ఆమె గళానికి విజిల్స్ వినిపించాల్సిందే! | Sakshi
Sakshi News home page

ఆమె గళానికి విజిల్స్ వినిపించాల్సిందే!

Published Sat, Jun 14 2014 5:01 PM

తెలంగాణ శకుంతల - Sakshi

మహారాష్ట్రలో పుట్టారు. ఇక్కడ భాషను, యాసను సొంతం చేసుకున్నారు. ఆమె తెలంగాణ యాసలో డైలాగ్ అందుకుంటే థియోటర్స్ లో విజిల్స్ వినిపించవలసిందే. అదీ ఆమె ప్రత్యేకత. ఆ గళంలో, ఆ పలికే తీరులో అంతటి పవర్ ఉంది.   తెలంగాణని ఆమె ఇంటి పేరు చేసుకున్నారు. ఏ పాత్ర చేసినా అందులో ఇమిడిపోతారు. అటువంటి మహానటి తెలంగాణ శకుంతల(65) శాశ్వతంగా వెండితరకు దూరమైపోయారు. కొంపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. అక్కగా, అమ్మగా, బామ్మగా... శకుంతల నటన మరచిపోవటం ఎవరితరం కాదు. డైలాగులతో సంచలనం సృష్టించారు. దుమ్మురేపారు. ప్రతి పాత్రలో మెరుపులు మెరిపించారు. నటించిన ప్రతి పాత్రలో  ఆమె ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అక్కా అని పిలిచినా శెక్కూ అన్నా .. శకుంతలక్క ఇక పలకదు.  ఆమె లేకపొయినా వెండితెరపై మాత్రం ఆమె పోషించిన పాత్రలు సజీవంగానే ఉన్నాయి. ఆమె కంచుకంఠం ప్రేక్షకుల హృదయాల్లో ధ్వనిస్తూనే ఉంటుంది.  తెలుగు ప్రేక్షకుల మదిలో శకుంతల వేసిన ముద్ర చెరిగిపోదు. ఆమె వెదజల్లిన నవ్వుల పువ్వులు వసివాడిపోవు.  

1979లో మాభూమి సినిమాతో శకుంతల తెలుగు తెరకు పరిచయమయ్యారు. కానీ బ్రేక్ రావటం కోసం మాత్రం చాలా సమయం ఎదురు చూశారు. తేజ డైరెక్షన్లో వచ్చిన 'నువ్వే నువ్వే' తో విపరీతమైన క్రేజ్ సంపాదించారు. తెలంగాణ యాసలో శకుంతల చెప్పిన డైలాగ్స్ ఆటంబాంబుల్లా పేలాయి. తెలంగాణ భాషలోని పవర్ ఆమె గొంతులో అధ్బుతంగా వినిపించింది. శకుంతల తెలుగు , హిందీ, తమిల్, బోజ్‌పూరి వివిధ భాషలలో దాదాపు 250 చిత్రాలలో నటించారు. ఆమె చివరి సారిగా నటించిన రాజ్యాధికారం చిత్రం విడుదల కావలసి ఉంది. మహరాష్ట్రలో పుట్టిన  శకుంతలకు ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడు, ఒక కూతురు. నువ్వు-నేను, లక్ష్మీ చిత్రాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. మా భూమి, రంగులకల, నువ్వునేను సినిమాల ద్వారా ఆమె  నంది అవార్డులు అందుకున్నారు.

తన కెరీర్‌లో శకుంతల ఎన్నో విభిన్నమైక పాత్రలు పోషించారు. తెలంగాణ యాసతో మాట్లాడటం ఆమె ప్రత్యేకత అయినప్పటికీ అన్ని ప్రాంతాల యాసల్నీ ఆమె అవలీలగా పలికారు. అందరినీ మెప్పించారు.   ఆమో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఎంతటి నటుడైనా ఆమె ముందు ఆగరు. గుణశేఖర్ దర్శకత్వంలో ఒక్కడు చిత్రంలో ఆమె నటించిన పాత్రే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తిరుగులేని  డైలాగ్స్‌తో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా, తన నటనతో కడుపుబ్బా నవ్వించటం  శకుంతలకే చెల్లింది. కొన్ని పాత్రలతో అందరినీ అదరగొట్టినప్పటికీ, అవేరకమైన మూస పాత్రలతో విసిగించకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త అనుభూతినిచ్చారు. హాస్యంలో కూడా ఆమె తన ప్రత్యేకతను నిలుపుకున్నారు.  లక్ష్మీ చిత్రంలో శకుంతల - వేణుమాధవ్ నటించిన సన్నివేశాలు కడుపుబ్బనవ్విస్తాయి.  అందరినీ భయపెట్టే శకుంతల భయపడే పాత్ర కూడా పోషించి మెప్పించారు. ఆదివారం ఆడవాళ్లకు సెలవు సినిమాలో ఆమె ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు.
 

Advertisement
Advertisement