ఉన్నత విద్య విలవిల | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్య విలవిల

Published Sun, May 10 2015 1:35 AM

కె.రామచంద్రమూర్తి - Sakshi

 త్రికాలమ్
 ఎంసెట్ కౌన్నిలింగ్ వ్యవహారాన్ని తెగేవరకూ లాగిన ఫలితంగా సెకండ్ కౌన్సిలింగ్ లేక విద్యార్థులు నష్టపోయారు.  రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ కీచులాడుకుంటుంటే తమ భవిష్యత్తు ఏమైపోతుం దోనన్న భయంతో పొరుగు రాష్ట్రాలలోని విద్యాలయాలలో చేరిన తెలుగు విద్యార్థులు అనేకమంది. ఈ విపరిణామం చూసిన తర్వాతనైనా సిగ్గుపడి పద్ధతి మార్చుకోవలసిన రాజకీయ నాయకులూ, ఉన్నతాధికారులూ మొండి వైఖరినే కొనసాగించారు.
 
 ఒక రాష్ట్రాన్ని ఎట్లా విభజించకూడదో యూపీఏ ప్రభుత్వం ‘ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్’ ద్వారా చేసి చూపిస్తే, రాష్ట్రం చీలిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలూ ఎట్లా వ్యవహరించకూడదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలూ, కేంద్రం ఎట్లా నిర్లిప్తంగా ఉండకూడదో ఎన్‌డీఏ సర్కారూ నిరూపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో నినాదాలైన నీరూ, నిధులూ, నియామకాలు వివాదాలుగా వర్థిల్లడమే కాకుండా అనేక ఇతర అంశాలలో సైతం అగ్గి రగులుతూనే ఉంది. రెండు రాష్ట్రాల పాలకులు పరస్పరం సహకరించుకోకుండా, గౌరవించు కోకుండా, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించకుండా గట్టు పంచాయితీలు పెట్టుకొని కోర్టులకు ఎక్కి, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రజల జీవితాలను కష్టభూయిష్టం చేస్తున్నారు. గోటితో పోయే వాటిని రోకలికి కూడా లొంగకుండా చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నలిగి విపరీతంగా నష్టపోతున్నవారిలో ఏ పాపం ఎరుగని విద్యార్థులది ప్రథమస్థానం. ఉమ్మడి వ్యవస్థలుగా ఉంటూ రెండు రాష్ట్రాలకూ సేవ చేయవలసిన సంస్థలలో అన్నిటికంటే అధికంగా భ్రష్టపట్టింది ఉన్నత విద్యామండలి.

 పునర్‌వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్‌లోని 27వ అంశం ఉన్నత విద్యా మండలికి సంబంధించింది. అంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ, రెండు రాష్ట్రాల మంత్రులనూ, అధికారులనూ సంప్రదిస్తూ ఉన్నత విద్యారంగంలో ప్రమాణాలు పెంపొందించడానికి ప్రయత్నించాలి. విభజనకు పూర్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అనే పేరున్నది కనుక విభజన తర్వాత కూడా పదమూడు జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే అది జవాబుదారీగా ఉండాలనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదిస్తే లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తే సరిపోతుందనీ, తెలంగాణ ప్రభు త్వం, ప్రజలు, విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విధంగా విధిగా నడుచుకోవాలనే తప్పుడు అవగాహనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి వ్యవహరించారు.

 పేచీ మొదలయింది ఇలా...
 జగదీశ్వరరెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి హోదాలో కబురు పెడితే ఆయనను కలుసుకోవడానికి వేణుగోపాలరెడ్డి నిరాకరించినప్పుడే విభజన చట్టాన్ని అపార్థం చేసుకున్నారనీ, పెడార్థం తీస్తున్నారనీ అర్థమైపోయింది. ఇవి వేణుగోపాలరెడ్డి ఆలోచనలో లేక ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి గంటా శ్రీనివాస రావు పట్టింపో లేక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నిశ్చయమో తెలియదు కానీ తెలంగాణ మంత్రితో, తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శితో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే విశేషాధికారాలు విభజన చట్టం ఆం.ప్ర. ఉన్నత విద్యామండలికి ఇచ్చిందని చట్టాన్ని తప్పుగా అన్వయిం చుకున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వాన్ని లెక్కచేయలేదు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఒక ఉన్నత విద్యామండలిని ప్రొఫెసర్ పాపిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసింది. కనీసం ఆ మండలితో సమన్వయం చేసుకున్నా విద్యార్థులకు నష్టం జరిగేది కాదు. తెలంగాణ విద్యామండలిని గుర్తించడానికి ఆం.ప్ర. ఉన్నత విద్యామండలి నిరాకరించింది. ఎంసెట్ కౌన్నిలింగ్ వ్యవహారాన్ని తెగేవరకూ లాగిన ఫలితంగా సెకండ్ కౌన్సిలింగ్ లేక విద్యార్థులు నష్టపోయారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ కీచులాడుకుంటుంటే తమ భవిష్యత్తు ఏమైపోతుందోనన్న భయంతో పొరుగు రాష్ట్రాలలోని విద్యాలయాలలో చేరిన తెలుగు విద్యార్థులు అనేకమంది. ఈ విపరిణామం చూసిన తర్వాతనైనా సిగ్గుపడి పద్ధతి మార్చుకోవలసిన రాజకీయ నాయకులూ, ఉన్నతాధికారులూ మొండి వైఖరినే కొనసాగించారు.

