ఈ వారం హిట్స్ | Sakshi
Sakshi News home page

ఈ వారం youtube హిట్స్

Published Sun, Jan 24 2016 11:30 PM

ఈ వారం హిట్స్

సూయిసైడల్ స్క్వాడ్ : ట్రైలర్
నిడివి : 2 ని. 31 సె.
హిట్స్ : 2,26,64,135

నాలుగు రోజుల్లో రెండు కోట్లు! పెద్ద హిట్టే. నో డౌట్.. సినిమా కూడా హిట్ అయినట్లేనని హాలీవుడ్ క్రిటిక్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న టూడీలో, త్రీ డీలో, ఐమాక్స్ త్రీడీలో విడుదల కాబోతున్న అమెరికన్ సూపర్‌హీరో ఫిల్మ్ ‘సూయిసైడల్ స్క్వాడ్’ ట్రైలర్ ఇది. కథ, దర్శకత్వం డేవిడ్ ఏయర్. డిసి కామిక్స్ ఆధారంగా ఆయన కథ అల్లుకున్నారు. కథేమిటో పూర్తిగా బయటికి రాలేదు కానీ, ప్రభుత్వ సీక్రెట్ ఏజెన్సీ ఒకటి కొంతమంది సూపర్ విలన్‌లతో ‘సూయిసైడ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి వారి ద్వారా అత్యంత ప్రమాదకరమైన పనులను చేయిస్తుంటుంది ఒక గాసిప్. వార్నర్ బ్రదర్స్ ఈ చిత్ర నిర్మాణానికి సహకారం అందిస్తున్నారు.
 
సెలెనా గోమెజ్ : హ్యాండ్స్ టు మైసెల్ఫ్
 నిడివి : 3 ని. 47 సె.
హిట్స్ : 60,85,799

అమెరికన్ సింగర్ సెలెనా గోమెజ్ రెండో స్డూడియో ఆల్బమ్ ‘రివైవల్’లోని మూడో పాట ‘హ్యాండ్స్ టు మైసెల్ఫ్’ యూట్యూబ్‌లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. అప్‌లోడ్ అయిన మూడు రోజుల్లోనే హిట్స్ అరవై లక్షలు దాటాయి. అప్‌బీట్‌లో సాగే ఈ డాన్స్, సింథ్‌పాప్.. సంగీత ప్రియులనే కాకుండా, విమర్శకులనూ ఆకట్టుకుంటోంది. ‘కాంట్ కీప్ మై హ్యాండ్స్ టు మైసెల్ఫ్.. నో మేటర్ హౌ హార్డ్ అయామ్ ట్రయింగ్..’ అంటూ పాట మొదలౌతుంది. పాప్ రూపంలోని మార్ధవ గీతం ఇది. సెలైంట్‌గా మనసును కొల్లగొడుతుంది.. సెలెనా రూపంలాగే!
 
ది ఎమోజీ ఛాలెంజ్
నిడివి : 4 ని. 30 సె.
హిట్స్ : 22,77,801

ఇదొక గెస్ గేమ్. ఆడే ఆట కాదు. చూసే ఆట. ప్యూడైపీ అనే స్వీడన్ కమెడియన్ (అసలు పేరు ఫెలిక్స్ అర్విద్ జెల్బర్గ్) తన స్నేహితురాలితో కలిసి ఆడిన ఈమోజీ ప్లే. కొన్ని ఎమోజీలను పక్కపక్కన పెట్టి వాటి అర్థాన్ని ఊహించడం ఇందులోని ఆసక్తికరమైన అంశం. కాస్త కష్టంగా, కాస్త సరదాగా, కొంచెం బ్రెయిన్ టీజర్‌గా, కొంచెం చిలిపిగా ఈ ఆట సాగిపోతుంది. 26 ఏళ్ల ప్యూడైపీ ‘లెటజ్ ప్లే’ పేరుతో యూట్యూబ్‌లో ఇలాంటి గేమ్స్ ఇంకా అనేకం అప్‌లోడ్ చేశాడు.
 
తెరె బిన్ లాడెన్ : డెడ్ ఆర్ అలైవ్ (ట్రైలర్)
నిడివి : 2 ని. 38 సె.
హిట్స్ : 15,09,907

నిజ జీవితంలో బిన్ లాడెన్‌ది సీరియస్ క్యారెక్టర్. ‘తెరె బిన్ లాడెన్-డెడ్ ఆర్ ఎలైవ్’ చిత్రంలో మాత్రం అతడిది హ్యూమరస్ క్యారెక్టర్. ఈ ట్రైలర్ చూస్తే కామెడీ ఎంత టెరిఫిక్‌గా ఉంటుందో తెలుస్తుంది! 2010లో వచ్చిన ‘తెరె బిన్ లాడెన్’కి ఈ మూవీ సీక్వెల్. చాలా వరకు అవే పాత్రలు ఉంటాయి. కానీ స్క్రీన్‌ప్లే పాత వాసనలు కనిపించవు. ఒసామా బిన్ లాడన్‌ని చంపేశామని అమెరికా చెబుతుంటే, కాదు అతడు బతికే ఉన్నాడు అనే వాదన ఒకటి మొదలౌతుంది. ఇంతకీ లాడెన్ బతికే ఉన్నాడా? చనిపోయాడా అనే పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. దర్శకత్వం అభిషేక్ శర్మ. చిత్రం విడుదల ఫిబ్రవరి 19.
 

Advertisement
Advertisement