో జీవితం అంధకారమయమైంది. అయినా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా పశువుల పెండను ఎరువుగా చేసి పంటలు తీస్తూ ఆదర్శ మహిళ రైతుగా నిలిచారు విజయ.

 కరీంనగర్ జిల్లా పెద్దపల్లి డివిజన్‌లోని మంగపేట గ్రామానికి చెందిన సన్నకారు రైతు మోత్కూరి రామస్వామి తన కూతురు విజయను దగ్గరలోని మల్యాలకు చెందిన రైతు పంజాల చంద్రమౌళికి ఇచ్చి పెళ్లి జరిపించారు. పత్తి తదితర పంటలు సాగు చేసి అప్పులపాలై భర్త పొలానికి వాడే పురుగులమందే తాగి బలవన్మరణం పాలవడంతో విజయ జీవితం కష్టాలపాలైంది. తన బిడ్డ, కొడుకును గుండెలకు హత్తుకొని పుట్టింటికి వచ్చింది. అదే ఏడాది తండ్రి రామస్వామి పురుగుల మందు తాగి ప్రాణం వదిలాడు. తండ్రి సంవత్సరీకం జరుపక ముందే విజయ సోదరుడు శ్రీనివాస్ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. అటువంటి చిమ్మచీకట్లు కమ్ముకున్న దశలో విజయ మనోబలంతో పొలంలోకి ముందడుగు వేసింది. చిన్న తమ్ముడిని వెంట వేసుకొని తండ్రి మిగిల్చిన ఎకరం భూమిలో మొక్కజొన్న పంట వేసింది. పురుగుమందులకు స్వస్తి చెప్పింది. ఇంట్లో ఉన్న బర్రె పెండకు తోడుగా ఊరిలోని పశువుల పెండను సేకరించి పంటకు ఎరువుగా వేస్తోంది.

 మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ ఐదేళ్లలో అప్పును వడ్డీతో సహా తీర్చింది. తమకున్న ఎకరంతో పాటు మరో ఎకరం కౌలుకు సాగు చేస్తున్న విజయ పుట్టెడు కష్టాలను సైతం రసాయనిక విషాల్లేని వ్యవసాయంతో జయిస్తోంది. కూతుర్ని, కుమారుడిని కొండంత ఆశతో చదివిసోం్తది.
 
పంపిన వారు: కట్టా నరేంద్రాచారి,
  పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా   విజయ
 

Advertisement
Advertisement