ఆస్ట్రాలజీ జోస్యానికి కొత్త భాష్యం | Sakshi
Sakshi News home page

ఆస్ట్రాలజీ జోస్యానికి కొత్త భాష్యం

Published Tue, Feb 3 2015 1:00 AM

Astrology predictions reinterpretation

ఒకరు రిటైర్డ్ ప్రిన్సిపాల్.. ఇంకొకరు డాక్టర్.. మరొకరు ఐటీ ప్రొఫెషనల్.. ఇలా డిఫరెంట్ వృత్తుల వారంతా ఒక చోటికి చేరారు. వీరే కాదు.. ఇంకా ఎందరెందరో.. అక్కడికి చేరుకున్నారు. వారి ఉద్యోగాలే కాదు.. ఏజ్ గ్రూప్‌లు కూడా వేర్వేరే. మరి వీరందరినీ కలిపింది ఏమిటంటే.. జ్యోతిషం. అవును గ్రహగతులే వీరందరినీ ఒక్కతాటిపైకి తెచ్చాయి. అవును వీరంతా  ఆస్ట్రాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని లయన్స్ భవన్‌లో ఆదివారం జరిగిన ఆస్ట్రో సదస్సులో వీరంతా పాల్గొన్నారు.        
..:: దార్ల వెంకటేశ్వరరావు
 
ఒకప్పుడు కొందరికి మాత్రమే పరిమితమైన జ్యోతిష జ్ఞానంపై ఇప్పుడు ఎందరికో ఆసక్తి పెరుగుతోంది.  జ్యోతిషాన్ని ఉపాధిమార్గంగా ఎంచుకుని కొందరు శాస్త్రీయంగా ఈ విద్యను అభ్యసిస్తున్నారు. ఇతర వృత్తుల్లో ఉన్నవారు సైతం జ్యోతిషాన్ని ప్రవృత్తిగా స్వీకరించి.. శాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. బేసిక్స్‌తో వదిలేయకుండా.. పీహెచ్‌డీ వరకూ చేస్తున్నారు. ‘శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా.. మిడిమిడి జ్ఞానంతో గ్రహాల అనుగ్రహాన్ని, ఆగ్రహాన్ని అంచనా వేస్తూ చాలా మంది అమాయక జనం నుంచి వేలకు వేలు కొల్లగొడుతున్నారు. శాస్త్రాన్ని సబ్జెక్ట్‌లా చదివిన ఆస్ట్రాలజర్స్ అవసరం ఎంతైనా ఉంది’ అని అంటారు ఈ సదస్సుకు హాజరైన ఓ ఐటీ ప్రొఫెషనల్.
 
సీరియస్ స్టడీ..

గ్రహగతులను పక్కాగా లెక్క కడితే.. భవిష్యత్తును ఈజీగా చెప్పేయొచ్చు అంటున్నారీ పీహెచ్‌డీ విద్యార్థులు. ‘గ్రహాలు, నక్షత్రాలు మనిషి ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. జీవితంలో ప్రతి మార్పునకు ఆస్ట్రాలజీ కచ్చితమైన సమాధానం ఇవ్వగలదు. అయితే దీన్ని చాలా మంది ఆదాయ వనరుగానే భావిస్తున్నారు కాని, ఆసక్తిగా పరిశీలించడం లేదు’ అని ఐటీ ఉద్యోగి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

ఎమ్మెస్సీ మైక్రోబయోలజీ చేసిన కాత్యాయిని అందులోనే పీహెచ్‌డీ చేసింది. తెలుగు ఎంఏ కూడా చేసింది. ప్రస్తుతం మెడికల్ ఆస్ట్రాలజీలో పీహెచ్‌డీ చేస్తోంది. జ్యోతిషాన్ని సైన్స్ కోణంలో చూస్తూ నూతన ఆవిష్కరణల దిశగా ఆమె ప్రయాణిస్తున్నారు. సంతాన లేమి, ఒబెసిటీ, గర్భాశయ వ్యాధులు.. వీటికి కారణాలను ఆస్ట్రోలజీ ద్వారా కనుగొనే ప్రయత్నం చేస్తున్నారామె. ‘ నా భర్త గాంధీ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ విభాగాధిపతి. అలాగే ఆయన దగ్గరకు వచ్చిన సంచలనాత్మక కేసుల్లో కొన్ని స్టడీ చేశా. అలాంటి వారి మరణాల కారణాలను విశ్లేషించాను కూడా’ అని వివరించారు.  ఇలా చాలామంది ఔత్సాహికులు జ్యోతిషాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు.
 
ముందుగానే గుర్తించొచ్చు

సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మెడికల్ ఆస్ట్రాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నాను. అమెరికాలో పదేళ్లు  సాప్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా పనిచేశా. అక్కడ ఇండియన్, ఫారిన్ ఆస్ట్రాలజీ సంబంధాలపై కొంత పరిశోధన చేశాను. ఇప్పుడు మెడికల్ ఆస్ట్రాలజీలో నేను చేసిన కొన్ని పరిశోధనల ద్వారా క్యాన్సర్ వ్యాధి వచ్చే సంగతి ముందుగానే గుర్తించవచ్చు. దాదాపు 200 కేసుల్లో ఇది నిరూపితమైంది. ముందుగానే గుర్తించడం వల్ల వ్యాధి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
 - రఘునాథ్ సాప్ట్‌వేర్ ఇంజనీర్  (టెక్ మహీంద్రా సీనియర్ ప్రాజెక్టు మేనేజర్)
 
ఉచిత బోధన

అవగాహన లేకుండా చాలామంది జోస్యం చెప్పి లాభం కంటే నష్టం ఎక్కువ చేస్తున్నారు. ప్రతి సమస్యకు జ్యోతిషం పరిహారం చూపింది. చిన్న చిన్న రెమెడీలు కూడా చెప్పింది. దీన్ని అందరికీ పరిచయం చేసేందుకు 2000 సంవత్సరంలో జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. ఇందులో ఆస్ట్రాలజీ ఉచితంగా నేర్పిస్తాం. ఫ్లోరిడాలోని యోగ సంస్కృతం యూనివర్శిటీ 2011 సంవత్సరంలో మాకు అప్లియేషన్ ఇచ్చింది. అప్పటి నుంచి పీహెచ్‌డీ కూడా ప్రవేశపెట్టాం.
 - డాక్టర్ ఎన్‌వీఆర్‌ఏ రాజ (జేకేఆర్ ఆస్ట్రో రిసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు)

Advertisement
Advertisement