ఈ వారం యూ ట్యూబ్ హిట్స్ | Sakshi
Sakshi News home page

ఈ వారం యూ ట్యూబ్ హిట్స్

Published Mon, Sep 21 2015 1:17 AM

YouTube hits this week

ది జంగిల్ బుక్ : ట్రైలర్

వాల్ట్ డిస్నీ పిక్చర్స్ విడుదల చేసిన ‘ది జంగిల్ బుక్ ’ చిత్రం టీజర్ ఇది. సినిమా 2016 ఏప్రిల్ 15న రిలీజ్ అవుతోంది. జాన్ ఫారో డెరైక్ట్ చేస్తున్న ఈ 3డి కామెడీ అడ్వెంచర్ ఫాంటసీ ఫిల్మ్‌కు జస్టిన్ మార్స్క్ స్క్రిప్ట్ అందించారు. 1967లో ఇదే పేరుతో డిస్నీ పిక్చర్స్ నిర్మించిన చిత్రానికి ఇది లైవ్ యాక్షన్ రీమేక్. రుడ్‌యార్డ్ కిప్లింగ్ 1894లో రాసిన ‘ది జంగిల్ బుక్’ ఈ రెండు చిత్రాలకూ ఆధారం. తాజా జంగిల్ బుక్‌లో బాల కథానాయకుడు మోగ్లీగా నీల్ సేథీ నటిస్తున్నాడు. అడవిలో తోడేళ్ల ఆలన, లాలనతో పెరుగుతున్న చిన్నారి మోగ్లీ చేసే సాహసాలే ఈ చిత్ర కథాంశం.
 
తూంగవనం : ట్రైలర్
కమలహాసన్, త్రిష నటించిన తమిళ చిత్రం ‘తూంగవనం’ ట్రైలర్ ఇది. తెలుగులో ‘చీకటి రాజ్యం’గా తయారవుతోంది. తూంగవనం అంటే స్లీప్‌లెస్ ఫారెస్ట్. విశ్రమించని అరణ్యం. 2011లో విడుదలైన ఫ్రెంచి సినిమా ‘స్లీప్‌లెస్ నైట్’కు ఇది రీమేక్. రెగ్యులర్ సినిమాల్లోని రొమాంటిక్ సన్నివేశాలు ఇందులో ఉండవని ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ఎట్ ద సేమ్ టైమ్... చూసి తీరవలసిన సినిమా అని కూడా అనిపిస్తుంది. మాదక ద్రవ్యాల మాఫియాకు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు మధ్య సాగే పోరాటంలో కుటుంబ అనుబంధాలు ఎలా నలిగిపోతాయో ఈ చిత్రం చెబుతుంది.
 
షాందార్ : వీడియో సాంగ్
షాహిద్ కపూర్, అలియా భట్ నటించిన ‘షాందార్’ చిత్రంలోని ‘షామ్ షాందార్’ పాటను జీ మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోను చూసిన వారు సినిమా రిలీజ్ కోసం అక్టోబర్ 22 వరకు వేచి ఉండడం కాస్త కష్టమైన విషయమే. ఫుల్ జోష్‌తో సాగుతుందీ సాంగ్. డాన్స్‌లో అలియాను డామినేట్ చేశాడు షాహిద్. అమితాబ్ భట్టాచార్య రాసిన ఈ పాటను అమిత్ త్రివేదీ ఆలపించాడు. ‘షాందార్’ అంటే ఫాబ్యులస్. వెరీ గుడ్. ఎక్స్‌లెంట్ అని అర్థం. ఈ పాటను దృశ్యీకరించిన తీరులో షాందార్ అంతా కనిపిస్తుంది. సినిమాను వికాస్ బల్ డెరైక్ట్ చేస్తున్నారు.
 
లేడీ గాగా : టిల్ ఇట్ హ్యాపెన్స్ టు యు
‘ది హంటింగ్ గ్రౌండ్’ అనే డాక్యుమెంటరీ చిత్రం కోసం అమెరికన్ సింగర్ లేడీ గాగా... సహగాయని, గీత రచయిత్రి అయిన డయానే వారెన్‌తో కలిసి రాసి, పాడిన పాట ‘టిల్ ఇట్ హ్యాపెన్స్ టు యు’. క్యాంపస్ రేప్ ఇందులోని థీమ్. ఈ ఏడాది ఆరంభంలో సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్ నుంచి అనధికారికంగా ఈ సాంగ్ లీక్ అయింది. ఇప్పుడు దీనినే అధికారికం చేసి మూడు రోజుల క్రితమే ఈ సింగిల్ ట్రాక్‌ను విడుదల చేశారు. వీడియోకు, లిరిక్‌కు అసాధారణమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రతి కాలేజీ అమ్మాయి, అబ్బాయి చూసి తీరవలసిన ట్రాక్ ఇది.
 
లేడీ ఆస్ట్రాలజర్ స్లాప్స్ బాబా
టీవీ చానెల్స్‌లో డిబేట్ ప్రోగ్రామ్‌లు వేడి వేడిగా సాగుతుంటాయి. అప్పుడప్పుడు ఆ వేడి కాస్త ఎక్కువై మాటలు మితిమీరి చేతల్లోకి వెళ్లిపోతాయి. అందుకొక ఉదాహరణ ఈ వీడియో. ఐబిఎన్7 ఛానెల్‌లో ‘ఆజ్ కా ముద్దా’ (నేటి టాపిక్) అనే ఈవెనింగ్ డిబేట్ లైవ్ వస్తుంటుంది. అందులో పాల్గొన్న లేడీ ఆస్ట్రాలజర్ దీపా శర్మ నిగ్రహం కోల్పోయి, సహవాది అయిన మరో ఆస్ట్రాలజర్ ధరమ్ గురు ఓమ్ జీ మహరాజ్ చెంప పగలగొట్టారు. అయితే ఆయనేమీ రెండో చెంప చూపలేదు. దీపను తనూ చెంపదెబ్బ కొట్టారు. ఆవేళ్టి తమ భవిష్యత్తును వాళ్లిద్దరూ ఊహించలేకపోయినట్లున్నారు.
 
సత్యా నాదెళ్ల డెమో ఫెయిల్యూర్: ఫన్నీ వీడియో
మైక్రోసాఫ్ట్ రూపొందించిన పర్సనల్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్... ‘కార్టానా’ మహా తెలివైనది. అందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అడిగిన ప్రశ్నలకన్నింటికీ సమాధానాలు చెబుతుంది. కానీ ఆ కంపెనీ సీయీవో సత్యా నాదెళ్ల ప్రశ్నలనే అది సరిగా అర్థం చేసుకోలేకపోయింది! గత బుధవారం ఒక పబ్లిక్ ఈవెంట్‌లో నాదెళ్ల తన ‘కార్టానా’ను టెస్ట్ చేశారు. ‘షో మీ మై మోస్ట్ ఎట్-రిస్క్ ఆపర్చునిటీస్’ అని అడిగారు. కార్టానా కామ్‌గా ఉండిపోయింది. నాదెళ్ల మరో రెండుసార్లు క్వొశ్చన్ రిపీట్ చేశారు. నాలుగోసారి వచ్చిన ఆన్సర్ వచ్చి ఏంటో తెలుసా? టు బై మిల్క్ అని. ఇక నవ్వులే నవ్వులు.

Advertisement
Advertisement