 ఉన్నతాధికారుల పంపిణీ పూర్తి కాని కారణంగా, రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితుల దృష్ట్యా ఎంసెట్ కౌన్సిలింగ్ జరుపుకోవడానికి వీలుగా గడువును అక్టోబరు 31 వరకూ పొడిగించాలంటూ తెలంగాణ ప్రభు త్వం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. గతంలో సుప్రీంకోర్టు ప్రతి సంవత్సరం ఆగస్టు చివరికల్లా కౌన్సిలింగ్ పూర్తి చేసి సెప్టెంబరు మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలని తీర్పు ఇచ్చింది. ఇందుకు మినహాయింపు కావాలంటూ 2013లో ఆంధ్రప్రభుత్వం చేసిన అభ్యర్థనకు అత్యున్నత న్యాయ స్థానం అంగీకరించింది. అదే పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడం, ఆగస్టు చివరికల్లా కౌన్సిలింగ్ పూర్తి చేస్తానంటూ చెప్పడంతో సుప్రీంకోర్టు అందుకు అంగీకరించింది.

 ఇంటర్ బోర్డు ఆదర్శం
 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా రామశంకర్‌నాయక్ ఉన్న కాలంలో ఆయన రెండు ప్రాంతాల విధులనూ, నిధులనూ రాష్ట్ర విభజనకు పూర్వమే పంచారు. ఆయన దూరదృష్టి కారణంగా విభజన అనంతరం కూడా ఎటువంటి ఇబ్బందులూ, సమస్యలూ, పేచీలూ లేకుండా ఇంటర్ విద్య కొనసాగుతున్నది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం సొంతంగా ఇంటర్ బోర్డును నెలకొల్పి శైలజారామయ్యర్‌ను కార్యదర్శిగా నియమించినప్పటికీ ఉన్నత విద్య చవిచూసిన ఒడిదుడుకులు ఇంటర్ విద్యకు ఎదురుకాలేదు. రెండు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్లు రామశంకర్‌నాయక్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించాయి.

 నిధుల విషయంతోనే వివాదం ముదిరింది. ఉమ్మడి మండలి ఖాతాలో ఉన్న రూ. 120 కోట్లలో 42 శాతం వాటా ఇవ్వాలంటూ లేఖలు రాసింది. జవాబు లేదు. రోజువారీ కార్యక్రమాలు జరుపుకోవడానికి తాత్కాలికంగానైనా రెండు కోట్ల రూపాయలు కావాలంటూ అభ్యర్థించినా కుదరదంటూ సమాధానం వచ్చింది. చివరికి ఆంధ్రప్రదేశ విద్యామండలి ఖాతాను స్తంభింప జేయాలంటూ ఆంధ్రాబ్యాంకును తెలంగాణ ప్రభుత్వం కోరింది. బ్యాంకు యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. సమాధానం లేదు. ఆం.ప్ర. ఉన్నత విద్యాశాఖ మాత్రం ఇది ఉమ్మడి మండలి అనీ, దీన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుందనీ, తెలంగాణ మండలిని గుర్తించజాలమనీ సమాధానం చెప్పింది. అందువల్ల ఖాతాను స్తంభింపజేయడం సాధ్యం కాదంటూ ఆంధ్రాబ్యాంకు తెలంగాణ ప్రభుత్వానికి సమాధానం చెప్పింది. బ్యాంకులు కూడా ప్రాంతీయ ధోరణితోనే వ్యవహరించినట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు ఇదే రకమైన అభ్యర్థన తెలంగాణ ప్రభుత్వం నుంచి అందితే అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ మండలికి కానీ నోటీసులు ఇవ్వకుండానే మండలి ఖాతాను ఎస్‌బీహెచ్ స్తంభింపజేసింది. సిబ్బంది జీతాలు ఈ ఖాతా నుంచే చెల్లించాలి కనుక మండలి అధికారులు లబోదిబో అన్నారు. మరోసారి హైకోర్టుకు వెళ్లారు.

