పశు క్రాంతి | Sakshi
Sakshi News home page

పశు క్రాంతి

Published Thu, Jan 22 2015 10:53 PM

పశు క్రాంతి - Sakshi

లీటర్లకొద్దీ పాలిచ్చే గేదెలు.. ట్రాక్టర్‌కు తీసిపోకుండా నాగలి దున్నగలిగే దున్నపోతులు.. కళ్లు తిప్పుకోనివ్వని జెర్సీ ఆవుల అందాలు! ఇవన్నీ ఎక్కడో కాదు... నగరం నడిబొడ్డునే. నగరంలోని నార్సింగికి పల్లె కదిలొచ్చింది. పండుగ కళ తెచ్చింది...
 
ప్రతి ఏటా సంక్రాంతి తర్వాతి రెండో శుక్రవారం లంగర్‌హౌస్ సమీపంలోని నార్సింగ్ మార్కెట్ కమిటీలో జరిగే పశువుల సంతలో పండుగ కళ కనబడుతోంది. పంటలు చేతికొచ్చి, డబ్బులు సమకూరాక రైతులు పశువులు కొనడం అనవాయితీగా వస్తోంది. నిజాం కాలం నుంచి కొనసాగుతున్న ఈ అంగడిలో హర్యానాకు చెందిన ముర్రా, మహారాష్ట్రలోని ఘోడేగావ్, గుజరాత్‌లోని ధుళియా, ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రా గుజ్జరి గేదెలు, దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈఏడు సంతలో నేపాల్ పశువులు కూడా అడుగిడుతున్నాయి. సెలబ్రిటీలు కూడా తమకిష్టమైన పశువులు కొనుగోలు చేసే ఈ సంతలో ఒక్కరోజే  కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.
 
ముర్రానా మాజాకా...

నల్లటి రంగు. భారీ దేహం. చెక్కినట్టుగా మెలితిరిగిన కొమ్ములు, జిగేల్మనిపించే పెద్ద కళ్లు.. ముర్రా జాతి బర్రెలు చూడగానే కట్టిపడేస్తున్నాయి. రోజుకు బకెట్ల కొద్దీ పాలు ఇచ్చే ఈ బర్రెల ధర లక్ష నుంచి రెండు లక్షలు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు వ్యాపారులు. హర్యానా, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన ఈ పశువులకు డిమాండ్ ఎక్కువ ఉందని హర్యానా వాసి ఉమాశంకర్ చెబుతున్నాడు. ఆవాల నూనె, బెల్లం, చక్కెరలను నీటిలో కలిపి ఈ బర్రెలకు ఇవ్వడం వల్ల కాల్షియం మోతాదు పెరిగి పాలు ఎక్కువగా ఇస్తాయని తెలిపారు.
 
భళా ధుళియా...
గుజరాత్ పోరుబందర్ నుంచి తీసుకొచ్చిన ధుళియా జాతి బర్రెలు కూడా ముర్రా, మిన్ని జాతి కంటే ఏమాత్రం తీసిపోవడం లేదు. మంచి దేహ దారుఢ్యం కలిగిన ఈ బర్రెలను జాఫ్రి ధుళియా అని కూడా పిలుస్తుంటారు. ఇవి రోజు పొద్దున, సాయంత్రం కలిసి 20 లీటర్ల పాలు ఇస్తాయని పశువుల విక్రేత డి.నవీన్ కుమార్ తెలిపారు. పత్తి పిండి, కంది పొట్టు, వరిగడ్డి, పచ్చిగడ్డి, గోధుమ, కంది, శనగ పొట్టులను కలిపి ఈ ధుళియాలకు పెడతామంటున్నారు.
 
కరిష్మా కేక...  
బర్రెలంటే మాకు ప్రాణం. పశువులను దేవతతో సమానంగా చూస్తాం. నాకు నచ్చిన ధుళియా జాతికి చెందిన ఈ బర్రెకు కరిష్మా అని పేరు పెట్టుకున్నా. 20 లీటర్ల పాలు ఇస్తుంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కరిష్మాను అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందంటున్నారు అబ్దుల్ అజ్మద్. హర్యానా నుంచి తీసుకొచ్చిన జెర్సీ ఆవుల అందాలు కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. ‘ఇవి 50వేల వరకు పలకొచ్చు. రోజుకు పది లీటర్ల పాలు ఇస్తాయ’ని రైతు లతికా శర్మ తెలిపారు.
- వాంకె శ్రీనివాస్

Advertisement
Advertisement