 తెలంగాణ సర్కార్ చొరవ
 తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి, అడ్వకేట్ జనరల్ సమష్టిగా వ్యవహరించి లక్ష్యం సాధిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. విద్యామంత్రికీ పట్టలేదు. మండలి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ, విద్యామంత్రి చుట్టూ తిరిగి అలసిపోయారు. అడ్వకేట్ జనరల్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని 75వ సెక్షన్ గురించీ, పదో షెడ్యూల్ గురించీ, 27వ అంశం గురించీ మాట్లాడటానికి బదులు విభజన చట్టంపై విభేదాలు వస్తే కోర్టు పరిష్కరించాలంటూ బండవాదనకు పరిమితమైనారు. ఆం.ప్ర. ఉన్నత విద్యామండలి పిటిషన్ పరిశీలనలో ఉన్నప్పుడే న్యాయమూర్తి ఎస్‌వి భట్టి సానుకూలంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్ర విభజన చట్టం కింద విచారణకు వచ్చే అంశాలన్నిటినీ సింగిల్ జడ్డి కాకుండా డివిజన్ బెంచి పరిశీలిస్తే సమంజసంగా ఉంటుందంటూ తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అంతటితో ఆగకుండా పదో షెడ్యూల్ కింద పేర్కొన్న ఉమ్మడి సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి కనుక వాటి నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉండకూడదనీ, ఇందుకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్‌ను వేరే న్యాయమూర్తి విలాస్ అఫ్జల్‌పూర్కర్‌తో దాఖలు చేసింది. అన్ని అభ్యర్థనలనూ పరిశీలించిన తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా తన పదవీ విరమణకు ముందు వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నది కనుక అది తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందంటూ తీర్పు ఇచ్చారు. వెంటనే తెలంగాణ విద్యామండలి అధికారులు మసాబ్ ట్యాంకు దగ్గరున్న ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 ఈ విధంగా 1958లో ఉన్నతాశయాలతో ఏర్పడిన ఉన్నత విద్యా మండలి వివాదాలపాలై నవ్వులపాలయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా మండలి ఎక్కడికి పోవాలన్నది ఒక్కటే ప్రశ్న కాదు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, 2014, లోని పదో షెడ్యూల్‌లో పేర్కొన్న 108 ఉమ్మడి సంస్థలలో అత్యధికం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. సేన్‌గుప్తా తీర్పు ప్రకారం ఆ సంస్థలన్నిటి నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే కావాలి. కానీ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం హైదరాబాద్ నగరంలో ఉన్న సంస్థలు తెలంగాణలో ఉన్నట్టు చెప్పడం వివాదాస్పదం అవుతుంది. సేన్‌గుప్తా తీర్పు పదో షెడ్యూల్ స్ఫూర్తికి భిన్నంగా ఉంది. ఇందుకు కారణం ఏపీ అడ్వకేట్ జనలర్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలోపం కావచ్చు. ప్రభుత్వ వైఖరి కావచ్చు. రెండు రాష్ట్రాలూ సమన్వయంతో నడుచుకోవాలనీ, పదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల నిర్వాహకులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సమాలోచన చేసి రెండు రాష్ట్రాల ప్రజలకూ సేవలందించాలనీ చెప్పవలసింది పోయి, సంస్థ కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నది కనుక అది తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందంటూ తీర్పు చెప్పడం తర్కానికి అందడం లేదు. ఇది విపరీతమైన పరిణామాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థలలో ఏవి ఏ రాష్ట్ర పరిధిలో పని చేయాలో చట్టంలోనే స్పష్టం చేసి ఉంటే ఇంత గందరగోళం ఉండేది కాదు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చొరవ తీసుకొని ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించినా ఈ పాటికి స్పష్టత వచ్చేది. సంవత్సరంలోగా రెండు రాష్ట్రాలూ కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలనీ లేదా కేంద్రం పరిష్కరించాలనీ చట్టంలోని 76వ షెడ్యూలు స్పష్టం చేసింది. కేంద్రం పట్టించుకోకపోయినా సరే, రెండు రాష్ట్రాల విద్యామంత్రులూ, ఉన్నత విద్యా మండళ్ల సంచాలకులూ ఒక చోట కూర్చొని ఉన్నత విద్యను ఎట్లా ఉద్ధరించాలో ఆలోచించాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement